కుల సంఘాల మద్దతుపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

కుల సంఘాల మద్దతుపై ప్రత్యేక దృష్టి

Published Fri, Nov 10 2023 5:22 AM

-

● వారి కోసం ప్రత్యేక సమావేశాలు.. ఆత్మీయ సమ్మేళనాలు ● కుల పెద్దలకు పలు హామీలు

బుగ్గారం: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాల మద్దుతుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పలు సంఘాల ముఖ్య నాయకులను కలుస్తూ వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వారి మద్దతు కూడగట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇందుకోసం ఆయా కులాల్లోని తమ పార్టీ నాయకుల ద్వారా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించి తమకే మద్దతు తెలపాల్సిందిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇదే అవకాశంగా భావించిన కుల సంఘాల నాయకులు తమ సంఘం డిమాండ్లను ఆయా రాజకీయ పక్షాల ముందుంచుతున్నాయి. పనిలో పనిగా తమ వ్యక్తిగత డిమాండ్లను కూడా తమ పార్టీ పెద్దల ముందు పెట్టి వారి రాజకీయ భవిష్యత్తు కోసం భరోసా తీసుకుంటున్నారు. ఈ సంధర్భంగా పోటీ చేసే అభ్యర్థులు సైతం పలు హామీలనిస్తున్నారు. ఆయా కుల సంఘాల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టేందుకు సంఘ పెద్దలకు పలు హామీలనిస్తూ తమవైపు తిప్పుకుంటున్నారు.

తలెత్తుతున్న విబేధాలు

ప్రతీ కుల సంఘంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలుండడంతో.. ఎన్నికల వేళ ఆయా సంఘాల్లో విబేధాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు తమ సంఘాలను తమ పార్టీల సమావేశాల కోసం సిద్ధం చేస్తుండడంతో గ్రూపులుగా విడిపోతున్నారు. దీంతో సంఘాల్లో ఐక్యత దెబ్బతింటోందని పలువురు తటస్థులు వాపోతున్నారు. అసలు సంఘాలు బాహాటంగా వివిధ పార్టీలకు మద్దతు తెలపడమే సరికాదని పలువురంటున్నారు. తాము మద్దతిచ్చిన వ్యక్తి ఎన్నికల్లో గెలవకుంటే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలతో కుల సంఘానికంటే నాయకులకే ఎక్కువగా లబ్ధి జరుగుతుందని ఆరోపిస్తున్నారు. కుల సంఘాల్లో గ్రూపులు ఏర్పడి ఐక్యత లోపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా వివిధ కుల సంఘాల నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఆయా కుల సంఘాల నాయకులు

తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లాలో

వివిధ కులాల ఓటర్లు(సుమారుగా)

మున్నూరుకాపు 1,25,000

పద్మశాలి 1,10,000

గౌడ 89,000

మాదిగ 96,000

మాల 34,000

జగిత్యాల జిల్లాలోని ఓటర్లు

(నియోజకవర్గాల వారీగా)

కోరుట్ల 2,38,403

జగిత్యాల 2,29,242

ధర్మపురి 2,25,576

మొత్తం 6,93,221

Advertisement
Advertisement