కాంగ్రెస్‌తో ఇందిరమ్మ రాజ్యం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో ఇందిరమ్మ రాజ్యం

Published Tue, Nov 28 2023 2:18 AM

మరిపెడలో జరిగిన విజయభేరి సభకు హాజరైన జనం - Sakshi

మరిపెడ/ మరిపెడ రూరల్‌: రాష్ట్రానికి కేసీఆర్‌.. డోర్నకల్‌ నియోజకవర్గానికి రెడ్యానాయక్‌ పీడ ఈ ఎన్నికలతో విరగడవుతుందని.. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఇందిరమ్మ రాజ్యమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ డోర్నకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రాంచంద్రునాయక్‌ గెలుపుకోసం మరిపెడలో సోమవారం నిర్వహించిన విజయభేరి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి వద్దకు ఉద్యోగం కోసం వస్తే సర్పంచ్‌, సమితి ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, మంత్రి వరకు కాంగ్రెస్‌ పార్టీ పదవులు ఇస్తే వాటిని విస్మరించిన.. విశ్వాసం లేని నాయకుడు రెడ్యానాయక్‌ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆరుసార్లు కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఈ ప్రాంత ప్రజలను మోసంచేసి స్వలాభం కోసం బీఆర్‌ఎస్‌లో చేరలేదా అని ప్రశ్నించారు. అక్కడ కేసీఆర్‌ కుటుంబం చాటలు పట్టుకొని పంచుకుంటుంటే.. ఇక్కడ రెడ్యానాయక్‌ కుటుంబ సభ్యులు చాటలు పట్టుకొని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక, బియ్యం దందాలు ఇలా అన్నింటిలో రెడ్యా కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు.

కృష్ణా జలాలతో సస్యశ్యామలం

తలాపున కృష్ణా నది ఉన్నా సాగునీటికి డోర్నకల్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు కృష్ణా జలాలను అందించి సాగునీటి ఇబ్బంది తీరుస్తామని అన్నారు. ఇక్కడి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి మార్గాలు లేవని అన్నారు. రాంచంద్రునాయక్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి జరిగేలా చూస్తానన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను తప్పక అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో బడులకు పోవాల్సిన యువకులు ఒక చేత బీఆర్‌ఎస్‌ జెండా, మరోచేత బీరు సీసాలతో తిరుగుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మద్యం ఏరులై పారుతుందన్నారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా రాంచంద్రునాయక్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మురళీనాయక్‌, నూకల శ్రీరంగారెడ్డి, నెహ్రూనాయక్‌, మరిపెడ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి, యుగేందర్‌రెడ్డి, అంబరీష, అప్సర్‌, ముదిరెడ్డి నరేష్‌రెడ్డి, కమలాకర్‌, తాజుద్దీన్‌ పాల్గొన్నారు.

సేవ చేసే భాగ్యం కల్పించాలి : కాంగ్రెస్‌

డోర్నకల్‌ అభ్యర్థి రాంచంద్రునాయక్‌

‘నేను డాక్టర్‌గా స్థిరపడ్డా.. డోర్నకల్‌ ప్రజలపై అభిమానంతో రెండు పర్యాయాలు రెడ్యానాయక్‌పై పోటీ చేశా’ అని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాంచంద్రునాయక్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మరిపెడలోనే ఆస్పత్రి కట్టించి, నేను, నా భార్య ఇక్కడి ప్రజలకు సేవ చేస్తామన్నారు. మీకు సేవచేసే భాగ్యం కల్పించాలని కోరారు.

అక్కడ కేసీఆర్‌.. ఇక్కడ రెడ్యానాయక్‌

ఇద్దరి పీడ విరగడవ్వాలంటే

కాంగ్రెస్‌ను గెలిపించాలి

కృష్ణా జలాలతో డోర్నకల్‌ ప్రాంతం సస్యశ్యామలం చేస్తాం

మరిపెడ విజయభేరి సభలో

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

1/3

సభలో అభ్యర్థి రాంచంద్రునాయక్‌ను పరిచయం చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
2/3

సభలో అభ్యర్థి రాంచంద్రునాయక్‌ను పరిచయం చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

3/3

Advertisement
Advertisement