రెండవ దశకు రెడీ | Sakshi
Sakshi News home page

రెండవ దశకు రెడీ

Published Sun, Nov 12 2023 1:28 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ శివలింగయ్య, పక్కన డీసీపీ సీతారాం - Sakshi

436 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు

జిల్లాలో 436 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాం. వీటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షిస్తారు. సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో వెలుపల నుంచి సీసీ కెమెరాలు బిగిస్తాం. జిల్లాకు రెండు కంపెనీల(153 మంది) కేంద్ర బలగాలు రాగా, నియోజకవర్గానికి మూడు చొప్పున 9 కంపెనీల బీఎస్‌ఎఫ్‌ బలగాలు వస్తున్నాయి. సమస్యాత్మకం, గొడవలకు ఆస్కా రం ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిగా బీఎస్‌ఎఫ్‌ బలగాల పర్యవేక్షణలో బందోబస్తు ఉంటుంది.

పోలింగ్‌ కేంద్రాలు నాలుగు రకాలు

ఈసారి కొత్తగా జిల్లా చరిత్రను తెలిపేలా నియోజకవర్గానికి ఐదు చొప్పున నాలుగు రకాల కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కానిస్టెన్సీకి ఐదు చొప్పు న 15 మహిళా పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. ఇందులో మహిళలే విధులు నిర్వర్తిస్తారు. వెయిటింగ్‌, పిల్లల ఆలనా పాలన కు సౌకర్యాలుంటాయి. నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున దివ్యాంగులకు, యూత్‌ మేనేజ్‌ పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయి.

జనగామ: ‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ షెడ్యూల్‌, నోటిఫి కేషన్‌, నామినేషన్ల ప్రక్రియ ముగిసి.. రెండవ దశ ప్రారంభమవుతోంది. ఈనెల 13, 14 తేదీల్లో నామినేషన్ల పరిశీలన.. 15న ఉపసంహరణ, అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. నామినేషన్ల స్క్రూటినీ.. మధ్యాహ్నం మూడు గంటల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది’.. అని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య పేర్కొన్నారు. కలెక్టరేట్‌ మీడియా పాయింట్‌ వద్ద డీసీపీ సీతారాంతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు.

వివరాలు ఆయన మాటల్లోనే...

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి ఆర్వో కేంద్రాల్లో ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకు 99 నామినేషన్లు వచ్చాయి. విత్‌డ్రా పూర్తయిన తర్వాత తుది జాబితాలోని అభ్యర్థులకు మొదటి కేటగిరీలో జాతీయ, రాష్ట్ర పార్టీలు, రెండవ స్థాయిలో రిజిస్టర్‌, అన్‌ రికగ్నైజ్డ్‌, మూడవ కేటగిరీలో స్వతంత్రులకు గుర్తులు కేటాయిస్తాం.

రెండవ దశ శిక్షణ

ఎన్నికల నిర్వహణపై మొదటి దశలో 1,900 మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వగా.. రెండవ దశ ర్యాండమైజేషన్‌లో భాగంగా 18–20 తేదీల మధ్య పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ ఇస్తాం. మొత్తం 862 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 25 శాతం అధికారులు, సిబ్బందిని అదనంగా తీసుకున్నాం.

మూగ వారికి ప్రత్యేకం

మాట్లాడలేని ఓటర్ల కోసం సైన్‌ ల్యాంగ్వేజ్‌(మూగ భాష)పై ఎన్నిక ల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. పోలింగ్‌ కేంద్రం వద్ద పురుషులు, మహిళలు, దివ్యాంగులకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగులకు 421 లొకేషన్లు గుర్తించాం. వీల్‌చైర్‌, అంగన్‌వాడీ, ఇతర సిబ్బంది సహాయంగా పనిచేస్తారు. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ‘సాక్ష్యం’ యాప్‌లో బీఎల్‌ఓ, పోలింగ్‌ కేంద్రం లొకేషన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ సమాచారం ఉంటుంది.

ఎంపీ–3 వర్షన్‌ ఈవీఎంలు

ఈసారి ఎన్నికలకు ఎంపీ–3 వర్షన్‌ ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాటరీ డిశ్చార్జ్‌ను ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తుంది. కంట్రోల్‌ యూనిట్‌ ఆన్‌ చేస్తే చార్జింగ్‌ చూపిస్తూ.. స్విచ్‌ఆఫ్‌ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా రూపొందించారు.

బ్యాలెట్‌పై అభ్యర్థి ఫొటో..

ప్రస్తుత ఎన్నికల కోసం ఎలక్షన్‌ కమిషన్‌.. ఈవీఎం మిషన్లపై గుర్తుల పక్కన అభ్యర్థుల ఫొటోలను అందుబాటులో తీసుకువస్తున్నది. అయితే అభ్యర్థి మెడలో కండువా, గుర్తులు, కంటి అద్దాలు, తలకు టోపీ ఉండకూడదు. కాగా.. ఇతర దేశాల్లో నివాసముంటూ ఓటు హక్కు ఉండి, ఓవర్‌సీస్‌ సెలెక్టులో పేర్లు ఉన్న ఎన్‌ఆర్‌ఐలు పాస్‌పోర్టు ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇలా జిల్లాలో 15 మంది మాత్రమే ఉన్నారు.

13న నామినేషన్ల పరిశీలన

15న విత్‌ డ్రా.. తుది జాబితా ప్రకటన

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

ఈసారి ఎంపీ–3 వర్షన్‌ ఈవీఎంలు

బ్యాలెట్‌పై అభ్యర్థి ఫొటో

అసెంబ్లీ ఎన్నికలపై కలెక్టర్‌ శివలింగయ్య

పోస్టల్‌ బ్యాలెట్‌ మూడు రకాలు

మొదటి కేటగిరీలో ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, పీడబ్ల్యూడీ, సర్వీసు ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాం. జిల్లాలో 1,706 మంది ఎన్నికల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 23 జిల్లాలు, 69 నియోజకవర్గాలకు చెందిన వారి నుంచి పోస్టల్‌ దరఖాస్తులు రాగా, పరిశీలన నిమిత్తం ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిచాం. గుర్తులు కేటాయించిన 48 గంటల్లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తాం. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లోనే పోస్టల్‌ ఓట్లు వేయాల్సి ఉంటుంది.

రెండవ కేటగిరీలో 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, 40 శాతం సదరం సర్టిఫికెట్‌ ఉన్న దివ్యాంగుల కోసం పోస్టల్‌ ఓటు అవకాశం కల్పించాం. మూడు నియోజకవర్గాల్లో 30,926 మంది ఉండగా.. 721 మంది నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కోసం దరఖాస్తులు వచ్చాయి. పోలింగ్‌రోజు సంబంధిత అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి ఓటు తీసుకుంటారు. ఆ సమయంలో వారు అందుబాటులో లేకుంటే రెండుసార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు.

మూడవ కేటగిరీలో సర్వీసు ఓటర్లు జిల్లా వ్యాప్తంగా 442 మంది ఉన్నారు. గుర్తులు కేటాయించిన 24 గంటల్లోగా వారికి బ్యాలెట్‌ పేపర్‌ ఈటీపీబీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వెళ్తుంది. ప్రింట్‌ తీసుకుని ఓటు వేసి పోస్టు ద్వారా తమకు పంపిస్తారు.

Advertisement
Advertisement