రైతు బలవన్మరణం | Sakshi
Sakshi News home page

రైతు బలవన్మరణం

Published Tue, Nov 21 2023 12:42 AM

విద్యార్థులను అభినందిస్తున్న జనార్దన్‌ రెడ్డి
 - Sakshi

గొల్లపల్లి: మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన గుడ్ల చంద్రయ్య(50) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రయ్య రెండేళ్లుగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ నెల 17న తన భార్యతో గొడవ పడి, ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తన పొలానికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. సోమవారం అటుగా వెళ్లిన స్థానికులు ఉరితాడుకు వేలాడుతున్న చంద్రయ్య మృతదేహాన్ని గుర్తించారు. మానసిక సమస్యల కారణంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి పెద్ద కుమారుడు మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేశ్‌కుమార్‌ తెలిపారు.

ఆటోడ్రైవర్‌పై కేసు

కరీంనగర్‌ క్రైం: అనుమతి తీసుకోకుండా ఓ పార్టీ అభ్యర్థికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను తన ఆటోపై అంటించుకున్న ఆటోడ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం.. భూక్య బాక్య కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రచార పోస్టర్‌ను తన వాహనంపై అంటించుకున్నాడు. బస్టాండ్‌ వద్ద ఎన్నికల పర్యవేక్షణ అధికారులు గుర్తించి, అనుమతి పత్రం చూపించాలని కోరగా లేదని చెప్పాడు. దీంతో వారు వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాక్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ స్వామి తెలిపారు.

మద్యం దుకాణంపై..

పెద్దపల్లిరూరల్‌: పట్టణంలోని చంద్రవైన్స్‌లో రికార్డులు సరిగా రాయని కారణంగా రూ.15వేల జరిమానా విధించినట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డి తెలిపారు. అలాగే, ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన కుమారస్వామి అక్రమంగా బైక్‌పై మద్యం రవాణా చేస్తుండగా పట్టుకుని సీజ్‌ చేసి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. మద్యం దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

మద్యం తాగి వాహనం

నడిపిన వ్యక్తికి జైలు

గోదావరిఖని(రామగుండం): డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు రామగుండం ట్రాఫిక్‌ సీఐ టి.ప్రవీణ్‌కుమార్‌ సోమవారం తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తిని సోమవారం గోదావరిఖని సెకండ్‌ అడిషనల్‌ మేజిస్ట్రేట్‌ వెంకటేశ్‌ ఎదుట హాజరుపరుచగా ఈ శిక్ష విధించినట్లు సీఐ పేర్కొన్నారు.

జాతీయ జూడో పోటీల్లో సత్తా చాటాలి

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జాతీయ స్థాయి జూడో పోటీల్లో సత్తా చాటి, జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని నోయిడాలో ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న పోటీలకు ఎంపికై న కరీంనగర్‌లోని వివేకానంద సీబీఎస్‌ఈ పాఠశాల విద్యార్థులు పి.చక్రీన్‌, పి.సహస్రితలను ఆయన సోమవారం అభినందించారు. కరీంనగర్‌ జిల్లా జూడో క్రీడకు పెట్టింది పేరని, ఎందరో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని పేర్కొన్నారు. కోచ్‌, పాఠశాల పీఈటీ సత్యనారాయణ, విద్యార్థులను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి, ఒలింపిక్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌ రెడ్డి, వివేకానంద సీబీఎస్‌ఈ పాఠశాల చైర్మన్‌ పి.సుధాకర్‌రావు, డైరెక్టర్‌ టి.లలితకుమారి, ప్రిన్సిపాల్‌ రేణుక తదితరులు అభినందించారు.

Advertisement
Advertisement