స్నేహితుడికి సెండాఫ్‌ ఇచ్చి వస్తూ.. | Sakshi
Sakshi News home page

స్నేహితుడికి సెండాఫ్‌ ఇచ్చి వస్తూ.. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొన్న బొలెరో..

Published Sun, Jul 16 2023 1:40 AM

- - Sakshi

జనగాం/హన్మకొండ: ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్తున్న స్నేహితుడికి ఆనందంగా వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న ఆ యువకులు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు వెళ్లారు. రహదారి పక్కన పార్కింగ్‌ చేసిన లారీని.. బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు రాకేశ్‌ చంద్ర గౌడ్‌ (29), సందీప్‌ (32) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్‌గేట్‌ సమీపంలో శనివారం ఉదయం దుర్ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం హన్మకొండ గాంధీనగర్‌కు చెందిన వడ్లకొండ నరేందర్‌, రమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రాజ్‌కుమార్‌ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. చిన్న కుమారుడు రాకేశ్‌ చంద్ర గౌడ్‌ (29) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాడు. 2020లో ములుగుకు చెందిన నందినితో వివాహమైంది. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. అలాగే, నయీంనగర్‌కు చెందిన వడ్డెపల్లి ఉపేందర్‌, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్‌ కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు క్రాంతి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. రెండో కుమారుడు సందీప్‌ (32) బీటెక్‌ చదివి బిల్డర్‌గా కొనసాగుతున్నాడు. నిజామాబాద్‌కు చెందిన పరిమళతో 2018లో వివాహమైంది. వీరికి 18 నెలల చిన్నారి ఉంది.

లారీ రూపంలో కబళించిన మృత్యువు..

యూఎస్‌ఏ వెళ్తున్న తమ స్నేహితుడికి సెండాఫ్‌ ఇచ్చేందుకు రాకేశ్‌ చంద్ర గౌడ్‌, సందీప్‌ శుక్రవారం రాత్రి బొలెరోలో వెళ్లారు. పెంబర్తి రిసార్ట్‌లో స్నేహితుడితో గడిపి శనివారం ఉదయం 5 గంటలకు హన్మకొండకు బయలు దేరారు. కోమళ్ల టోల్‌గేట్‌ సమీపంలోని మలుపు వద్ద లారీ డ్రైవర్‌.. నిబంధనలు పాటించకుండా రహదారిపై లారీని నిలిపాడు. ముందు నిలిచి ఉన్న లారీని గుర్తించక బొలెరో ఢీకొంది. దీంతో లారీ కిందికి చొచ్చుకుపోయింది.

ఈ ఘటనలో ముందు సీట్లలో కూర్చున్న ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న సీఐ ఆర్‌ సంతోష్‌ , ఎస్సై రఘుపతి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, స్నేహితులు ఇద్దరు ఒకేసారి మృతి చెందడం.. పైగా ఇద్దరికి రెండేళ్లలోపు చిన్నారులు ఉండడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. రాకేశ్‌ గౌడ్‌ తండ్రి నరేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.

ఇష్టారాజ్యంగా పార్కింగ్‌..

వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. ఈ జాతీయ రహదారిపై నిర్ణీత ప్రాంతాల్లోనే వాహనాలు నిలపాలి. ఇందుకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా లారీలు పార్క్‌ చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి ఇసుక తీసుకువచ్చే పదుల సంఖ్యలో లారీలను కోమళ్ల టోల్‌గేట్‌ సమీపంలో ఇరువైపులా రోడ్డు పక్కన నిలుపుతున్నారు. అదే ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. లారీలను అక్రమంగా పార్కింగ్‌ చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే విషయం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement
Advertisement