ధర్మపురిలో ఎగిరిన కాంగ్రెస్‌ జెండా | Sakshi
Sakshi News home page

ధర్మపురిలో ఎగిరిన కాంగ్రెస్‌ జెండా

Published Mon, Dec 4 2023 1:52 AM

అడ్లూరికి ధ్రువీకరణ పత్రం అందిస్తున్న ఎన్నికల అధికారులు - Sakshi

గొల్లపల్లి: ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఐదోసారి పోటీ చేసి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై 22,039 భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటివరకు ధర్మపురి బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉండేది. దానిని అడ్లూరి బద్దలు కొట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని నమ్ముకున్న కొప్పులను కాదని ఇప్పటికే నాలుగుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితో లక్ష్మణ్‌కుమార్‌కు పట్టంగట్టారు. ప్రతిరౌండ్‌లోనూ అడ్లూరి తన ఆధిక్యం చాటారు. మొత్తంగా 22,039 మెజార్టీ రావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. బీజేపీతోపాటు మిగిలిన 12మంది అభ్యర్థుల డిపాజిట్‌ సైతం గల్లంతైంది.

కలిసొచ్చిన సానుభూతి

అవ్వలారా.. అక్కలారా.. అంటూ.. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నారు అడ్లూరి. నాలుగుసార్లు ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉన్నానని, చంపుకుంటరో.. సాదుకుంటరో తేల్చుకోవాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇలా నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ మాట్లాడుతూ ప్రజల్లో మంచి సానుభూతి పొందారు. ఆయన అభ్యర్థనను ప్రజలు అర్థం చేసుకోవడం.. కాంగ్రెస్‌ గాలి వీస్తుండడంతో అడ్లూరి విజయం సాధించగలిగారు.

బీఆర్‌ఎస్‌ కంచుకోటకు బీటలు

2009 పునర్విభజనలో భాగంగా ధర్మపురి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున కొప్పుల, కాంగ్రెస్‌ నుంచి అడ్లూరి పోటీచేస్తూనే ఉన్నారు. 2009లో 1484 ఓట్ల తేడాతో.. 2010లో 58,891 ఓట్లు, 2014లో 18,679 ఓట్లు 2018లో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో కొప్పుల ఈశ్వర్‌ అడ్లూరిపై గెలిచారు. అప్పటినుంచి ధర్మపురి అంటేనే బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. నాలుగుసార్లు ఓడిపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా అడ్లూరి పోరాడుతూనే ఉన్నారు. చివరకు ఈ ఎన్నికల్లో అదే కొప్పుల ఈశ్వర్‌ను ఓడించారు.

డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ..

ప్రధాన పార్టీ అయిన బీజేపీ అభ్యర్థి ఎస్‌.కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తూ.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్లినా ఆయనను ఓటర్లు నమ్మలేదు. చివరకు 7,345 ఓట్లు సాధించి డిపాజిట్‌ కోల్పోయారు. నోటాకు 2,392 మంది జై కొట్టారు.

వీఆర్‌కే కాలేజివద్ద కాంగ్రెస్‌ సంబురాలు..

ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ధర్మపురి కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించడంతో కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.

22,039 మెజార్టీతో ‘అడ్లూరి’ విజయం

ఐదోసారికి ఆదరించిన నియోజకవర్గ ప్రజలు

ప్రతిరౌండ్‌లోనూ ఆధిక్యమే..

మంత్రి కొప్పులకు తప్పని ఓటమి

Advertisement

తప్పక చదవండి

Advertisement