కాంగ్రెస్‌ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి? | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి?

Published Wed, Sep 27 2023 12:52 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: భారత రాష్ట్ర సమితికి షాక్‌ తగలనుంది. ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి త్వరలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. తాజాగా ఇటీవల రాజకీయపరంగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ ఆశించిన ఆయనకు ఈ సారి సైతం భంగపాటే ఎదురైన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కసిరెడ్డికి తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. తనతో పాటు తన వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడం..

ఈసారి సైతం జైపాల్‌కే అధిష్టానం మద్దతు పలుకుతుండడంతో ఇన్నాళ్లుగా వేచి చూసే ధోరణిని అవలంబించిన కసిరెడ్డి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 29న లేదంటే 30న ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం ‘గులాబీ’కి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగైదు దఫాలుగా పెద్దల రాజీ యత్నాలు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ అన్ని పార్టీల కంటే ముందుగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని సీట్లను సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే కేటాయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజకీయ పరిణామాల క్రమంలో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి స్వరాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను మార్చాలంటూ అసమ్మతి నేతలు మండలాల వారీగా సమావేశా లు నిర్వహిస్తూ నిరసన గళం వినిపించారు.

దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు కసిరెడ్డితో పాటు అసమ్మతి నేతలతో గత నెల చివర నుంచి ఇప్పటివరకు నాలుగైదు పర్యాయాలు సంప్రదింపులు జరిపి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కసిరెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ సైతం తీసుకున్నా.. అనివార్య కారణాలతో రద్దయినట్లు తెలిసింది. ఆ తర్వాత కేటీఆర్‌ సోమవారం రాత్రి కసిరెడ్డిని స్వయంగా పిలిపించుకుని.. ‘తొందరపాటు నిర్ణ యం తీసుకోవద్దు.. టికెట్‌ కేటాయింపుపై సీఎంతో మాట్లాడుతాను.. మూడు రోజులు ఓపిక పట్టండి’ అని నచ్చజెప్పేందుకు యత్నించినట్లు సమాచారం.

అయితే కసిరెడ్డి వర్గానికి చెందిన అనుచరులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం భేటీ అయి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు వినికిడి. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. తనతో పాటు తనను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

రాజకీయ నేపథ్యం..
కిసరెడ్డి 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఆశించారు. టికెట్‌ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2016లో బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌)లో చేరారు. ఇదే సంవత్సరంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్వకుర్తి నుంచి టికెట్‌ ఆశించినా.. దక్కలేదు. అనంతరం 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండోసారి ఆయన ఎన్నికయ్యారు.

‘కల్వకుర్తి’లోమారనున్న సమీకరణలు..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కసిరెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండడంతో కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్‌ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేరు ఇన్నాళ్లుగా వినిపిస్తూ వచ్చింది. అయితే ఆయన సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండడంతో ఆయన సేవలను ఢిల్లీస్థాయిలో వినియోగించుకోవాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను జల్లెడ పడుతున్న అధిష్టానం కల్వకుర్తిపై ఎప్పటి నుంచో నజర్‌ వేసింది.

ఈ మేరకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి రంగంలోకి దిగడంతో పాటు కసిరెడ్డికి టికెట్‌పై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం గూటికి చేరేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ పరిణామాలు కల్వకుర్తితో పాటు పలు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు చేటు తెస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement