● ప్రజలు అడ్లూరిని ఆదరిస్తే ఈశ్వర్‌ కుట్రపన్ని ఓడించారు ● ధర్మపురి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ● ఒక్కసారి అవకాశమివ్వండి.. కడుపులో పెట్టుకుంటా.. ● ధర్మపురి కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ | Sakshi
Sakshi News home page

● ప్రజలు అడ్లూరిని ఆదరిస్తే ఈశ్వర్‌ కుట్రపన్ని ఓడించారు ● ధర్మపురి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ● ఒక్కసారి అవకాశమివ్వండి.. కడుపులో పెట్టుకుంటా.. ● ధర్మపురి కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Published Sun, Nov 12 2023 1:26 AM

- - Sakshi

గొల్లపల్లి: బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గ ప్రజలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఆదరిస్తే సీఎం కేసీఆర్‌ అండతో కొప్పుల ఈశ్వర్‌ ఈవీఎంలను మార్చి తను గెలిచినట్లు ప్రకటించుకున్నారని విమర్శించారు. ధర్మపురి కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధ్యక్షతన శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కుట్ర చేసి గెలిచిన ఈశ్వర్‌ మంత్రి అయినప్పటికీ ఈ ప్రాంతవాసులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నా.. తాగు, సాగునీటి సమస్య తీరలేదన్నారు. రెండు గదులు కడితేనే పునాది బలంగా వేస్తామని, రూ.లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మాత్రం ఇసుకపై కట్టారని తెలిపారు. కేసీఆర్‌ను చౌరస్తాలో కొరడాతో కొడితే తప్ప సిగ్గురాదన్నారు. మార్పురావాలి.. కాంగ్రెస్‌ కావాలి అంటూ ప్రజలను ఉత్తేజపరిచారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి

: అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ఈ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్‌కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్యే ఉన్నానని, గెలిపిస్తే కడుపులో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడించారు. ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. 2018 ఎన్నికల్లో ప్రజలను తనను ఆదరించినా.. కొప్పుల ఈశ్వర్‌ కుట్ర పన్ని.. ఈవీఎంలను మార్పించి తన విజ యాన్ని అడ్డుకున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ తాను ప్రజలను నమ్ముకున్నానని, ఈసారి ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సభతో అడ్లూరి గెలుపు తథ్యమన్నారు. కొప్పుల అన్యాయం చేసినా లక్ష్మణ్‌కుమార్‌కు దేవుడే న్యాయం చేస్తాడన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పదవులు లేకున్నా, ఆర్థిక బలం లేకున్నా పార్టీలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్న అడ్లూరిని గెలిపించుకోవాలని సూచించారు. మాజీ ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పథకాల్లో సీఎం కేసీఆర్‌ వేల కోట్ల స్కాం చేసి తెలంగాణను అవినీతిలో ముంచారన్నారు. కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కటారి చంద్రశేఖర్‌రావు, ధర్మపురి, గొల్లపల్లి, వెల్గటూర్‌, పెగడపల్లి, బుగ్గారం మండలాల అధ్యక్షులు సంగనభట్ల దినేష్‌, ముస్కు నిషాంత్‌రెడ్డి, రాములుగౌడ్‌, శైలేందర్‌రెడ్డి, సుభాష్‌, నాయకులు గజ్జెల స్వామి, కిష్టంపేట రమేశ్‌రెడ్డి, తాడూరి సత్యనారాయణ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌

ధర్మపురిలో నిర్వహించిన విజయభేరి సభతో కాంగ్రెస్‌లో జోష్‌ నింపింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా చేరుకున్నారు. పట్టణంలో ఎటు చూసినా కాంగ్రెస్‌ జెండాలే కనిపించాయి. ట్రాక్టర్‌లలోనూ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు. కొద్దిదూరం స్వయంగా ట్రాక్టర్‌ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సభలో అడ్లూరి మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంతో నృత్యాలు చేశారు. సభ వేదికముందే పార్టీ జెండాలతో కార్యకర్తలు డ్యాన్స్‌లు చేస్తుంటే వేదికపై ఉన్న నాయకులు ఆనందంగా కనిపించారు.

మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, చిత్రంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు
1/3

మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, చిత్రంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు

బహిరంగ సభకు హాజరైన ప్రజలు
2/3

బహిరంగ సభకు హాజరైన ప్రజలు

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement