ప్రవాసంలోకి ప్రిగోజిన్‌ | Sakshi
Sakshi News home page

ప్రవాసంలోకి ప్రిగోజిన్‌

Published Mon, Jun 26 2023 5:34 AM

Wagner chief set to leave Russia after ending rebellion - Sakshi

మాస్కో: రష్యాలో ప్రైవేటు సైన్యం తిరుగుబాటు ముగిసింది. సైనిక నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి కొద్ది గంటల సేపు అల్లకల్లోలం సృష్టించిన ప్రైవేటు సైన్యం సంస్థ వాగ్నర్‌ చీఫ్‌ యెవెగినీ ప్రిగోజిన్‌ వెనక్కి తిరిగారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉన్న బెలారస్‌కు ప్రవాసం వెళ్లాలని ప్రయాణమయ్యారు. అయితే ఆయన బెలారస్‌ చేరుకున్నారో లేదో అన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

సైనికులంతా ఎక్కడివారు అక్కడికే ఉక్రెయిన్‌ శిబిరాల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. బెలారస్‌ అధ్యక్షుడు మధ్యవర్తిత్వంతో ఈ సంక్షోభం టీ కప్పులో తుపానులా సమసిపోయింది. ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్‌పై పెట్టిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకున్నట్టు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ప్రిగోజిన్‌తో పాటు తిరుగుబాటులో పాల్గొన్న వాగ్నర్‌ సైనికులపై ఎలాంటి విచారణ జరపబోమని స్పష్టం చేసింది. వాగ్నర్‌ సైనికుల్ని కాంట్రాక్ట్‌ పద్ధతిలో సైన్యంలోకి తీసుకుంటామని రష్యా రక్షణ శాఖ ఆఫర్‌ ఇచి్చంది.

రక్తపాతం వద్దు అనే..
ప్రిగోజిన్‌ను దేశద్రోహి, వెన్నుపోటుదారుడు అని అభివరి్ణంచిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అనూహ్యంగా ప్రిగోజిన్, అతని సైన్యాన్ని వదిలేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవైపు ఉక్రెయిన్‌తో పూర్తి స్థాయి లో తలబడలేక అంతర్జాతీయంగా ఉన్న పరువును పోగొట్టుకున్న పుతిన్‌ ఇప్పుడు అంతర్గత సంక్షోభాలను తట్టుకునే స్థితిలో లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘‘దేశంలో రక్తపాతం జరగకుండా చూడాలని, అంతర్గత పోరు కొనసాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న ఆందోళన కూడా ఆయనల ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్‌ ఎంత బలహీనంగా మారిపోయారంటే ఎలాంటి రిస్క్‌ చేయలేకపోతున్నారు’’అనే విశ్లేషణలు వినబడుతున్నాయి. మరోవైపు తిరుగుబాటు జరిగిన మర్నాడే రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ఆండ్రూ చైనా పర్యటనకు వెళ్లారు. చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌తో తాజా పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రష్యాకు చైనా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే.   

రష్యా రక్షణ వ్యవస్థపై నీలినీడలు  
ప్రిగోజిన్‌ తిరుగుబాటుతో రష్యా రక్షణ వ్యవస్థలో ఉన్న డొల్లతనం బయటపడింది. వాగ్నర్‌ గ్రూప్‌ సైనికులు రాత్రికి రాత్రి కొన్ని గంటల వ్యవధిలో రోస్తావో నగరంలోకి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశించారు. ప్రభుత్వ సైనికులతో ఘర్షణలు చెలరేగాయి. ఈ సమయంలో వాగ్నర్‌ సైనికులు చేసిన దాడుల్లో 39 మంది పైలెట్లు మరణించినట్లు తెలుస్తోంది.

అమెరికాకి ముందే తెలుసు
రష్యాపై ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేస్తారని అమెరికా నిఘా సంస్థలు ముందే పసిగట్టాయని వాషింగ్టన్‌ పోస్ట్, న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాలు ప్రచురించాయి. జూన్‌ మధ్యలో ప్రిగోజిన్‌ రష్యాపై తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా నిఘా సంస్థలకు సమాచారం  అందింది. వారం క్రితం నిర్ధారణగా తెలిసింది. తిరుగుబాటుకు ఒక్క రోజు ముందే రష్యాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని అమెరికా ప్రభుత్వానికి నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి.

పుతిన్‌కు ఒకరోజు  ముందే తిరుగుబాటు విషయం తెలుసని అమెరికా మీడియా అంటోంది. రష్యాలో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్‌ బైడెన్‌ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలతో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడారు. తమ మద్దతు ఎప్పటికీ ఉక్రెయిన్‌కే ఉంటుందని పునరుద్ఘాటించారు. రష్యాలో తిరుగుబాటు జరిగినంత మాత్రాన తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ స్పష్టం చేశారు.   
 

Advertisement
Advertisement