అయ్యో.. కోరుట్లలో ఇంత క్రైం పెరుగుతోందా? | Sakshi
Sakshi News home page

అయ్యో.. కోరుట్లలో ఇంత క్రైం పెరుగుతోందా?

Published Fri, Apr 21 2023 12:50 AM

- - Sakshi

కోరుట్ల: జిల్లాలోని పలు పట్టణాల్లో కొందరు యువకులు వీధుల్లో అడ్డాలు వేస్తున్నారు. చిత్తుగా మద్యం తాగుతున్నారు. జోరుగా గంజాయి పీల్చుతున్నారు. ఆ మత్తులో అనేక ఆగడాలకు తెగబడుతున్నారు. ఐదు రోజుల క్రితం బీజేవైఎం పట్టణ మాజీ అధ్యక్షుడు ఠాకూర్‌ ప్రవీణ్‌సింగ్‌ హత్య ఈ కోవలోనే చోటుచేసు కోవడం కలకలం రేపుతోంది.

వీధికో అడ్డా..

కోరుట్ల ప్రధాన వీధుల్లో కొందరు యువకులు రాత్రివేళ అడ్డాలు వేస్తున్నారు. రాత్రి 9 గంటలు దాటిందంటే చాలు.. ఆ కాలనీల్లోని కొందరు యువకులు ఒకచోటుకి చేరి బహిరంగంగా మద్యం తాగుతున్నారు. అందులో కొందరు గంజాయి పీల్చుతున్నట్లు సమాచారం.

అర్ధరాత్రి దాటినా యువకులు అడ్డాలు వదలకుండా.. వారి ఇళ్లకు వెళ్లకుండా ఫోన్లలో గంటల కొద్దీ మాట్లాడటం.. కలిసి తాగిన వారితోనే మత్తులో గొడవలకు దిగుతున్నారు. ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే.. మత్తులో ఉన్న యువకులు వారితో గొడవకు దిగుతున్నారు.

జులాయిలే..

● జులాయి యువకులు ఏదిచేసినా వారిపై ఫిర్యాదు చేస్తే ఎంతౖకైనా తెగబడతారన్న భయంతో చాలామంది ప్రజలు వెనకాడుతున్నారు.

● ఆయా వీధుల్లో రాత్రివేళ మహిళలు బయటకు రావడానికి జంకుతున్నారు.

● సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ చాటుగా గంజాయి పీల్చుతూ కొందరు యువకులు ఆ మత్తులో ఏం చేస్తున్నామనే స్పృహ లేకుండా తోటివారితోనే కొట్లాటలకు దిగుతున్నారు.

● ఠాకూర్‌ ప్రవీణ్‌సింగ్‌ హత్యలో పాల్గొన్న వారిలో కొందరు ఆయనతో రోజూ తిరిగేవారే ఉన్నారని, వారంతా స్నేహితులేనని పోలీసులు చెప్పడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

● కోరుట్లలో ఈనెల 7న ఓ యువకుడు నలుగురిని వెంటేసుకుని పర్మిల్‌ రూంకు వెళ్లి మద్యం తాగాడు. ఫోన్‌చేసి మరికొందరిని పిలిపించి వారిపైనే దాడి చేశాడు. పర్మిట్‌ రూం నిర్వాహకులు ఈవిషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

● పదిహేను రోజుల క్రితం కోరుట్ల అల్లమయ్యగుట్ట ప్రాంతంలో యువకులు మద్యం తాగి ఆ మత్తులో పరస్పరం దాడికి తెగబడ్డారు. ఈ గొడవ పోలీస్‌స్టేషన్‌కు చేరలేదు.

● నెలక్రితం కోరుట్ల అయిలాపూర్‌ రోడ్డులో కొందరు స్నేహితులు కలిసి రాత్రిపూట మద్యం తాగారు. ఆ మత్తులో మాటామాట పెరిగి కొట్లాడుకున్నారు. వారి దాడులతో సమీపంలోని ప్రజలు భయకంపితులయ్యారు.

రాత్రి గొడవ.. తెల్లవారి రాజీ..

రాత్రివేళ మద్యం మత్తులో గొడవలకు దిగుతున్న ఆకతాయిల తీరు పోలీస్‌స్టేషన్‌ దాకా వెళ్లడం లేదు. చాలామంది వారిలోవారు తెల్లవారి రాజీ కుదుర్చుకుంటున్నారు. రాజీ పడిన సందర్భాల్లో మనసులో ఉన్న పాత కక్షలు.. మళ్లీ మద్యం తాగిన సందర్భాల్లో బయటపడి తీవ్రమైన నేరాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి గొడవలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వారానికోసారి జరగడం గమనార్హం.

రాత్రివేళ వీధుల్లో అడ్డాలు వేస్తున్న యువకుల తీరులో జనం బెదిరిపోతున్నారు. రాత్రివేళ పోలీసుల పెట్రోలింగ్‌ నామమాత్రంగా జరగడంతో యువకుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఒక్కోసారి కొన్నిచోట్ల యువకులు అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకూ అడ్డాలు వేసి మద్యం తాగడం సమస్యాత్మకంగా మారింది.

కోరుట్లలో యువకులు అడ్డాలు వేసే ఏరియాలు

● ప్రకాశం రోడ్డు, ఝాన్సీరోడ్డు

● సంజీవయ్యనగర్‌, అంబేడ్కర్‌నగర్‌ వాగు

● కల్లూర్‌రోడ్డు, రైల్వే ట్రాక్‌ ఏరియా

● భీమునిదుబ్బ, భాగ్యనగర్‌, కల్లూర్‌రోడ్డు ఏరియాలు

● అయిలాపూర్‌రోడ్డు– కేరళ గ్రౌండ్‌ ప్రాంతం

● అల్లమయ్యగుట్ట, మాదాపూర్‌ కాలనీలు

● అయిలాపూర్‌ దర్వాజా, కాల్వగడ్డ బురుజు ఏరియా

ఆగడాలు నియంత్రిస్తాం

కోరుట్ల పట్టణంలో యువకుల ఆగడాల విషయంలో మాకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రతీఏరియాలో రాత్రిపూట పోలీస్‌ సిబ్బందితో పెట్రోలింగ్‌ చేయిస్తున్నాం. యువకులు అడ్డాలు వేసే ఏరియాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ మరింత పెంచుతాం. – ప్రవీణ్‌కుమార్‌, సీఐ, కోరుట్ల

1/3

ఠాకూర్‌ ప్రవీణ్‌సింగ్‌ హత్యకేసులో నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ రవీందర్‌రెడ్డి
2/3

ఠాకూర్‌ ప్రవీణ్‌సింగ్‌ హత్యకేసులో నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ రవీందర్‌రెడ్డి

3/3

Advertisement
Advertisement