వందేభారత్‌ వచ్చేస్తోంది! | Sakshi
Sakshi News home page

వందేభారత్‌ వచ్చేస్తోంది!

Published Wed, Jun 7 2023 10:08 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పూర్తిస్వదేశీ సాంకేతికతతో రూపొందిన సూపర్‌ఫాస్ట్‌ ట్రెయిన్‌ వందేభారత్‌ ఉమ్మడి జిల్లాలో కూత పెట్టనుంది. ఈనెలలో నాగపూర్‌ – సికింద్రాబాద్‌ మధ్య రైలు ప్రారంభానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాజీపేట – బల్లార్షా సెక్షన్‌లో ఈరైలు రెండుసార్లు ట్రయల్‌ రన్‌ పూర్తిచేసుకుంది. సోమవారం కూడా రైలు ఎక్కడా ఆపకుండా సికింద్రాబాద్‌ – నాగపూర్‌ వరకు 100 కి.మీ. వేగంతో నడిపినట్లు తెలిసింది. మే నెలలో తొలిసారి వందేభారత్‌ రైలును ఖాజీపేట – బల్లార్షా సెక్షన్‌లో ట్రయల్‌ రన్‌ చేపట్టగా సకాలంలో గమ్యస్థానం చేరుకుందని సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్‌ – విశాఖపట్నం, సికింద్రాబాద్‌ – తిరుపతి రూట్లలో వందేభారత్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్‌ – నాగపూర్‌ రూట్‌లో పరుగుతో రికార్డునెక్కనుంది.

రామగుండం, కాగజ్‌నగర్‌లో హాల్టింగ్‌?
అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన వందేభారత్‌ రైలు.. సికింద్రాబాద్‌ – ఖాజీపేట, ఖాజీపేట – బల్లార్షా సెక్షన్‌లో త్వరలో పరుగులు తీయనుంది. ఇటీవలే ఈ సెక్షన్‌లో మూడోలైన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఇదే సెక్షన్‌ మీదుగా వందేభారత్‌ను సికింద్రాబాద్‌ టు నాగపూర్‌ వరకు ట్రయల్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ – నాగపూర్‌ వరకు 581 కిలో మీటర్లు. సాధారణ రైళ్లకై తే ఈ రెండు నగరాల మధ్య 10 గంటలకుపైగా సమయం పడుతోంది.

వందేభారత్‌ రైలైతే 6.30 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే వీలుంది. మొన్న జరిగిన పరీక్షల్లో రైలు కేవలం ఆరుగంటల్లోనే చేరుకుందని సమాచారం. మిగిలిన అరగంటలో హాల్టింగ్‌ల సమయాన్ని తీసేసినా.. ఆరున్నర గంటల్లో చేరుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి, రామగుండం, ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో హాల్టింగ్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో మార్పులు కూడా ఉండవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

జగిత్యాల రూట్‌లో నడపాలి
జగిత్యాల రూట్‌లో చాలా మంది ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు కోసం ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి – జగి త్యాల మార్గంలో వందేభారత్‌ రైలు నడిపితే ముంబై వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఇ ప్పుడు 10 గంటల సమయం పడుతుంది. రూ.2 వేల ఖర్చవుతుంది. వందేభారత్‌ వస్తే.. వేగంగా ముంబై చేరుకుంటాం, ఖర్చు తగ్గుతుంది.
– నాగిరెడ్డి రాజిరెడ్డి, హార్వెస్టర్‌ యజమాని, జగిత్యాల

పెద్దపల్లిలో హాల్టింగ్‌ ఇవ్వాలి
ఖాజీపేట – బల్లార్షా సెక్షన్‌లో వందేభారత్‌ రైలు రానుండటం హర్షణీయం. దీంతో స్థానికులకు చాలామేలు జరుగుతుంది. పెద్దపల్లిలో హాల్టింగ్‌ ఉంటుందన్న ప్రచారంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లికి హా ల్టింగ్‌ కల్పిస్తే నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌ వాసులకు అనుకూలంగా ఉంటుంది.
– కొండి సతీశ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ

ట్రాక్‌ల సామర్థ్యం పెంపు
రైలు పరుగుపెట్టనున్న నాందేడ్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలో ట్రాక్‌స్పీడ్‌ పెంచారు. సికింద్రాబాద్‌ పరిధిలో ఖాజీపేట – బల్లార్ష రూట్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. దాదాపు 130 కి.మీ. వేగంతో ఈ మార్గంలో రైళ్లు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట – రామగుండం వరకు, పెద్దపల్లి – మెట్‌పల్లి వరకు కనిష్టంగా 90 కి.మీ. నుంచి గరిష్టంగా 130 కి.మీ. వరకు వేగంగా వెళ్లేలా ట్రాక్‌లు రెడీ చేశారు. భవిష్యత్తులో వందేభారత్‌ రైలును పెద్దపల్లి – కరీంనగర్‌, కరీంనగర్‌ – జగిత్యాల, జగిత్యాల – నిజామాబాద్‌ రూట్లలోనూ నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు, నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంటుంది. సిరిసిల్ల, జగిత్యాల విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉండనుంది.

Advertisement
Advertisement