నీలి చిత్రాల సీడీల నుంచి కిడ్నీ రాకెట్‌ వరకూ.. | Sakshi
Sakshi News home page

నీలి చిత్రాల సీడీల నుంచి కిడ్నీ రాకెట్‌ వరకూ..

Published Tue, May 2 2023 12:34 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విశాఖపట్నం కిడ్నీ రాకెట్‌ వ్యవహారం తీగ లాగితే కాకినాడ జిల్లాలో డొంక కదిలింది. ఈ రాకెట్‌లో అరెస్టయిన ప్రధాన నిందితుడు నర్ల వెంకటేశ్వర్లు (వెంకటేష్‌) మూలా లు కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగులలో బయట పడ్డాయి. స్వగ్రామం కాండ్రేగుల అయినప్పటికీ అత డు సుమారు రెండు దశాబ్దాలుగా మండల కేంద్రమైన కరపలో వ్యాపారాలు చేస్తున్నాడు. కరప హైస్కూలులో పదో తరగతి చదువుకున్న వెంకటేష్‌ తన సోదరుడి వద్ద ఉంటూ.. కరపలో చిన్న దుకాణం అద్దెకు తీసుకుని, సీడీలు, క్యాసెట్లు విక్రయించేవాడు. ఆ ఆదాయం చాలదనుకున్నాడో ఏమో కానీ అక్రమార్జన వైపు మళ్లాడు. నీలి చిత్రాల సీడీలు, క్యాసెట్లు అద్దెకు ఇస్తూనే ఆర్థికంగా బలపడేందుకు ఏదో ఒకటి చేయాలని అనుకునేవాడని చెబుతున్నారు.

తొలి నాళ్లలో తన కిడ్నీ అమ్మగా వచ్చిన సొమ్ముతో వ్యాపారం ప్రారంభించాడని అప్పట్లో చెప్పుకునేవారు. సీడీల కొనుగోలు పేరుతో కాకినాడ, విశాఖపట్నం, చైన్నె తదితర పట్టణాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో పలువురితో ఏర్పడిన పరిచయం కాస్తా కిడ్నీ అమ్మకాల వరకూ వెళ్లిందని చెబుతున్నారు. డబ్బు అవసరం ఉన్న వారికి వల వేసి, కిడ్నీ రాకెట్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కమీషన్లు దండుకునే వాడని విశాఖ పోలీసుల దర్యాప్తులో తేలింది. వెంకటేష్‌ విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్‌ నడుపుతున్నట్టు కరప పరిసర గ్రామాల్లో 2019లోనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో అతడు కొంత కాలం కనిపించకుండా పోవడం అప్పట్లో ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. ఈ రాకెట్‌ గుట్టు ఇప్పుడు రట్టవడం.. 2019లో కిడ్నీ రాకెట్‌ కేసులో 40 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించినట్టు పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది.

తాజాగా కిడ్నీ రాకెట్‌లో వెంకటేష్‌ సూత్రధారి అని పోలీసులు నిర్ధారించడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు విస్మయానికి గురవుతున్నారు. తమ కళ్లెదుట సీడీలు అమ్మిన అతడు ఏకంగా కిడ్నీ రాకెట్‌కే ఒడిగట్టాడని తెలిసి నివ్వెరపోతున్నారు. కరపలో చిన్నషాపు అద్దెకు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టిన వెంకటేష్‌ అక్రమార్జన బాట పట్టాడు. సీడీల వ్యాపారం మానేసి, 2017లో కరపలోనే పేపకాయలపాలెం మార్గంలో ఖరీదైన స్థలం కొనుగోలు చేసి, జీ 2 భవనం నిర్మించాడు. మల్లేశ్వరి ఫ్యామిలీ కలెక్షన్స్‌ పేరిట వస్త్ర వ్యాపారం కూడా ప్రారంభించాడు. దీనికి సమీపంలోని మరో భవనంలో ఉన్న వస్త్ర దుకాణాన్ని కూడా కొనుగోలు చేశాడు. అక్కడే మరో స్థలం కొని మరో జీ 2 భవనం కూడా నిర్మిస్తున్నాడు. ఇలా వక్రమార్గం పట్టిన వెంకటేష్‌ చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు.

Advertisement
Advertisement