ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? | Why India Fears The Khalistan Movement, Reason Behind Why Canadian Muslims Supporting The Khalistanis - Sakshi
Sakshi News home page

ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు?

Published Wed, Sep 27 2023 11:32 AM

Why are Canadian Muslims supporting the Khalistanis - Sakshi

వేర్పాటువాది నిజ్జర్‌ హత్య అనంతరం భారత్, కెనడాల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా కెనడాలో నివసిస్తున్న ముస్లింలు ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు భారత్‌ తీరును తప్పుపడుతూ, ఖలిస్తానీలకు మద్దతు పలుకుతున్నారు. 

గతవారంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యకు భారతదేశమే కారణమని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను సస్పెండ్ చేశాయి. క్రమంగా ఈ వివాదం పెరుగుతూ వస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. 

సోదరభావంతో సిక్కులు, ముస్లింలు
తాజాగా కెనడాలో నివసిస్తున్న ఒక ముస్లిం న్యాయవాది మాట్లాడుతూ నిజ్జర్ హత్య ఉదంతం తమను ఆందోళనకు గురిచేసిందన్నారు. సిక్కు నేత హత్య తర్వాత దేశంలోని వాతావరణం అధ్వాన్నంగా మారిందన్నారు. జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. ఇక్కడ ముస్లింలు, సిక్కులు సోదరభావంతో మెలుగుతుంటారన్నారు. గత జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన విషయం విదితమే.

భారత్‌పై కఠిన వైఖరి అవలంబించాలి
భారత్-కెనడా వివాదం కారణంగా కెనడాలోని పలువురు ముస్లిం కార్యకర్తలు మైనారిటీలకు మరింత రక్షణ కల్పించాలని కోరుతున్నారని ఆ న్యాయవాది తెలిపారు.  భారత్‌పై కఠిన వైఖరిని అవలంబించాలని వారు కోరుతున్నారన్నారు. ప్రధాని మోదీ ముస్లింలపై వివక్ష చూపుతున్నారని కొందరు ముస్లిం కార్యకర్తలు ఆరోపిస్తున్నరని ఆ న్యాయవాది తెలిపారు.
 
ట్రూడో ప్రభుత్వం భద్రత కల్పించాలి
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ముస్లిం (ఎన్‌సీసీఎం) అడ్వకేసీ గ్రూప్ హెడ్‌ స్టీఫెన్ బ్రౌన్ మీడియాతో మాట్లాడుతూ ట్రూడో ప్రభుత్వం కెనడియన్ ముస్లింలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కెనడాలో భారత ప్రభుత్వ ఏజెంట్లు చాలా చురుగ్గా వ్యవహరిస్తారని, వారు వలసవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ట్రూడో ప్రభుత్వం తమ భద్రతకు హామీ ఇవ్వాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని కెనడియన్ ముస్లింలు కోరుతున్నారని బ్రౌన్ తెలిపారు. 

‘ఉర్దుస్తాన్’ కూడా ఏర్పాటు చేయాలని..
ఇండియా- కెనడా వివాదం మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఉగ్రవాది పన్నూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్లాన్‌ చేశాడు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని భావించాడు. ఖలిస్తాన్ మాత్రమే కాదు, ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా ‘ఉర్దుస్తాన్’ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. కాగా భారతదేశంలో ఉగ్రవాది పన్నూపై డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి. అతని ఆస్తులను కూడా జప్తు చేశారు.
 
విద్యార్థుల ఆందోళన 
ఇదిలా ఉండగా కెనడాలోని భారతీయ విద్యార్థుల బహిష్కరణ అంశం మరింత వేడెక్కుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ, పలువురు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో చదువుకుంటున్నవారిలో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన విద్యార్థులున్నారు. నకిలీ ఆఫర్ లెటర్ల ద్వారా తమకు కెనడా యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్ ఇచ్చారని ఈ విద్యార్థులు  ఆరోపిస్తున్నారు. చదువుకుని,  భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు కెనడాకు వచ్చిన ఈ విద్యార్థులు భారత్‌లోని ట్రావెల్ ఏజెంట్లను తప్పుపడుతున్నారు.
ఇది కూడా చదవండి: డార్క్‌ ఎర్త్‌ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు  ఆశ్చర్యపోతున్నారు?

Advertisement

తప్పక చదవండి

Advertisement