అక్షరాలా.. రూ.50 కోట్లు | Sakshi
Sakshi News home page

అక్షరాలా.. రూ.50 కోట్లు

Published Thu, Nov 30 2023 1:40 AM

ఓ సభలో పాల్గొన్న మహిళలు - Sakshi

● ప్రచారంలో మహిళా సంఘాల హవా ● గల్లీ నుంచి ఢిల్లీ పెద్దల సభల దాకా.. ● సభల విజయవంతంలో కీలక పాత్ర

కోరుట్ల: గల్లీ నుంచి ఢిల్లీ పెద్దల దాకా ఏ సభ చూసినా మహిళా సంఘాలదే హవా. ప్రధాన పార్టీల ప్రచార పర్వంలో ఈ ఎన్నికల్లో మహిళా సంఘాల పాత్ర కీలకంగా మారింది. క్షేత్రస్థాయిలో మహిళలు లేకుండా ఏ సభ సక్సెస్‌ కాలేదంటే అతిశయోక్తి కాదు. కీలక నేతల సభలకే కాదు.. ఇంటింటికి తిరిగి పార్టీలకు ప్రచారం చేయడంలోనూ మహిళా సంఘాల సభ్యులు హుషారుగా పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోనూ ప్రధాన పార్టీల ప్రచార పర్వంలో ఇదే సీన్‌ కనిపించింది. ఎన్నికల ప్రచార పర్వం ముగిసినా.. పోలింగ్‌ ఏజంట్లుగా, పోలింగ్‌ బూతుల ముందు ప్రచారంలోనూ వీరిదే కీలక పాత్ర కానుంది.

రూటు మార్చిన పార్టీలు

గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీల కార్యకర్తలు, నాయకులతోనే జరిగిన ప్రచారం.. ఈసారి మహిళా సంఘాల సభ్యులతోనే ఉరుకులు.. పరుగులు పెట్టిందనడంలో సందేహం లేదు. మహిళా సంఘాలను ప్రచారంలో దించడానికి, సభలు, సమావేశాలకు తరలించడానికి ప్రధాన పార్టీలిచ్చిన డబ్బులు కీలకంగా పని చేశాయన్న అంశం బహిరంగ రహస్యంగా మారింది. ఈ విషయంలో ఏ పార్టీ ఇంకొకరికి తీసిపోలేదు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి సెగ్మెంట్లలోని మొత్తం ఓటర్లలో మహిళల ఓట్లు సుమారుగా 4,59,000 ఉన్నాయి. మొత్తం మహిళా ఓటర్లలో దాదాపుగా 80 శాతం వరకు మహిళా సంఘాలు, పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఆయా సంఘాల లీడర్ల ఆసరాతో సంఘంలోని సభ్యులకు సభలు, ప్రచారాలకు పార్టీల తీరుననుసరించి ఒక్కో మహిళకు రోజుకు రూ.100–300 వరకిచ్చారు. జిల్లాలోని కొన్నిచోట్ల కీలక నేతల ప్రచార సభలకు మహిళా సంఘాల లీడర్లు తమను పిలవలేదని సభ్యులు కొంతమంది లీడర్ల తీరుపై మండిపడ్డ సంఘటనలున్నాయి. కొన్నిచోట్ల ఇలాంటి గొడవలు బాహాటంగా జరిగి రచ్చకెక్కాయి.

రూ.50 కోట్ల పైమాటే..

పది రోజులుగా జగిత్యాల జిల్లాలోని మూడు సెగ్మెంట్లలోనూ ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్లలోని పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తమతమ పార్టీల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభలన్నింటిలోనూ మహిళలు పెద్దఎత్తున పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ పది రోజుల ప్రచారంలో జగిత్యాల జిల్లాలోని మొత్తం 4.50 లక్షల మంది మహిళా ఓటర్లలో ఎంత తక్కువ అనుకున్నా 3.20 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. పది రోజులుగా వీరికి ఒక్కొక్కరికి రోజుకు రూ.200 చొప్పున ప్రచారం కోసం దక్కినట్లు సమాచారం. ఒక్కోరోజు ఒకే మహిళా సంఘాల సభ్యులు రెండు, మూడు పార్టీల ప్రచారాల్లోనూ పాల్గొన్న సంఘటనలున్నాయి. ఈ లెక్కన ఈ పది రోజులుగా ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.2వేల వరకు గిట్టుబాటయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఎంత తక్కువ అనుకున్నా ప్రచార పర్వంలో రూ.50 కోట్ల వరకు ఖర్చు జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement