Sakshi News home page

దైన్యాన్ని తరిమి.. ధైర్యాన్ని నింపి..

Published Tue, May 9 2023 11:34 PM

- - Sakshi

సర్కారు స్పందన.. తొలగిన వేదన

రబీ రైతును గట్టెక్కిస్తోన్న ప్రభుత్వం

తడిసిన ధాన్యం వడివడిగా కొనుగోలు

పది రోజుల్లోనే ఖాతాలకు నగదు

వాస్తవాలు పట్టకుండా

విపక్ష నేతల విమర్శల బురద

సాక్షిప్రతినిధి,కాకినాడ: అకాల వర్షాల ఇబ్బందుల నుంచి రైతుల్ని గట్టెక్కించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. గడచిన వారం రోజులుగా అధికార యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరుగుతూ తడిసిన ధాన్యం కొనుగోలులో తలమునకలైంది. తడిసిన ధాన్యం ముక్కిపోయినా నిబంధనలు సడలించి కొనుగోలు చేసేలా చూస్తోంది. ధాన్యాన్ని కళ్లాల నుంచి తరలించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంది. నిధులకు వెనుకాడకుండా ప్రత్యేకంగా ట్రాక్టర్లను వినియోగిస్తోంది. పొడి ప్రాంతాలు, రైతు భరోసా కేంద్రాలకు తరలించి ధైర్యాన్ని నింపింది. ఇటీవల వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని పల్లపు ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. రైతుల ఆవేదన అధికారుల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమయానుకూలంగా స్పందించారు. తడిసిన ధాన్యం తరలింపు నుంచి కొనుగోలు వరకు నిశిత దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలలో మద్దతు ధరకు కొని 10 రోజుల్లోనే రైతు ఖాతాకు జమ చేస్తున్నారు.

ట్రాక్టర్ల ద్వారా తరలింపు

కోనసీమలో 1,113 ఎకరాలు ముంపునకు గురవ్వగా అధికారులు చొరవ తీసుకున్నారు. వర్షపు నీటిని బయటకు తోడించి ముంపు నుంచి కాపాడారు. ముంపు బారిన పడ్డ 2,300 ఎకరాలకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలను వినియోగించి రైతులకు భరోసా కల్పించారు. పొలాల్లో 1,800 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు దగ్గరుండి ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించారు. రవాణాకు సుమారు రూ.50 లక్షలు వెచ్చించారు. కళ్లాల్లో ఉన్న 23,279 మెట్రిక్‌ టన్నులను సంచుల్లో నింపి సమీప రైసుమిల్లులకు తరలించారు. దీనిపై రైతుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.

బురద చల్లేందుకు నిన్న బాబు.. నేడు పవన్‌

ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకుంటుంటే ప్రతిపక్ష నేతలు స్వార్థ రాజకీయంతో బురదజల్లుతున్నారని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. మూడు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల పరామర్శ పేరుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రైతుల నుంచి ఆయన పర్యటనకు స్పందన కొరవడింది. దీంత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. ఆయన వెళ్లగానే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి తూర్పులో పర్యటనకు బుధవారం వస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి కడియం ఆవ భూముల మీదుగా కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో పర్యటించనున్నారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. పవన్‌ పర్యటించే రెండు జిల్లాల్లోనూ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా పది రోజుల్లోపే రైతుల ఖాతాలకు సొమ్ములను కూడా జమ చేసింది. వాస్తవాలను పక్కకు నెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసమే విపక్ష నాయకులు పర్యటించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడ జిల్లా..

సేకరించిన ధాన్యం :

23253.080 (మెట్రిక్‌టన్నుల్లో)

రైతులు : 3129

చెల్లించేందుకు సిద్ధమైన మొత్తం : రూ. 46.81

ధాన్యం విలువ : రూ.47.45 (కోట్లలో)

రైతుల ఖాతాలకు జమ :

రూ.0.64 లక్షలు

వారంలోపే జమ చేశారు

నాకు ఎకరం పొలం ఉంది. 11 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. 1121 రకం వేశాను. కోత దశలో పంట మాసూలు చేయగా 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వెంటనే అవిడి రైతు భరోసా కేంద్రం–1 కు వెళ్లి చెప్పగా అదే రోజే తీసుకుని మిల్లుకు తరలించారు. ధాన్యానికి రూ.2,44,800 ఈ నెల 4న నా బ్యాంక్‌ అక్కౌంట్‌లో జమ అయ్యింది.

– కొండేటి వరదరాజు, అవిడి, కొత్తపేట మండలం

తడిసినా కొన్నారు

ఆరెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. 1121 సన్నాల రకం సాగు చేశాను. పంట కోత కోసి ధాన్యం రాశి పోశాను. అకాల వర్షాలకు తడిసినా రైతు భరోసా కేంద్రంలో కొర్రీలు వేయకుండా కొన్నారు. ఈ నెల 2న 118 క్వింటాళ్లకు గాను రూ.2,40,720 బ్యాంక్‌ అక్కౌంట్‌లో జమ అయ్యింది. ప్రకృతి ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం తోడుగా నిలిచింది.

– దెందుకూరి సూర్యనారాయణరాజు, అవిడి, కొత్తపేట మండలం

Advertisement
Advertisement