రష్యాకు అమెరికా వార్నింగ్‌.. అదే గనుక జరిగితే.. | Sakshi
Sakshi News home page

తీవ్ర పరిణామాలు తప్పవు: రష్యాకు అమెరికా వార్నింగ్‌!

Published Mon, Apr 19 2021 1:50 PM

US Warns Russia Of Consequences Navalny Deceased In Prison - Sakshi

వాషింగ్టన్‌: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(44) ఆరోగ్య పరిస్థితిపై అమెరికా స్పందించింది. ఒకవేళ ఆయన గనుక జైలులో మరణించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ... ‘‘మిస్టర్‌ నావల్నీకి ఏం జరిగింది, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందన్న అంశం గురించి రష్యా ప్రభుత్వంతో మాట్లాడాము. కస్టడీలో ఆయనకు ఏమైనా జరిగితే అంతర్జాతీయ సమాజానికి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేశాం. ఆయన పోలీస్‌ కస్టడీలో మరణిస్తే, రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించాలన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నాం. అయితే వీటన్నింటినీ ఇప్పుడే బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మిస్టర్‌ నావల్నీ మృతి చెందితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. 

మరోవైపు, యూరోపియన్‌ యూనియన్‌ సైతం నావల్ని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ‘‘నావల్నిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత రష్యా అధికారులపై ఉంది. ఏదైనా జరగరానిది జరిగితే వాళ్లు జవాబుదారీగా ఉండాల్సిందే’’అని ఈయూ విదేశాంగ విధాన విభాగం అధినేత జోసెఫ్‌ బారెల్‌ ట్వీట్‌ చేశారు. కాగా  పుతిన్‌ విధానాలను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాననీ, కాళ్లలో స్పర్శ కోల్పోయానని వ్యక్తిగత వైద్యులను అనుమతించాలంటూ నావల్నీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

అయితే, ఇందుకు సానుకూల స్పందన రాకపోవడంతో మూడు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఆయన ఏ క్షణంలోనైనా మరణించే అవకాశం ఉందని నావల్నీ పర్సనల్‌ డాక్టర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, రష్యా నుంచి తమ రాయబారిని వెనక్కి పంపించే యోచనలో బైడెన్‌ ప్రభుత్వం ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి రష్యా పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను తరలించడంపై జో బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఫోన్‌ చేసిన ఆయన, ఉద్రిక్తతలను నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

చదవండి: రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం: ‘ఏ క్షణంలోనైనా మృతి’

Advertisement
Advertisement