లంచం తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ.. | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ..

Published Wed, Oct 4 2023 1:16 AM

- - Sakshi

జగిత్యాల: మెట్‌పల్లి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్‌ఐ తిరుపతితోపాటు అతడి సహాయకుడు ప్రవీణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంఘటన వివరాలను ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ వీవీ.రమణమూర్తి వెల్లడించారు. మండలంలోని మేడిపల్లికి చెందిన బద్దం శంకర్‌కు గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 797/ఉ/1లో తన భార్య లక్ష్మి పేరిట ఏడు గుంటల భూమి ఉంది.

దీనిని నాలా కన్వర్షన్‌ కోసం గత నెల 22న స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నాడు. ఆర్‌ఐ తిరుపతిని కలువగా.. రూ.25వేల లంచం కావాలని, లేకుంటే పని కాదని తేల్చి చెప్పాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని, రూ.15వేలు ఇస్తానని శంకర్‌ వేడుకున్నాడు. దీనికి ఆర్‌ఐ అంగీకరించాడు. ఈ క్రమంలో శంకర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

వారి సూచన మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్‌ఐని ఫోన్‌లో సంప్రదించగా.. తన సహాయకుడు ప్రవీణ్‌కు ఆ మొత్తాన్ని ఇవ్వాలని చెప్పాడు. దీంతో కార్యాలయానికి వెళ్లిన శంకర్‌ డబ్బులను ప్రవీణ్‌కు అందజేస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న అధికారులు ప్రవీణ్‌తోపాటు ఆర్‌ఐ తిరుపతిని పట్టుకున్నారు. పంచనామా నిర్వహించి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వారిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

ఏసీబీ దాడి సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకోగా.. అక్కడ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. సమాచారం తెలపడానికి, ఫొటోలు తీసుకునేందుకూ అంగీకరించలేదు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు అధికారులు కార్యాలయం బయటకు వచ్చి నామమాత్రంగా వివరాలు వెల్లడించి వెళ్లిపోయారు.

Advertisement
Advertisement