‘విజయవర్ధిని’ పునరుద్ధరణకు చర్యలు | Sakshi
Sakshi News home page

‘విజయవర్ధిని’ పునరుద్ధరణకు చర్యలు

Published Wed, Sep 27 2023 12:52 AM

- - Sakshi

అలంపూర్‌: బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌ పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ కంచెర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వీఎం అబ్రహంను ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌తోపాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి, జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, మేనేజర్‌ సత్యనారాయణ, రాష్ట్ర ఫీల్డ్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ తిరుమలేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్‌ రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 3న విజయవర్ధిని ఆయిల్‌ఫెడ్‌ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్‌ కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా ఆయిల్‌ ఫ్లాంటేషన్‌ ఎక్కువగా చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌ఫాం గెలల క్రషింగ్‌ మిషన్‌ రాష్ట్రంలోని భద్రాది, కొత్తగూడెంలోనే ఉన్నాయన్నారు. దశల వారీగా వాటి సామర్థ్యం పెంచుతున్నట్లు తెలిపారు. బీచుపల్లిలో వేరుశనగ క్రషింగ్‌ జరిగేదని, రూ.150కోట్లతో అతిపెద్ద ఆయిల్‌ఫాం క్రషింగ్‌ మిల్‌గా విజయవర్ధిని మిల్‌ను పునరుద్ధరించనున్నట్లు వివరించారు. ఈ మిల్‌ ప్రారంభంతో 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. విజయవర్ధినిలో గంటకు 30టన్నుల గెలలు, ఒక రోజు 600 టన్నుల ఆయిల్‌ఫాం గెలలను క్రషింగ్‌ చేసి, క్రూడ్‌ ఆయిల్‌ను సిద్ధం చేసేవిధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో 10వేల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగు చేశారని, సాగు విస్తీర్ణాన్ని 70వేల ఎకరాలకు పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఆయిల్‌ కొరతను నివారించడానికి 20లక్షల ఎకరాల్లో సాగుచేసి, ప్రతి జిల్లాలో ఒక ఆయిల్‌ఫెడ్‌ మిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోందన్నారు. ప్రస్తుతం ఇక్కడ క్రూడ్‌ ఆయిల్‌ తయారు చేస్తే.. సిద్ధిపేటలోని మిల్‌లో ఫిల్టర్‌ చేసి ప్యాకెట్లుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ సంస్థ

రాష్ట్ర చైర్మన్‌ రామకృష్ణారెడ్డి

Advertisement
Advertisement