‘కోడ్‌’ మీరితే కొరడా | Sakshi
Sakshi News home page

‘కోడ్‌’ మీరితే కొరడా

Published Fri, Nov 10 2023 5:22 AM

ములుగు జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లాలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ఆరు జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్‌, ఎస్పీలు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వికాస్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారంతో నామినేషన్ల ఘట్టానికి తెరపడనుండగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం ప్రచారం మరింత హోరెత్తనుంది. ఈనేపథ్యంలో అభ్యర్థుల వ్యయం అంచనా వేసేందుకు స్పెషల్‌ టీమ్‌లను కూడా రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేశారు.

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి..

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించే అవకాశం ఉందన్న సమాచారం మేరకు కాళేశ్వరం, ఏటూరునాగారం, ములుగు అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పకడ్బందీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల సరిహద్దులో మొత్తం 24 డైనమిక్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టుల్లో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా ఎస్పీలు, కలెక్టర్లు, డీజీపీ, ఎన్నికల అధికారులు పర్యవేక్షించే వీలు కల్పించారు. ఇప్పటి వరకు చెక్‌పోస్టులు, తనిఖీల ద్వారా రూ.4.48 కోట్ల మేరకు నగదు, ఆభరణాలను సీజ్‌ చేశారు. సరైన ఆధారాలు చూపించిన వారికి రూ.2.98 కోట్ల మేరకు తిరిగి అందజేశారు. గత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అల్లర్లు, ఘర్షణలకు పాల్పడిన కేసుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్ల పరిఽధి 7,798 మంది పాత నేరస్తులు, రౌడీషీటర్లు, స్మగ్లర్లు, అనుమానితులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేసి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇందులో వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 3,485 మంది ఉన్నారు. లైసెన్స్‌లు పొంది ఆయుధాలను వినియోగిస్తున్న 208 మంది నుంచి ఎన్నికల నేపథ్యంలో స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన అభ్యర్థులు, వారి అనుచరులకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) కింద ఉమ్మడి జిల్లాలో 79 నోటీసులు జారీ చేశారు.

నేటితో నామినేషన్లకు తెర

వచ్చే నెల 3 వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కోడ్‌ అమలులో ఉంటుంది. నామినేషన్ల ఘట్టం నేటితో ముగియనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదటి నుంచి కూడా కోడ్‌ ఉల్లంఘనలకు అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు.. ఉపసంహరణలు ముగిసే వరకు కూడా కొనసాగించనున్నారు. ఈమేరకు ఎన్నికల నియమావళిని తూ.చ. తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు మరింత కఠినతరం చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ, శాంతి భద్రతల, వ్యయ పరిశీలకులు శుక్రవారం నుంచి రంగంలోకి దిగనున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కావడం గమనార్హం. జిల్లా ఎన్నికల అధికారితో పాటు సహాయ రిటర్నింగ్‌ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా స్టాటిక్‌ సర్వే లెన్స్‌ బృందాలు కూడా పని చేస్తున్నాయి. అభ్యర్థుల పర్యటనలు, ప్రచార కార్యక్రమాలను వెంబడిస్తున్న నిఘా బృందాలు ప్రతీది రికార్డు చేస్తున్నాయి. ప్రచారంలో భాగంగా మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనే ప్రతీ కార్యకమ్రాన్ని వీడియో చిత్రీకరిస్తున్నారు. నిబంధనల మేరకు సమావేశాలు జరుగుతున్నాయో లేదో అనే దృష్టిని సారిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, గెస్ట్‌హౌజ్‌లను పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకుండా కట్టడి చేశారు.

పోలీసుల రక్షణ వలయంలో ఉమ్మడి జిల్లా

24 చెక్‌పోస్టులు..

7,798 మంది బైండోవర్‌

రూ.4.48 కోట్ల నగదు, ఆభరణాలు సీజ్‌

208 ఆయుధాలు స్వాధీనం

ప్రచార సరళి, ఉల్లంఘనలపై నిఘా

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోసం చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు
1/1

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోసం చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement