జోడియాక్‌ కిల్లర్‌ ఎవరు? సీరియల్‌ హత్యలు చేస్తూ, వార్తాపత్రికలకు ఏమని రాసేవాడు? | Sakshi
Sakshi News home page

జోడియాక్‌ కిల్లర్‌ ఎవరు?

Published Tue, Sep 19 2023 12:10 PM

Zodiac Killer known as Americas First Classic Serial Killer - Sakshi

1960వ దశకంలో అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం కాగానే వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జనం ఆ సమయంలో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోయేవారు. జనం ఇంతలా భయపడటానికి కారణం జోడియాక్ కిల్లర్. జోడియాక్‌  ఒక సీరియల్ కిల్లర్‌గా పేరొందాడు. జోడియాక్‌ అనేది అతని అసలు పేరు కాదు. అది ఆ సీరియల్‌ కిల్లర్‌ తనకు తానుగా పెట్టుకున్న మారుపేరు.

అమెరికాలో తొలి క్లాసిక్ సీరియల్ కిల్లర్‌గా పేరొందిన జోడియాక్‌ ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జనాలను ఒకరి తర్వాత ఒకరిని హత్యచేస్తూ వచ్చాడు.  ఈ నరహంతకుడు కొన్నిసార్లు తుపాకీతో కాల్చి, కొన్నిసార్లు కత్తితో పొడిచి జనాలను చంపేవాడు. అయితే ఈ జోడియాక్‌ కిల్లర్‌ తాను హత్య చేసిన తర్వాత వార్తాపత్రికలకు ఈ విషయమై లేఖలు పంపేవాడు. అతని ఉత్తరాలు కోడ్ లేదా సంకేత భాష రూపంలో ఉండేవి. వీటిని చదవడం చాలా కష్టంగా ఉండేది. జోడియాక్‌ తాను రాసే లేఖలలో పోలీసులను  దుర్భాషలాడేవాడు. తాను రాసిన లేఖలను ప్రచురించకుంటే మరింత మందిని చంపేస్తానని అదే లేఖలో బెదిరించేవాడు. 

యువ జంటలే లక్ష్యంగా ఈ సీరియల్‌ కిల్లర్‌ మారణకాండ సాగింది. ఈ హంతకుని చేతిలో మొత్తం 37 మంది హతులయ్యారు. అలాగే ఒంటరిగా ఎవరైనా దొరికితే వారిపై దాడి చేసి, చంపేసేవాడు. ఈ నరహంతకుడు సాగించిన ఇలాంటి ఐదు హత్యలను పోలీసులు నిర్ధారించారు. అయితే తాను స్వయంగా 37 మందిని చంపినట్లు ఈ సీరియల్‌ కిల్లర్ పత్రికలకు రాసిన లేఖలో పేర్కొన్నాడు.

‘ది సన్‌’లోని ఒక నివేదిక ప్రకారం జోడియాక్‌ కిల్లర్ వార్తాపత్రికలకు రాసిన తన నాల్గవ లేఖలో తన పేరు జోడియాక్‌ అని పెట్టుకుంటున్నట్లు తెలియజేశాడు. అయితే దీనికి నిర్దిష్ట కారణం తెలియజేయలేదు. క్రైమ్ రికార్డులలో ఈ పేరుతోనే అతని మీద కేసులు నమోదయ్యేవి. 

కాలిఫోర్నియా పోలీసులతో సహా అమెరికాలోని అన్ని ఏజెన్సీలు, డిటెక్టివ్‌లు ఎవరికి వారుగా జోడియాక్‌ కిల్లర్ కోసం వెదికారు. అయితే అతని జాడ ఎవరికీ తెలియరాలేదు. ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. ఈ నేపధ్యంలో జోడియాక్‌ కిల్లర్‌ కేసు 2004లో మూసివేశారు. అయితే ఈ కేసు 2007లో తిరిగి తెరిచారు. 
ఇది కూడా చదవండి: ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం!

Advertisement

తప్పక చదవండి

Advertisement