గట్టెక్కుతామా..! | Sakshi
Sakshi News home page

గట్టెక్కుతామా..!

Published Fri, Nov 24 2023 1:18 AM

- - Sakshi

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల బలాలపై ఆరా

సమీపిస్తున్న పోలింగ్‌ తేదీ

ఏ ఇద్దరు కలిసినా అభ్యర్థుల గెలుపుపైనే చర్చ

అలంపూర్‌: ఏం భయ్‌ ఎట్లుంది మన పరిస్థితి. మనోళ్లు బాగా పని చేస్తున్నారా.. మన ప్రచారంపై ప్రజలు ఏమనుకుంటున్నారు. గెలుపు మన వైపు ఉన్నట్లే కదా! ప్రత్యర్థుల పరిస్థితి ఏంటి. మనకు అనుకూలించే పరిస్థితి ఉందా..! అనుకూలించని పరిస్థితులు ఏవీ. ఈ సారి మనం గట్టెక్కుతామా..! అందుకు చేయాల్సిన పనేంటీ.. ఇవే ప్రస్తుతం అభ్యర్థులు.. ముఖ్య నేతల మధ్య నిత్యం వినిపిస్తున్న చర్చలు. కొన్ని రోజులుగా ఏ ఇద్దరు కలిసినా ఏ సమూహం ఉన్నా.. ప్రస్తుతం అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థులపైనే సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. అభ్యర్థుల పరిస్థితితో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీల బలాలపై నిరంతరం విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది.

గెలుపు కోసం..

ఎవరికి వారు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమకు పట్టు ఉన్న ప్రాంతాలను నిలబెట్టుకోవడానికి ఒక అభ్యర్థి పాకులాడుతుండగా.. అక్కడి నుంచి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి మరో అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. తమకు వచ్చే ఓట్లను అంచనా వేస్తూ.. ప్రత్యర్థులకు వచ్చే ఓట్లపై ఆరా తీస్తున్నారు. తమకన్న తమ ప్రత్యర్థులకు కలిసివచ్చే అంశాలను బేరీజు వేస్తూ.. విశ్లేషించుకుంటున్నారు. ఎన్నికల్లో మెరుగుపడి విజయం తమను వరించడానికి కావాల్సిన అంశాలపై దృష్టిసారిస్తున్నారు. దీంతో అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి.

అంతర్గతంగా స్వతంత్రులు..

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్నప్పటికీ అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో స్వతంత్రుల ప్రచారం అంతర్గతంగానే కనబడుతుంది. ఈ సారి అసెంబ్లీ బరిలో 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల ఉపసంహరణతో 13 మంది బరిలో నిలిచారు. వీరిలో 8 మంది వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉండగా.. ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రులు ఉన్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి విజయుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌ కుమార్‌, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. వీరితో పాటు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు సైతం ఉన్నారు. కొన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారం అక్కడక్కడ కనిపిస్తుండగా.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారి ప్రచారం కనిపించడం లేదు. ఇక్కడ ప్రాధాన్య త కనిపించని ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వ తంత్రుల ప్రచారం అంతర్గతంగానే సాగుతుంది.

ప్రత్యర్థుల ఎత్తులతో..

రో వైపు మన ఓటు బ్యాంకు అని సంబరపడిన అభ్యర్థులకు ప్రత్యర్థుల ఎత్తులతో చిత్తువుతున్నారు. గ్రామస్థాయిలో ప్రభావం చూపే నాయకులు పార్టీ కండువాలు మార్చుతుండటంతో ఇప్పటి వరకు ఉన్న అభ్యర్థులు సమీకరణాలు తారుమారవుతున్నాయి. ఇలా ఎవరికి వారు ఎత్తులు.. పై ఎత్తులు వేస్తుండటంతో రాజకీయం రంజుగా మారింది.

పార్టీల అధినేతలతో ప్రచారం..

నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకొని తమ బలాన్ని మరింత పెంచుకోడానికి పార్టీ అధినేతలతో ప్రచార సభలతో ఆకట్టుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు తరఫున పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సంపత్‌ కుమార్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డిలతో ప్రచారం చేశారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్‌ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు ఆయా పార్టీలకు చెందిన కీలకు నేతలు ప్రచార పర్వంలోకి వస్తున్నారని ప్రచారం సాగుతోంది.

జోరుగా బుజ్జగింపులు

అభ్యర్థులు ప్రచార హోరులో మునిగిపోగా.. వారి అనుచర గణం గ్రామాల్లో ఉన్న ముఖ్య నేతలను, ఓటు బ్యాంక్‌ ఉన్న కుల సంఘాలను, ప్రజా సంఘాల నేతలను తమ వైపు తిప్పుకోవడంలో నిగ్నమయ్యారు. దీంతో నేరుగా లేదా వారి సన్నిహితుల ద్వార చర్చలు జరుపుతున్నారు. మీ మద్దతు మాకే ఉండాలి.. అలాగని వాగ్దానం చేయండి అంటూ హామీలు తీసుకుంటున్నారు.

దీంతో ఓటు బ్యాంక్‌ పలుకుబడి ఉన్న నాయకులు ఎవరికి మద్దతు ఇవ్వాలి.. ఎవరికి మద్దతు ఇస్తే తాము భవిష్యత్‌లో లాభపడుతామనే సందిగ్ధంతో లెక్కలు కడుతున్నారు. ఎవరు ఎవరి పక్కన ఉంటారో గెలుపు ఎవరి ముంగిట నిలుస్తోందో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement
Advertisement