బీఆర్‌ఎస్‌ అవినీతిపై పోరాడండి | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అవినీతిపై పోరాడండి

Published Sun, Dec 17 2023 10:30 AM

- - Sakshi

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ సహా పార్లమెంట్‌ పరిధిలోని చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ తదితర మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలపై పోరాడాలని ఎంపీ బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌లోని ఈఎన్‌ గార్డెన్స్‌లో పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారులతో ఆయన సమావేశమయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో అవినీతికి అంతులేకుండా పోయిందని, శ్మశానవాటికలో యంత్రాల ద్వారా గడ్డి పీకామని చెప్పి, దొంగ బిల్లులు పెట్టి రూ.12 లక్షలు దోచుకున్నారని అన్నారు. బిల్లులో ఓ వాహనం నంబర్‌ రాస్తే.. దానిపై ఆరా తీయగా అది బైక్‌ అని తేలిందని తెలిపారు. వాళ్ల అవినీతికి ఇదో మచ్చు తునక అన్నారు. రెండు, మూడు రోజుల్లో కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మేయర్‌ సహా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల అవినీతి, అక్రమాలపై పూర్తి వివరాలు తెప్పించుకోవాలని, పోరాటాలతో వారికి ముచ్చెమటలు పట్టించాలని సూచించారు.

కొండగట్టుకు నిధులేమయ్యాయి?

కొండగట్టు ఆలయానికి ఇస్తానన్న నిధులేమయ్యాయో తేల్చేవరకు పోరాడాలని ఎంపీ సంజయ్‌ అన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌, కవిత క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయాలన్నారు. ప్రజలను దోచుకుతిన్న బీఆర్‌ఎస్‌ను పూర్తిగా తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ కొత్తగా అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయడానికి కొంత సమయం ఇద్దామని చెప్పారు. బెజ్జంకిని కరీంనగర్‌లో కలపాలన్నది ప్రజల డిమాండ్‌ అని, దీనికోసం బీజేపీ కార్యకర్తలంతా రోడ్డెక్కాలని కోరారు.

కలిసికట్టుగా ముందుకుసాగాలి

అంతర్గత విభేదాలను పక్కనపెట్టి, కలిసికట్టుగా ముందుకుసాగాలని ఎంపీ అన్నారు. ప్రతీ కార్యకర్త ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని, ఇంటింటికీ తిరిగి కొత్త ఓటర్లను చేర్పించాలని సూచించారు. వచ్చే నెల తొలి వారంలో పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో కరీంనగర్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని పేర్కొన్నారు. వికసిత భారత్‌ సంకల్ప యాత్రలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

వచ్చే నెల కరీంనగర్‌లో

ఆత్మీయ సమ్మేళనం

ఎంపీ బండి సంజయ్‌

బీజేపీ పదాధికారులతో సమావేశం

Advertisement
Advertisement