అనుమానితులను గోదావరి దాటించొద్దు | Sakshi
Sakshi News home page

అనుమానితులను గోదావరి దాటించొద్దు

Published Fri, Nov 17 2023 1:26 AM

పలిమెల: గోదావరి తీరం వద్ద జాలర్లతో 
మాట్లాడుతున్న డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి  - Sakshi

పలిమెల: కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులను గోదావరి దాటించొద్దని జాలర్లకు కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి సూచించారు. ఎన్నికల సందర్భంగా గోదావరి తీర గ్రామాలైన మండలంలోని నీలంపల్లి, దమ్మూరులోని పోలింగ్‌ కేంద్రాలు, ఫెర్రీ పాయింట్‌లను మహదేవపూర్‌ సీఐ కిరణ్‌, పలిమెల ఎస్సై తమాషారెడ్డి, సిబ్బందితో కలిసి ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరిలో చేపలు పట్టే జాలర్లు, గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. కొత్త, అనుమానాస్పద వ్యక్తులను గోదావరి దాటించవద్దన్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే తప్పకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. మావోయిస్టులకు సహాయం చేయడం, ఆశ్రయం కల్పించడం చట్టరీత్యా నేరమని సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్‌, టీఎస్‌ఎస్‌పీ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

మల్హర్‌: ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కాటారం డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మల్లెంపల్లి గ్రామంలో పోలింగ్‌ బూతులను డీఎస్పీ గురువారం పరిశీలించారు. అనంతరం ఓటుహక్కుపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలంతా సహకరించాలన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురికావవద్దని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ రంజింత్‌రావు, కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి

Advertisement
Advertisement