ఆ ఒక్క సీటుపై సస్పెన్స్‌..! | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క సీటుపై సస్పెన్స్‌..!

Published Sat, Aug 19 2023 1:48 AM

- - Sakshi

బీఆర్‌ఎస్‌లో టికెట్ల టెన్షన్‌.. కల్వకుర్తిపైనే ఉత్కంఠ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ నెల 21న బీఆర్‌ఎస్‌ జాబితాను ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. పాలమూరు జిల్లాల్లో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. సిట్టింగ్‌ అభ్యర్థులకే సీట్లు అని సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ.. పలు దఫాలుగా చేపట్టిన సర్వేల్లో తేలిన ప్రకారం టికెట్ల కేటాయింపులు ఉంటాయనేది తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్‌ సాధించడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. గతంలో లాగే అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించేలా అన్ని రకాల కసరత్తులు పూర్తి చేశారు. మరో రెండురోజుల్లో జాబితా వెలువడనుండగా.. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి సీటుపై సస్పెన్స్‌ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే సీట్లు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పెండింగ్‌లో కల్వకుర్తి..

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇద్దరు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ.. గ్రూప్‌ రాజకీయాలతో పార్టీ కేడర్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. గత ఎన్నికల్లో కసిరెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా.. జైపాల్‌యాదవ్‌కే అవకాశం దక్కింది. అయితే ఈసారి తాను తప్పక బరిలో ఉంటానని, తనకే టికెట్‌ వస్తుందని కసిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండడంతో పాటు ఇది వరకే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి సీటు ఇచ్చినా ఇంకొకరు ఎలా స్పందిస్తారో తెలియని అయోమయం పార్టీలో నెలకొంది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఎవరికి సీటు ఇస్తే గెలుపొందుతారని సర్వే చేయించినట్లు తెలిసింది. అంతేకాకుండా నియోజకవర్గంలో జైపాల్‌యాదవ్‌ పనితీరుపైనా సర్వే చేసినట్లు సమాచారం. ఫలితాలు యాదవ్‌కు వ్యతిరేకంగా ఉండగా.. పార్టీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి పెండింగ్‌ పెట్టిన అధిష్టానం

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికిసంకేతాలు?

రాష్ట్రంలో సామాజిక సర్దుబాటు తర్వాత వెల్లడించే అవకాశం

అచ్చంపేట, అలంపూర్‌తో సహా మిగతా అన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకే చాన్స్‌

ఒకే ఒక్క బీసీ ఎమ్మెల్యే..

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు (అచ్చంపేట, అలంపూర్‌) ఎస్సీ రిజర్వ్‌ కాగా.. మిగతా ఐదు (నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, గద్వాల, వనపర్తి) జనరల్‌ స్థానాలు. ఈ ఐదు జనరల్‌ స్థానాల్లో నలుగురు రెడ్డివర్గానికి చెందిన వారు కాగా.. జైపాల్‌యాదవ్‌ బీసీ వర్గానికి చెందిన వారు. దీంతో పార్టీ అధిష్టానం ఆచి తూచి వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సామాజిక సర్దుబాటు తర్వాత కల్వకుర్తి అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు విశ్వసనీ య వర్గాల ద్వారా తెలిసింది. అ యితే సీటు ఖరారుపై ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి సంకేతాలు అందాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఆ సంకేతాలు ‘వేచి చూడమని చెప్పినట్లా.. లేక మీరే అభ్యర్థి, నియోజకవర్గంలో పని చేసుకోండి’ అని చెప్పారా అనే దానిపై స్పష్టత లేదు.

ఊగిసలాట.. అయినా ఖరారు

అచ్చంపేట, అలంపూర్‌ అభ్యర్థిత్వాలపై ఊగిసలాట కొనసాగినా.. సిట్టింగ్‌లకే ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రెండు స్థానాల్లో నిర్వహించిన సర్వేల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా.. పార్టీ పట్ల సంతృప్తికర ఫలితాలే వచ్చినట్లు తెలుస్తోంది. అలంపూర్‌లో అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మధ్య విభేదాలు ప్రభావం చూపే అవకాశం ఉందని గ్రహించిన అధిష్టానం ఇది వరకే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అలంపూర్‌తో పాటు కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను చల్లాకు కట్టబెట్టినట్లు పార్టీ అధిష్టాన వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు అచ్చంపేట నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ రాములు తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు వినికిడి. ఈ సమయంలో వారసులకు ఇచ్చే అవకాశం లేదని.. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇరువురిని సమన్వయం చేసే బాధ్యతలను ఇద్దరికి పరిచయమున్న ఓ ముఖ్య నాయకుడికి అప్ప జెప్పినట్లు సమాచారం. ఆ తర్వాతే ఎమ్మెల్యే గువ్వల, ఎంపీ రాములు.. పార్టీ నుంచి ఎవరికి టికెట్‌ వచ్చినా.. ఇరువురం సహకరించుకుని, పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెబుతున్నట్లు వారివారి అనుచర వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement