పేకాట స్థావరంపై దాడి | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి

Published Tue, Nov 14 2023 12:34 AM

ముస్తాక్‌(ఫైల్‌) - Sakshi

మెట్‌పల్లి: రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. వారి నుంచి రూ.6.50లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో

యువకుడి దుర్మరణం

కోరుట్లరూరల్‌: చిన్నమెట్‌పల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో మహమ్మద్‌ ముస్తాక్‌(30) అనే వ్యక్తి మృతిచెందాడు. సోమవారం తను కౌలుకు చేసే పొలంలో కింద పడి ఉన్న విద్యుత్‌ తీగను చుడుతుండగా.. షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

చంద్రన్నను ప్రజలు నమ్మొద్దు

మంథని/ముత్తారం: ముత్తారం మండలం మచ్చుపేటకు చెందిన బందారపు మల్లయ్య అలియాస్‌ చంద్రన్న సీపీఐ మావోయిస్టు పార్టీ నుంచి డబ్బులు ఎత్తుకొచ్చాడని, అతడిని విప్లవ ప్రజలు, అమరవీరుల కుటుంబాలు నమ్మొద్దని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. 1986–87లో గత పీపుల్స్‌వార్‌ పార్టీలో రిక్రూమెంట్‌ అయిన చంద్రన్న మంథని ఏరియాలో దళ సభ్యుడి నుంచి కమాండర్‌, జిల్లా కమిటీ మెంబరుగా పని చేశాడని, మంథని ఏరియాలో పని చేసే క్రమంలో జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించాడన్నారు. మచ్చుపేట గ్రామంలో కామ్రెడ్స్‌ గట్టన్న, అమృతక్కతో పాటు దాదాపు ఎనిమిది మంది కామ్రెడ్స్‌ వారి ఆశయ సాధనలో అమరులయ్యారని, ఉద్యమ అవసరాలరీత్యా 2003లో దండకారణ్యానికి బదిలీ అయిన చంద్రన్న.. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జిల్లా కమిటీ మెంబర్‌, కార్యదర్శిగా నిబద్ధతతో పని చేశాడని వివరించారు. ఉద్యమంలో ఎగుడుదిగుడులు, మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయాడని, నిర్బంధం పెరిగి దాడులు జరగడంతో ప్రాణ భయంతో ప్రజలకు ద్రోహం చేసి డబ్బులు ఎత్తుకొని పారిపోయాడని పేర్కొన్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలోనే చంద్రన్నపై మావోయిస్టు ప్రకటన విడుదలయినట్లు తెలుస్తోంది.

బొగ్గు తరలిస్తున్న లారీ పట్టివేత

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి శివారులో బొగ్గును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకొని సింగరేణి కాంట్రాక్టర్‌ నరసింగరావు, డ్రైవర్‌ కార్తీక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. గోదావరిఖని 11బొగ్గు గని నుంచి రాఘవాపూర్‌ రైల్వే స్టేషన్‌కు బొగ్గును తరలించాల్సిన కాంట్రాక్టర్‌ నర్సింగరావు అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా.. రంగంపల్లి వద్ద సింగరేణి సెక్యూరిటీ జూనియర్‌ ఇన్స్‌పెక్టర్‌ ఉమేశ్‌, ఇతర సిబ్బంది పట్టుకున్నారన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

జమ్మికుంట(హుజూరాబాద్‌): రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. జమ్మికుంట పట్టణ సీఐ రమేశ్‌ వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన కోడెం శ్రీనివాస్‌కు గోదావరిఖనికి చెందిన సువర్ణ(35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. దంపతులిద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి నోము ఉందని శనివారం రాత్రి దంపతులు హైదరాబాద్‌ నుంచి బైక్‌పై సైదాబాద్‌ వస్తున్నారు. జమ్మికుంట పట్టణ శివారులోని స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వాహనం అదుపుతప్పడంతో సువర్ణ కిందపడింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్‌ అజాగ్రత్తగా బైక్‌ నడపడం వల్లే సువర్ణ మృతి చెందిందని ఆమె సోదరుడు పోరండ్ల భీంరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement
Advertisement