చికిత్స పొందుతూ బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ బాలుడి మృతి

Published Sun, Dec 17 2023 10:30 AM

మల్లేశం (ఫైల్‌)
 - Sakshi

సిరిసిల్లక్రైం: ప్రమాదవశాత్తు ఉడికిన పప్పులో పడి గాయపడిన ఆరేళ్ల బాలుడు చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. సిరిసిల్ల ఎస్సై శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన రజిత సిరిసిల్లలోని జ్యోతిరావుపూలే బాలికల వసతిగృహంలో వంట మనిషిగా పనిచేస్తుంది. రోజువారీగా వంట చేయడానికి వచ్చే సమయంలో గత నెల 11న ఆమె ఆరేళ్ల కుమారుడు వర్షిత్‌ వెంట వచ్చాడు. ప్రమాదవశాత్తు ఉడికిన పప్పులో పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని చికిత్స కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వర్షిత్‌ వరంగల్‌లో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. వంటల కాంట్రాక్టర్‌ రవిపై మృతుడి తండ్రి సురేష్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్‌షాక్‌తో రైతు..

జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్‌ మండలం గుట్రాజ్‌పల్లికి చెందిన రైతు జుర్రు మల్లేశం (55) శనివారం విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. మల్లేశం శనివారం తన వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా మోటార్‌ నుంచి వచ్చే విద్యుత్‌ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య స్వప్న, నలుగురు కూతుళ్లు ఉన్నారు. నిత్యం అందరితో కలిసిమెలిసి ఉండే మల్లేశం విద్యుత్‌షాక్‌తో మృతిచెందడం, ఆయనకు నలుగురు కూతుళ్లు ఉండడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి..

మల్యాల: ఆర్థిక ఇబ్బందులతో ఈనెల 3న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన ఒల్లాల నవీన్‌ గౌడ్‌ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు కూతుళ్లు నైనిక, వశిష్ట ఉన్నారు. సర్పంచ్‌ బద్దం తిరుపతిరెడ్డి, గౌడ సంఘ నాయకులు, స్థానికులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.

బైక్‌ను ఢీకొన్న కారు

వ్యక్తికి తీవ్ర గాయాలు

మానకొండూర్‌: మండల కేంద్రంలోని కరీంనగర్‌–వరంగల్‌ ప్రధాన రహదారిపై బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మానకొండూర్‌ మండలంలోని గంగిపల్లికి చెందిన ముల్కల సుధాకర్‌ పని నిమిత్తం శనివారం తన బైక్‌పై కరీంనగర్‌ వెళ్తున్నాడు. మండల కేంద్రంలోని వాటర్‌ట్యాంక్‌ సమీపంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు హుటాహుటిన కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement