పునర్జన్మ..! | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 5 2023 5:02 AM

- - Sakshi

అసలు వారెవరో వారికే తెలియదు. అనేకానేక కారణాల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై.. మతిస్థిమితం కోల్పోయారు. ఏం చేస్తున్నారో తెలియనిస్థితిలో చింపిరి జట్టు.. చిరిగిన వస్త్రాలతో అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతుంటారు. చెత్తకుప్పల్లో

పడేసిన ఆహార పదార్థాలను తింటూ డ్రెయినేజీ నీళ్లను తాగుతూ.. రాత్రివేళల్లో చలికి వణుకుతూ, దోమల బాధను భరిస్తూ దుర్భరమైన జీవితం గడిపేస్తుంటారు.

అర్ధ నగ్నంగా వీధుల్లో సంచరిస్తుంటే

అందరూ అసహ్యించుకొనేవారే కానీ అయ్యో అని జాలిపడేవారు లేరు.. ఇలాంటి మానసిక దివ్యాంగులను బాదేపల్లిలోని మహాలక్ష్మీ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యేశ్వర ఆశ్రమం అక్కున చేర్చుకుంది. విధి వంచితులుగా మారిన వారికి అన్నీ తామే అంటూ సపర్యలు

చేస్తోంది. – మహబూబ్‌నగర్‌ డెస్క్‌

ఆశ్రమానికి నాంది ఇలా..

మహాలక్ష్మిసేవా ట్రస్టు వ్యవస్థాపకుడు చిత్తనూరి ఈశ్వర్‌ 10వ తరగతి చదువుతున్న సమయం 1970లో తన దూరబంధువైన ఓ వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడడం చూసి.. అలాంటి వారికి ఏదైనా చేయాలని సంకల్పించుకున్నారు. రోజు ఎక్కడో ఓ చోట రోడ్లపై అలాంటి మానసిక రుగ్మతతో బాధపడేవారు తారసపడుతూనే ఉన్నారు. అలాంటి సమయంలో ముంబయిలో శ్రద్ధ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్‌ పఠ్వానీ దంపతులు మానసిక రుగ్మత కలిగిన వారికి చికిత్స అందించడం గురించి తెలుసుకొని అక్కడే ఉండి పరిశీలించి వచ్చారు. ఇదే క్రమంలో చౌటుప్పల్‌ వద్ద గడ్డిశంకర్‌ సొంతంగా అమ్మానాన్న ఆశ్రమాన్ని నెలకొల్పి మానసిక రోగులకు సేవచేయడం తెలిసి అక్కడే నాలుగు రోజులు ఉండి అవగాహన పెంచుకున్నారు. ఆ తర్వాత మానసిక అభాగ్యుల కోసం ఆశ్రమం పెట్టాలని నిర్ణయం తీసుకొని ఇద్దరు కుమారులు, కుమార్తె, భార్యకు చెప్పారు. కుటుంబసభ్యుల అందరి ఆమోదంతో తాను వివిధ వ్యాపారాల ద్వారా ఆర్జించిన ఆస్తిని ఐదు భాగాలుగా చేసి, మూడు భాగాలు పిల్లలకు ఒక భాగం తన పేరిట, మరో భాగం ఆశ్రమం పేరిట వీలునామా రాశారు. అనంతరం బాదేపల్లిలో అర ఎకరం పొలంలో శ్రీ సత్యేశ్వర ఆశ్రమాన్ని నెలకొల్పాడు. వివిధ ప్రాంతాల్లో రోడ్లపై తిరుగుతున్న మానసిక దివ్యాంగులు ఆరుగురిని గుర్తించి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి 2018లో మహాశివరాత్రి రోజు ఆశ్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 86 మందికి ఆశ్రయం కల్పించారు. 105 మందిని బాగు చేసి సొంతవారికి అప్పగించారు.

● ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రి సహకారంతో ప్రతి నెలా సైక్రియాట్రిస్టు వైద్యులు ఆశ్రమానికి వచ్చి చికిత్స అందిస్తున్నారు. ఎవరికై నా అత్యవసర పరిస్థితి ఉంటే వారికి ఎస్‌వీఎస్‌ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. కరోనాకు ముందు ప్రతి నెలా వారిని హైదరాబాద్‌ ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించేవారు. కరోనా నుంచి వెళ్లటానికి ఇబ్బంది కలగటంతో ఆశ్రమ నిర్వాహకులు ఎస్‌వీఎస్‌ యాజమాన్యాన్ని సంప్రదించడంతో ఉచిత సేవలు అందిస్తున్నారు.

ఈమె పేరు బీబీ. ద్రోణాచలంలో మూడేళ్ల క్రితం రోడ్లపై సరైన దుస్తులు లేకుండా.. ఎక్కడపడితే అక్కడ తింటూ కాలం వెళ్లదీసేది. రోడ్డుపై మహిళ అలా తిరుగుతుండడాన్ని అక్కడి మహిళా న్యాయమూర్తి గమనించి ద్రోణాచలం సేవాసమితికి సమాచారం అందించారు. వారు ఇలాంటి వారిని జడ్చర్లలోని సత్యేశ్వర ఆశ్రమం చేరదీస్తుందని జడ్జికి వివరించారు. దీంతో ఆమె వెంటనే ఆశ్రమానికి పంపించారు. ప్రస్తుతం ఈ మహిళకు కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవటంతో స్వస్థత చేకూరినప్పటికీ ఆశ్రమంలోనే ఉంటుంది.

ఇతడి పేరు గిడ్డయ్య స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని డోన్‌. 2018లో ఆశ్రమం ప్రారంభించిన తొలినాళ్లలో 44వ నెంబరు జాతీయరహదారిపై గొల్లపల్లి సమీపంలో రోడ్డుపై తిరుగుతుండగా ఆశ్రమ నిర్వాహకుడు తీసుకువచ్చారు. నాటి నుంచి ఆశ్రమంలో యోగాసనాలు, ధ్యానంతో పాటు సైక్రియాట్రిస్ట్‌తో చికిత్స అందించడంతో కోలుకున్నాడు. తన గ్రామం డోన్‌ అని చెప్పటంతో అక్కడి వారితో ఆరా తీసి కుటుంబసభ్యులకు అప్పగించారు. మూడు నెలలు బాగానే ఉన్నా.. సరైన చికిత్స లేకపోవడంతో తిరిగి మానసిక రుగ్మతకు గురయ్యాడు. మరోసారి ఆశ్రమానికి తీసుకురాగా.. 4 నెలల కాలంలోనే గిడ్డయ్య కోలుకున్నాడు. ప్రస్తుతం ఆశ్రమంలోనే ఉంటున్నాడు.

ఆశ్రమం నాకు దేవాలయం

నేను ఎప్పుడు ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితి. అలాంటి అయోమయస్థితిలో సత్యేశ్వర ఆశ్రమం గురించి తెలిసి నా భార్య స్వర్ణలత అక్కడ చేర్పించింది. రెండున్నరేళ్ల పాటు ఆశ్రమంలో ఉండి పూర్తిగా కోలుకున్నాను. మూడు నెలల కిందట స్వగ్రామం లక్నారానికి వెళ్లి అక్కడ కిరాణం నడుపుతున్నాను. సత్యేశ్వర ఆశ్రమం అనే బదులు దేవాలయం అనటం సబబుగా ఉంటుంది. ఆ ఆశ్రమం లేకుంటే నా పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. – సింహ్మయ్య, ఆశ్రమంలో కోలుకున్న వ్యక్తి, లక్నారం, తెలకపల్లి మండలం

చిన్నప్పుడే అనుకున్నా..

నా పదో తరగతిలోనే బంధువైన రఘుపతిపేట కాశీనాథ్‌ మానసిక రుగ్మతతో రోడ్లపై తిరుగుతూ మరణించటంతో ఆరోజే నా మనసులో బీజం పడింది. బాంబే శ్రద్ధ ఫౌండేషన్‌, చౌటుప్పల్‌ అమ్మానాన్న ఆశ్రమం స్ఫూర్తిగా ఆశ్రమం ప్రారంభించాను. నా కుటుంబసభ్యులు ఇందుకు ఆమోదం తెలపటం.. నేను వారి కి రుణపడి ఉంటాను. ప్రభుత్వాలు స్పందించి వీరికోసం ఆశ్రమాలు కట్టించి, ఆస్పత్రులు పెంచి సేవలందిస్తే బాగుంటుంది.

– చిత్తనూరి ఈశ్వర్‌, సత్యేశ్వర ఆశ్రమ నిర్వాహకుడు

దైవకార్యంగా భావించి..

నాన్న మా కుటుంబసభ్యులను అందరిని కూర్చోబెట్టి మానసిక రుగ్మతలు కలిగిన వారి కోసం ఆశ్రమం పెడతా అనగానే.. దైవకార్యంగా భావించి మేం అందరం ఏకగ్రీవంతో ఒప్పుకున్నాం. ఆశ్రమానికి మా వంతుగా సహకారం అందిస్తున్నాం. అన్ని విధాలుగా బాగున్న వారికి సహాయం చేయడం కంటే.. ఇలాంటి వారికి సేవ చేయటం మానవసేవయే మాధవసేవగా మా నాన్న చెబితే అది నిజమే అనిపిస్తుంది. – చిత్తనూరి రామకృష్ణ,

సత్యేశ్వర ఆశ్రమం నిర్వాహకులలో ఒకరు

విధి వంచితులకు అండగా నిలుస్తున్న సత్యేశ్వర ఆశ్రమం

మానసిక దివ్యాంగుల కోసం బాదేపల్లిలో ప్రత్యేకకేంద్రం ఏర్పాటు

అభాగ్యులకు ఉచిత సేవలు అందిస్తున్న వైనం

105 మందికి బాగు చేసి సొంతవారికి అప్పగింత... ప్రస్తుతం 86 మందికి ఆశ్రయం

అనాథ బాలలు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు.. ఇలా అందరికీ శరణాలయాలు ఉన్నాయి. కానీ మతిస్థిమితం కోల్పోయి వీధుల వెంట తిరిగే వారిని ఎవరూ చేరదీయరు. ఇలాంటి దీనస్థితిలో జీవితాన్ని గడిపే వాళ్లను చేరదీసి.. అక్కున చేర్చుకొని వారిని మామూలు మనుషులుగా చేయడానికి ఏ స్వచ్ఛంద సంస్థలు గానీ, ప్రభుత్వపరంగా గానీ సాహసం చేయడం లేదు. కానీ జడ్చర్ల(బాదేపల్లి)లోని సత్యేశ్వర ఆశ్రమం ఇలాంటి అభాగ్యులకు అండగా ఉంటూ పునర్జన్మ ఇస్తోంది. ఎంతో మంది మానసిక దివ్యాంగులను ఆశ్రమంలో చేర్పించుకొని.. వారి బాగోగులు చూసుకుంటూ, వైద్యపరీక్షలు చేయించి.. తిరిగి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు.

1/4

2/4

3/4

4/4

Advertisement

తప్పక చదవండి

Advertisement