కోరుట్లలో కారు జోరు | Sakshi
Sakshi News home page

కోరుట్లలో కారు జోరు

Published Mon, Dec 4 2023 1:52 AM

ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న కల్వకుంట్ల సంజయ్‌ - Sakshi

కోరుట్ల: కోరుట్లలో మరోసారి కారు జైత్రయాత్ర కొనసాగింది. కోరుట్ల కొత్త నియోజకవర్గం ఏర్పటైనప్పటి నుంచి నాలుగు సార్లు కారుకు పట్టం కట్టిన కోరుట్ల.. మరోసారి కారువైపే మొగ్గు చూపింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు.. ఐదోసారి తన తనయుడు కల్వకుంట్ల సంజయ్‌ని బరిలో నిలిపి ఘన విజయం సాధించారు. నిజామాబాద్‌ ఎంపీ, బీజేపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ గట్టి పోటీ ఇచ్చినా పరాభవం మాత్రం తప్పలేదు. మూడోసారి బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.

ఆది నుంచే ఆధిపత్యం

కౌంటింగ్‌ మొదటి రౌండ్‌ నుంచి చివరి రౌండ్‌ వరకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ తన ఆధిపత్యం కొనసాగించారు. కోరుట్ల సెగ్మెంట్‌లోని ఇబ్రహీంపట్నం మండలంలో మొదటి మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అర్వింద్‌పై 1,770 ఓట్ల ఆధిక్యం దక్కింది. 4, 5, 6, 7వ రౌండ్లలో మల్లాపూర్‌ మండలానికి చెందిన ఓట్ల లెక్కింపు కొనసాగగా.. సంజయ్‌ ఆధిపత్యం 6,177కు చేరింది. కోరుట్ల మండలంలోని గ్రామాలకు చెందిన 8, 9, 10 రౌండ్లలో 7,792 ఆధిక్యంలో నిలిచారు. అనంతరం కోరుట్ల పట్టణంలోని 11, 12, 13, 14వ రౌండ్లలో బీఆర్‌ఎస్‌, బీజేపీకి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్‌ ముగిసే సరికి బీఆర్‌ఎస్‌ 10,361 ఓట్ల మెజార్టీతో నిలిచింది. 15, 16, 17రౌండ్లలో మెట్‌పల్లి పట్టణంలో బీఆర్‌ఎస్‌, బీజేపీకి దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయి. 17వ రౌండ్‌ ముగిసే సరికి బీఆర్‌ఎస్‌ అధిక్యం కొంత తగ్గి 9,974కు చేరింది. మెట్‌పల్లి రూరల్‌ మండలానికి చెందిన 18, 19 రౌండ్లలో మళ్లీ బీఆర్‌ఎస్‌ మెజార్టీ కొంత పెరిగి చివరికి 10,305 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 19 రౌండ్లు ముగిసేసరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ 10,305 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారుల ప్రకటించారు. కరోనా కాలంలో కల్వకుంట్ల సంజయ్‌ సేవలు, వైద్యపరంగా అందించిన సాయం, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు ప్రజలతో సత్సంబంధాలు వంటి అంశాలు కలిసొచ్చాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు సుమారు 84వేల ఓట్లు రాగా ఈసారి ఆయన తనయుడు కల్వకుంట్ల సంజయ్‌కు 71వేల ఓట్లు రావడం గమనార్హం.

అర్వింద్‌కు తప్పని పరాభవం

కోరుట్ల నియోజకవర్గం నుంచి గట్టి అంచనాలతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అర్వింద్‌ చివరికి ఓటమి పాలయ్యారు. ప్రతి రౌండ్‌లోనూ బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఫలితం దక్కలేదు. నియోజకవర్గంలో సీనియర్‌ నాయకులు, క్యాడర్‌ కాస్త అసంతృప్తితో దూరంగా ఉండటం సమస్యగా మారినట్లు చర్చ జరుగుతోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కోరుట్ల సెగ్మెంట్‌లో సుమారు 84 వేలు ఓట్లు సాధించిన ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుత ఎన్నికల్లో 61,810 ఓట్లకే పరిమితం అయ్యారు.

జువ్వాడికి మూడో ఓటమి..

కాంగ్రెస్‌ అభ్యర్థికి మూడోసారి కోరుట్ల సెగ్మెంట్‌ ప్రజలు అండగా నిలవలేదు. ఫలితంగా జువ్వాడి నర్సింగరావు మరోసారి ఓటమి పాలయ్యారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జువ్వాడి నర్సింగరావు 53,385 ఓట్లు సాఽధించి రెండో స్థానంలో నిలిచారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 38,305ఓట్లతో రెండో స్థానంలో, ఈసారి 39,323 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.

వరుసగా ఐదోసారి గెలుపు

సంజయ్‌కి కలిసొచ్చిన సేవలు

అర్వింద్‌కు తప్పని పరాభవం

జువ్వాడికి హ్యాట్రిక్‌ ఓటమి..

Advertisement

తప్పక చదవండి

Advertisement