మార్పు కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు | Sakshi
Sakshi News home page

మార్పు కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు

Published Fri, Nov 24 2023 1:18 AM

- - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: బుల్లెట్‌ ప్రూఫ్‌ లాంటి ఫాంహౌస్‌లో కూర్చొని పాలన చేయలేరని, తెలంగాణలో తొమ్మిదేళ్ల పాటు సీఎం సచివాలయానికి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడిందో పదేళ్లు అయినా ఇప్పటికీ నెరవేరలేదని, ప్రత్యేక రాష్ట్రంలో ఎవరికీ న్యాయం జరగలేదని విమర్శించారు. తెలంగాణలో ఒక కుటుంబం చేతుల్లోనే ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, హైదరాబాద్‌ మినహా జిల్లాల్లో అభివృద్ధి జరగలేదని, పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని కేసీఆర్‌, కేటీఆర్‌ అంటున్నారు.. బీహెచ్‌ఈఎల్‌, ఐఐటీలు, విద్యాసంస్థలు, హరిత విప్లవం, భారీ ప్రాజెక్టులు ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ హయాంలోని ప్రభుత్వాలేనని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుందన్నారు. పార్లమెంట్‌ పరిశీలకులు మోహన్‌కుమార్‌ మంగళం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ ముదిరాజ్‌, అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, మీడియా సెల్‌ కన్వీనర్‌ సీజే బెనహర్‌ పాల్గొన్నారు.

నేటినుంచి మంగళ

కై శిక ద్వాదశి ఉత్సవాలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని పది ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మంగళ కై శిక ద్వాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్‌ ఉత్తరపల్లి రామాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భూత్పూర్‌లోని మునిరంగస్వామి, మహబూబ్‌నగర్‌ మండలంలోని చౌదర్‌పల్లి సంజీవమూర్తి, మరికల్‌ మండలం ఇబ్రహీంపట్నంలోని మునిరంగస్వామి, ధన్వాడ మండలం గోటూర్‌ పోచమ్మ, బల్మూర్‌ మండలం తుమ్మన్‌పేటలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి, పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల చెన్నకేశవస్వామి, పాన్‌గల్‌ మండలం రాయినిపల్లి రామాలయం, వనపర్తి మండలం కడకుంట్ల ఆంజనేయస్వామి, వడ్డేపల్లి మండలం పైపాడ్‌ మునిరంగస్వామి, మానవపాడు మండలం బొంకూర్‌ చింతల మునిరంగస్వామి ఆలయాల్లో మంగళ కై శిక ద్వాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement