గ్యాస్‌ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తాం | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తాం

Published Sun, Dec 17 2023 10:30 AM

మాట్లాడుతున్న జగన్మోహన్‌ రెడ్డి
 - Sakshi

జగిత్యాలజోన్‌: ఎల్‌పీజీ గ్యాస్‌ డీలర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో శనివారం కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఎల్‌పీజీ డీలర్ల సమావేశంలో మాట్లాడారు. డీలర్ల వద్ద పనిచేసే డెలివరీ సిబ్బంది, మెకానిక్‌లు, సిలిండర్లు తనికీ చేసే సిబ్బందికి సెట్విన్‌ సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇందుకు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పించి, ఉపాధి చూపేలా సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మోబైల్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు ఈ–కేవైసీ చేసుకోవచ్చని, గ్యాస్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. టీడీఎల్‌ఏ ప్రధాన కార్యదర్శి శ్రీచరణ్‌ మాట్లాడుతూ.. సివిల్‌ సప్‌లై శాఖ ద్వారా ఏటా తీసుకునే లైసెన్స్‌ను జీవితకాల లైసెన్స్‌గా మార్చేందుకు సంఘం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్‌, కోశాధికారి ఐలారెడ్డి, రాష్ట్ర బాధ్యులు హరికృష్ణ, నాయుడు, వెంకట్‌ రెడ్డి, సతీశ్‌, రవీందర్‌, రాంరెడ్డి పాల్గొన్నారు.

ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండలం అడ్డబోర్‌తండాకు చెందిన వివాహిత లావుడ్య శీల(30) మానసికస్థితి సరిగా లేక శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త లావుడ్య మోహన్‌ ఉదయం లేచి చూసే సమయానికి బెడ్‌రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించింది. వెంటనే రుద్రంగి పోలీసులకు మోహన్‌ సమాచారం ఇవ్వగా ఎస్సై రాజేశ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ బాపురెడ్డి పంచనామా చేసి, పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త మోహన్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మినీస్టేడియంలో వికసిత్‌ సంకల్ప్‌యాత్ర వీక్షణ

జగిత్యాలటౌన్‌/ధర్మపురి: కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ఉద్దేశించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌యాత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించగా.. జగిత్యాల మినీస్టేడియంలో.. ధర్మపురిలోని నందికూడలి వద్ద ఏర్పాటు చేసిన భారీ టివి స్క్రీన్‌పై బీజేపీ నాయకులు, కార్యకర్తలు లైవ్‌ ద్వారా వీక్షించారు. కేంద్ర పథకాల లబ్దిదారులను ఈ సంకల్ప్‌ యాత్రలో భాగస్వాములను చేయడంతో పాటు అన్ని అర్హతలుండి కూడా పథకాల లబ్ది పొందని వారి పేర్లు నమోదు చేసేందుకు మినీస్టేడియంలో రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేసి పేర్లు నమోదు చేశారు.

Advertisement
Advertisement