‘ప్రజా పాలన’తో పేదల సంక్షేమం | Sakshi
Sakshi News home page

‘ప్రజా పాలన’తో పేదల సంక్షేమం

Published Wed, Dec 27 2023 1:34 AM

- - Sakshi

28నుంచి వార్డు, గ్రామసభలు..

జనవరి 6వరకు దరఖాస్తుల స్వీకరణ

ఆరు గ్యారంటీల అమలుకు

కట్టుబడి ఉన్నాం.

అధికారులకు పనిచేసే స్వేచ్ఛ కల్పించాం

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష

పాల్గొన్న మంత్రులు సీతక్క,

కొండా సురేఖ, ఎమ్మెల్యేలు

హన్మకొండ అర్బన్‌: అర్హులైన ప్రతి పేద కుటుబానికి ప్రభుత్వ పథకాలు అందేవిధంగా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అ దిశగా అధికారులు ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రజాపాలన కార్యక్రమ విధివిధానాలు, నిర్వహణ తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ వార్డుల్లో కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించాలన్నారు. ప్రజలనుంచి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి, చేయూత పథకాలకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రతి దరఖాస్తుదారుడికి 4 నుంచి 5 నిమిషాల సమయం కేటాయించాలని, అతనికి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పథకాల దరఖాస్తు ఫారాలు ఒకరోజు ముందుగానే గ్రామాలకు వస్తాయని, ప్రజలకు వాటిని అందించి వారు నింపుకుని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యులకు దరఖాస్తులు నింపడంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు సహకరించాలన్నారు. గ్రామసభ నిర్వహణకు షెడ్యూల్‌ అందిస్తారని, మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సభ ఎప్పుడు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు ముందుగానే తెలిసేలా స్థానిక సిబ్బందితో ప్రచారం నిర్వహించాలని సూచించారు.

దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయాలి:

మంత్రి కొండా సురేఖ

ప్రజలనుంచి అధికారులకు అందిన ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌ చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తు పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నారు.

మండలానికి రెండు బృందాలు :

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

హనుమకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి మండలానికి తహసీల్దార్‌, ఎంపీడీఓ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు క్షేత్రస్థాయిలో ఉంటూ గ్రామాలు, డివిజన్లలో దరఖాస్తులు స్వీకరించేలా చేస్తున్నామన్నారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్‌ ఉండేలా చూస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ రామ్‌చంద్రునాయక్‌, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, మురళీనాయక్‌, పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝా, వరంగల్‌, మహబూబాబాద్‌ కలెక్టర్లు ప్రావీణ్య, శశాంక, ఐటీడీఏ పీఓ అంకిత్‌, గ్రేటర్‌ కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా, మహబూబాబాద్‌ ఎస్పీ సంగ్రాంసింగ్‌ జీ పాటిల్‌, అదనపు కలెక్టర్లు శ్రీజ, అశ్విని తానాజీ వాకడే, పింకేష్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన ఉమ్మడి జిల్లా అధికారులు
1/1

సమావేశానికి హాజరైన ఉమ్మడి జిల్లా అధికారులు

Advertisement
Advertisement