Sakshi News home page

US Presidential Election 2024: బైడెన్‌.. బైడెన్‌.. బై బై ఎందుకు చెప్పలేదు?

Published Sat, Apr 29 2023 5:12 AM

US presidential election 2024: President Joe Biden officially announces re-election campaign - Sakshi

ఎస్‌.రాజమహేంద్రారెడ్డి:

చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టే కాలమూ తన మానాన తాను పరిగెడుతూనే ఉంటుంది. ఎవరి కోసమూ ఆగదు. ఈ పరుగెత్తే కాలమే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాళ్లకు అడ్డం పడుతోంది. అయినా సరే, 80 ఏళ్ల బైడెన్‌ ఆగేదే లేదంటున్నారు. ‘అప్పుడేనా...!’ అంటూ మరో విడత అధ్యక్ష పదవికి సిద్ధమయ్యారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాట్ల అభ్యర్థిని తానేనని మొన్న మంగళవారం ఆయన అధికారకంగా ప్రకటించేశారు.

ఎదురు పడేది టెంపరి డొనాల్డ్‌ ట్రంపే కదా, ఇంకోసారి ఓడించలేనా అన్నది ఆయన ధీమా. ‘ఆయనకు 76, నాకు 80... అంతే కదా’ అన్నది ఆయన ధైర్యం. అంతేగానీ, ఇక కొత్త తరానికి వదిలేద్దామన్న భావన మాత్రం ఇద్దరిలోనూ లేకపోవడం గమనార్హం. డొనాల్డ్‌ ట్రంప్‌ విషయంలో చట్టం, ప్రెసిడెంట్‌ బైడెన్‌ విషయంలో కాలం తమ మానాన తమ పని చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉంటాయి. గిర్రున ఏడాది తిరిగేసరికి ఎన్నికల నగారా మోగుతుంది. గెలుపెవరిదో, ఓడేదెవరో మళ్లీ కాలమే చెబుతుంది...

రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న కాలంలో, అమెరికా ఆ యుద్ధ మైదానంలోకి దిగిన ఏడాదికి 1942లో బైడెన్‌ జన్మించారు. కాలచక్రం మరో 30 ఏళ్లు తిరిగేసరికి 1973లో తొలిసారి సెనేటర్‌ అయ్యారు. అప్పటికి వైట్‌హౌస్‌లో రిచర్డ్‌ నిక్సన్‌ కొలువుదీరి ఉన్నారు. అత్యంత పిన్న వయసు సెనేటర్‌గా చరిత్ర సృష్టించిన బైడెన్‌కు, 15 ఏళ్లు విరామం లేకుండా ఆ పదవిలో కొనసాగాక ‘నేనెందుకు శ్వేతసౌధంలో అడుగుపెట్టకూడదు?’ అన్న ఆలోచన వచ్చింది. 1988లో ఆ ముచ్చటా తీర్చుకుందామనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు.

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచి ముచ్చటగా మూడు నెలలు ముమ్మరంగా ప్రచారం కూడా చేసుకున్నాక అనివార్యంగా, అర్ధంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ఆ సమయానికి అమెరికా, సోవియట్‌ యూనియన్‌ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ఇంకా ముగియలేదు. ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తే, 2020లో బైడెన్‌ 78 ఏళ్ల వయసులో వైట్‌హౌస్‌ మెట్లెక్కి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వయసులో అధ్యక్షుడు కావడం కూడా అమెరికా చరిత్రలో రికార్డే. తన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు ఈ డెలావర్‌ పెద్దాయన బరిలో దిగుతున్నారు. గెలిచి తీరతానన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఈ ధీమా వెనక పలు కారణాలున్నాయి.

మళ్లీ ట్రంపే ప్రత్యర్థి అవుతారని...
దూకుడుకు కాసింత దుందుడుకుతనం కలిపితే డొనాల్డ్‌ ట్రంప్‌. అదే ఆయన స్వభావం. అదే ఆయన పెట్టుబడి కూడా. ఒకసారి తన చేతిలో ఓడిన ఈ ట్రంపే ఈసారి కూడా తన రిపబ్లికన్‌ ప్రత్యర్థి అని బైడెన్‌ ఫిక్సయిపోయారు. రిపబ్లికన్‌ పార్టీ తమ తుది అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినా, ట్రంప్‌కే చాన్స్‌ దక్కే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నికీ హేలీ, టెక్‌ దిగ్గజం వివేక్‌ రామస్వామి, రేడియో హోస్ట్‌ లారీ ఎల్డర్, అర్కన్సాస్‌ మాజీ గవర్నర్‌ అసా హుచిన్సన్‌ ప్రధానంగా ఆయనతో పోటీ పడుతున్నారు.

వీరిలో నికీ హేలీ నుంచే ట్రంప్‌కు కొంచెం గట్టి పోటీ ఎదురవ్వచ్చు. ట్రంప్‌ను పక్కకు నెట్టి బరిలోకి దిగుతాడనుకున్న ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిసాంటిస్‌ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే యోచనలో ఉన్నట్టు లేరు. మొత్తమ్మీద బైడెన్‌ ప్రత్యర్థిగా ట్రంప్‌ దాదాపుగా ఖాయమైనట్టే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడినా తానే గెలిచానని డాంబికాలు పలికి, కేపిటల్‌ హిల్‌పై దాడికి తన అభిమానులను, రిపబ్లికన్‌ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో ట్రంప్‌ గ్రాఫ్‌ దారుణంగా పడిపోయిందన్నది బైడెన్‌ అంచనా.

అపప్రథ మూటగట్టుకున్న ట్రంప్‌ను ఓడించడం ఈసారి మరింత తేలికని ఆయన భావిస్తున్నారు. మీద పడుతున్న వయసును లెక్కచేయకుండా బైడెన్‌ ముందుకురకడానికి ఇదే ప్రధాన కారణం. పోర్న్‌ నటికి డబ్బుల చెల్లింపు విషయంలో ట్రంప్‌ను కోర్టు ముద్దాయిగా ప్రకటించడమూ తనకు లాభిస్తుందని ఆశపడుతున్నారు. అయితే ట్రంప్‌ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని రిపబ్లికన్లలో చాలామంది నమ్ముతుండటంతో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన అవకాశాలు మరింత మెరుగయ్యాయన్నది విశ్లేషకుల అంచనా.

రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుల్లో ట్రంప్‌ హవా కొనసాగుతున్నా ప్రజల్లో మాత్రం ఆయన పట్ల అసంతృప్తి పెరిగిందన్నది డెమొక్రాట్ల వాదన. 2018 నుంచీ ట్రంప్‌ పయనం ఓటమి బాటలోనే సాగుతుండటం గమనార్హం. 2018 మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో రిపబ్లికన్లు సెనేట్‌ను, హúజ్‌ను రెండింటినీ కోల్పోయారు. 2020లో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి చవిచూశారు. 2022 మిడ్‌ టర్మ్‌ ఎన్నికల్లోనూ ట్రంప్‌ సారథ్యం వల్ల పార్టీ అనూహ్య పరాజయం చవిచూసింది. మొత్తమ్మీద రిపబ్లికన్లకు ట్రంప్‌ గుదిబండగా తయారవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కోర్టు కేసులు ట్రంప్‌కు కొత్త ఊపిరిలూదినా ఆయనను ఓడించడం తనకొక్కడికే సాధ్య మని బైడెన్‌ నొక్కివక్కాణిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఓడించి చూపించానని పదేపదే చెబుతున్నారు. వయసుదేముంది, అదో అంకె మాత్రమేనన్నది ఆయన భావన. వచ్చే ఏడాది బరిలో దిగే సమయానికి ట్రంప్‌కు 78 ఏళ్లొస్తాయి. తనకన్నా నాలుగేళ్లే చిన్న కదా అంటారు బైడెన్‌. ఒకవేళ అంచనాలన్నీ తారుమారై ట్రంప్‌కు రిపబ్లికన్‌ అభ్యర్థిత్వం దక్కకున్నా ఆయన స్వతంత్రుడిగా బరిలోకి దిగడం ఖాయం. రిపబ్లికన్‌ మద్దతుదార్ల ఓట్లు చీలడం తథ్యం. అదే జరిగితే బైడెన్‌ పని మరింత సులువవుతుంది.

ఓటు ‘విచ్ఛి్చత్తి’
అబార్షన్ల (గర్భవిచ్ఛిత్తి) చట్టబద్ధత చెల్లదని రిపబ్లికన్స్‌ అనుకూల సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం కూడా డెమొక్రాట్లకు రాజకీయంగా లాభించింది. అబార్షన్లు అనైతికమని రిపబ్లికన్లు బాహాటంగా ప్రచారం చేసి స్వేచ్ఛావాదులు, స్త్రీవాదుల ఆగ్రహానికి గురయ్యారు. తన దేహం మీద స్త్రీకే పూర్తి హక్కుంటుందని, అబార్షన్‌ చేయించుకోవాలా, వద్దా అన్నది ఆమె ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుందనేది బైడెన్‌ టీమ్‌ వాదన. సనాతనవాదులు, మతవాదులకు ఇది రుచించకపోయినా ప్రజల్లో అధిక భాగం బైడెన్‌తో ఏకీభవించారు.

ఈ పరిణామం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అబార్షన్ల చట్టబద్ధతను తిరస్కరిస్తూనే, ఆయా రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు దాన్ని అమలు చేసే వెసులుబాటును సుప్రీంకోర్టు కల్పించడం గమనార్హం. అమెరికావ్యాప్తంగా ఈ తీర్పుకు అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు మిన్నంటాయి. రిపబ్లికన్‌ పాలిత కాన్సాస్, కెంటకీ, మోంటానా రాష్ట్రాలు ఆగమేఘాల మీద అబార్షన్లపై ఉక్కుపాదం మోపాయి. డెమొక్రటిక్‌పాలిత కాలిఫోర్నియా, మిషిగన్, వెర్మోంట్‌ అబార్షన్‌ హక్కుల పరిరక్షణకు ప్రతినబూనాయి.

ఈ పరిణామాలు ఓటర్లనూ రెండు వర్గాలుగా చీల్చాయి. సుప్రీం తీర్పు తర్వాత జరిగిన మిడ్‌ టర్మ్‌లో రిపబ్లికన్ల ఓటు బ్యాంకు చెల్లాచెదురు కావడానికి ఇదే ప్రధాన కారణమైంది. అబార్షన్‌ వ్యతిరేకతను రాజకీయ నినాదంగానే భావించిన రిపబ్లికన్‌ పార్టీ, ప్రజలు ఇంతగా ప్రభావితమవుతారని అంచనా వేయలేకపోయింది. పరోక్షంగా డెమొక్రాట్లకు అదనపు లాభం చేకూరింది. అబార్షన్లపై రిపబ్లికన్ల వైఖరే తన విజయానికి రెండో మెట్టు అవుతుందని బైడెన్‌ గట్టిగా నమ్ముతున్నారు.
 
అనుకూల ఓటు పదిలం

బైడెన్‌ విజయావకాశాలను ప్రభావితం చేసే పై రెండు అంశాలు ట్రంప్‌ వ్యతిరేక ఓటుతో ముడిపడి ఉన్నాయి. సగటు ఓటరును తమవైపు తిప్పుకునే మంచి పనులు కూడా బైడెన్‌ గత రెండేళ్లలో చాలానే చేశారు. అనుకూల ఓటు, కొత్త ఓటును పదిలం చేసుకోవడానికి ఇవి అండగా నిలుస్తాయి. ట్రంప్‌ పాలనలో అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనాను బైడెన్‌ సమర్థంగా అరికట్టి పార్టీలకతీతంగా ప్రజల మనన్నలు అందుకున్నారు. దిగుమతుల మీద ఆధారపడకుండా స్వదేశీ తయారీ ‘మేడిన్‌ అమెరికా’ భావానికి బహుళ ప్రచారం కల్పించారు.

ఆ దిశగా మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్ల స్థాపనకు బిల్లు తెచ్చారు. వైద్య చికిత్స ఖర్చులను తగ్గించడంతో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకున్నారు. విదేశీ వ్యవహారాల్లోనూ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించారు. నాటోకు వెన్నుదన్నుగా, ఉక్రెయిన్‌కు అండగా నిలిచి రష్యాను నిలువరించడం గమనించదగ్గవి. ప్రపంచంపై తన పెత్తనాన్ని నిలుపుకోవాలంటే చైనాపై ఓ కన్నేసి ఉంచాలనే సూక్ష్మాన్ని కూడా బైడెన్‌ గుర్తించడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఈ అంశాలన్నీ తనకు అనుకూలంగా ఓటుబ్యాంకును సుస్థిరం చేస్తాయనే నమ్మకమే బైడెన్‌ను ఎన్నికలవైపు నడిపిస్తోంది.

కొస మెరుపు
బైడెన్‌కు ఇన్ని అనుకూలతలున్నా ట్రంప్‌కు 2020 ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లు వచ్చాయన్నది తోసిపుచ్చలేని అంశం. రిపబ్లికన్లు ట్రంప్‌ను పక్కన పెట్టి అనూహ్యంగా తమ తురుపు ముక్క డిసాంటిస్‌ను తెరపైకి తెస్తే మాత్రం బైడెన్‌ వయసు చర్చనీయాంశంగా మారుతుంది. అన్నీ మంచి శకునములేనని బైడెన్‌ భావిస్తున్నా ఆర్థిక నిర్వహణ వంటి వ్యవహారాల్లో ఆయన పనితీరుపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

వెక్కిరిస్తున్న ద్రవ్యోల్బణం వంటివాటిని ఉదాహరణగా చూపుతున్నారు. అనుకూల, ప్రతికూల పవనాలెలా ఉన్నా వయసు విషయంలో మాత్రం బైడెన్, ట్రంప్‌ దొందూ దొందే అన్నది తటస్థుల అభిప్రాయం. 2024 నవంబర్‌లో జరిగే ఎన్నికల్లోగా ఏమైనా జరగొచ్చు. చివరికి గెలుపు ఎవరినైనా వరించవచ్చు. ఇప్పటికైతే బైడెన్‌ ఆత్మవిశ్వాసాన్ని కొట్టిపారేయలేం. అయినా రాజకీయాల్లో వయసుతో పనేముంది? అధికారమే ముఖ్యం! బైడెన్‌కైనా, ట్రంప్‌కైనా లక్ష్యం అదే!

‘‘రాజకీయం ఒక రంగులలోకం అధికారమొక తీరని దాహం’’

Advertisement
Advertisement