చెరుకు కోతలు షురూ.. | Sakshi
Sakshi News home page

చెరుకు కోతలు షురూ..

Published Sat, Nov 11 2023 1:38 AM

అమరచింత శివారులో చెరుకు కోతలు నిర్వహిస్తున్న కార్మికులు  - Sakshi

మద్దతు ధర టన్నుకు రూ.3,340

కృష్ణవేణి షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో 7,500 ఎకరాలు

సీజన్‌లో 2.30 లక్షల టన్నుల దిగుబడి అంచనా

అమరచింత: జిల్లాలోని కృష్ణవేణి షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో మూడురోజులుగా చెరుకు కోతలు కొనసాగుతున్నాయి. కార్మికులు గ్రామాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని కోత పనుల్లో నిమగ్నమయ్యారు. సకాలంలో కోతలు ప్రారంభమయ్యాయని.. త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సీజన్‌లో ఫ్యాక్టరీ పరిధిలో 7,500 ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మద్దతు ధర టన్నుకు రూ.3,340 చెల్లిస్తుండటంతో సాటే రాయితీలు ఇస్తుండటంతో రైతులు ఈసారి చెరుకు సాగుకు సన్నద్ధమవుతున్నారు. పంట కోతలకు 180 మంది కార్మిక బృందాలు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 75 బృందాలు వచ్చాయి. వీరితోపాటు ఫ్యాక్టరీకి చెందిన రెండు కోత యంత్రాలతో పాటు 5 ప్రైవేట్‌ కోత యంత్రాలను యాజమాన్యం సిద్ధం చేసింది.

ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎర్రగుంట పాలెం, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి 75 కోత బృందాలు వచ్చాయి. ఒక్కో బృందంలో 20 నుంచి 25 మంది కార్మికులు ఉండగా.. టన్ను కోతకు రూ.800 నుంచి రూ.900 వరకు వసూలు చేస్తు న్నారు. ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు అదనపు కార్మికులు అ వసరం ఉండటంతో మరో 85 బృందాలను త్వ రలో రప్పించే ప్రయత్నంలో యాజమాన్యం ఉంది.

రాయితీలతో ఆసక్తి..

ఫ్యాక్టరీ యాజమాన్యం ఈసారి చెరుకు సాగుచేసే రైతులకు రాయితీలు ఇస్తుండటంతో గతంలో పంటను వదులుకున్న వారు సైతం దృష్టి సారిస్తున్నారని ఫ్యాక్టరీ కేన్‌హెడ్‌ వెల్లడించారు. ఎకరానికి రెండు టన్నుల విత్తనంతో పాటు రాయితీ ఎరువులు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గతంలో 6,500 ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం అదనంగా మరో వెయ్యి ఎకరాల సాగు పెరిగిందని కంపెనీ యాజమాన్యం వెల్లడించారు. చెరుకు సాగు పెంచేందుకు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించడంపై దృష్టి సారిస్తున్నామన్నారు.

సకాలంలో కోతలు పూర్తి చేయాలి..

గతంలో సకాలంలో చెరుకు కోతలు పూర్తిగాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈసారి అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కోత కార్మికులను సకాలంలో రప్పించి అనుకున్న సమయానికి కోతలు పూర్తి చేయాలి.

– నారాయణ, సింగంపేట

రైతు ప్రయోజనాలే ముఖ్యం..

ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు సాగుచేసిన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో కోతలు పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలే సిద్ధం చేసుకున్నాం. మద్దతు ధరతో పాటు సాగుకు రాయితీలు ఇస్తున్నాం. పంటను ఫ్యాక్టరీకి తరలించిన 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా అన్నిచర్యలు తీసుకుంటున్నాం. – రామ్మోహన్‌రావు, కేన్‌హెడ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement