భారత్‌పై కెనడా ఆరోపణలు తీవ్రమైనవి: అమెరికా | Sakshi
Sakshi News home page

భారత్‌పై కెనడా ఆరోపణలు తీవ్రమైనవి: అమెరికా

Published Wed, Sep 20 2023 6:32 PM

US Says Canada Allegations Serious Seeks India's Cooperation - Sakshi

కెనడా, భారత్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కెనడాలో భారత్‌ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఖలీస్థానీ సానుభూతిపరుడు హర్దిప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతవాతావరణం నెలకొంది. ట్రూడో వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. నిజ్జార్‌ హత్యతో రాజుకున్న చిచ్చు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న టెన్షన్‌ మొదలైంది.

తాజాగా కెనడా భారత్‌ వివాదంపై ప్రపంచ దేశాల నేతలు దృష్టి పెడుతున్నాయి. కెనడా ఆరోపణలను అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తీవ్రంగా పరిగణించాయి. ఈ మేరకు అమెరికా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నిజ్జర్‌ హత్య అంశంపై దర్యాప్తు చేసేందుకు ఒట్టావాకు తాము మద్దతిస్తున్నామని అదే విధంగా దీనికి సహకరించడానికి భారత్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 
చదవండి: కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు

భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు తీవ్రమైనవని యూఎస్‌ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ అన్నారు. దీనిపై కెనడా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా కెనడాకే వదిలేస్తున్నామని తాము ఈ విచారణలో భాగం కావాలనునుకోవడం లేదని పేర్కొన్నారు.  ఈ దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కోరుతున్నామని చెప్పారు. 

తాను దౌత్యపరమైన సంబంధాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కిర్బీ పేర్కొన్నారు. అమెరికా  అధ్యక్షుడు జో బైడెన్‌  కెనడా ఆరోపణలను పరిశీలిస్తున్నారని, అవి చాలా తీవ్రమైనవని పేర్కొన్నారు. ట్రూడో ఆరోపణలపై పారదర్శకంగా వ్యవహరించాలని అమెరికా కోరుతోందన్నారు. తాము ఇరు భాగస్వామ్య దేశాలతో తాము టచ్‌లో ఉంటామని పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కెనడా చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతిస్తున్నామని చెప్పారు. పూర్తి పారదర్శకమైన సమగ్ర దర్యాప్తు సరైన పద్దతి అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల వాస్తవంగా ఏం జరిగిందో అందరికీ తెలుస్తుందన్నారు.

మరోవైపు కెనడాలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. ఆందోళన జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని కోరింది. కెనడా వెళ్లాలనుకునే వారు కూడా వాయిదా వేసుకోవాలని సూచించింది.ఈ మేరకు ప్రత్యేక గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది.

ఎవరీ నిజ్జర్‌
హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌(45) పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని భార్‌ సింగ్‌పుర గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు 1997లో కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లాడు. నాటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడు. ఈ సంస్థను భారత్‌ నిషేధించింది. 2020లో నిజ్జర్‌ను భారత్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్‌ వాంటెండ్‌ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

2007లో లుథియానాలో జరిగిన బాంబుపేలుడు కేసులో నిజ్జర్‌ మోస్ట్‌ వాంటెడ్‌. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. అంతేగాక గతేడాది ఓ హత్యకేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ నిజ్జర్‌ను పట్టించిన వారికి రూ.10లక్షల రివార్డును ప్రకటించింది. అయితే ఈ ఏడాది జూన్‌ 18న కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేవద్ద గురుద్వారా వద్ద ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను కాల్చి చంపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement