Sakshi News home page

తుంపర..లాభాల పరంపర

Published Fri, Jun 9 2023 11:44 AM

తుని మండలం తేటగుంటలో బిందు సేద్యం పరికరం పరిశీలన - Sakshi

బిందు, తుంపర పరికరాలతో

లాభసాటి వ్యవసాయం

జిల్లాలో 1300 హెక్టార్లలో సాగు లక్ష్యం

పరికరాలు అందజేతకు సన్నాహాలు

ఆర్బీకేల్లో ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

చిన్న సన్నకారు,

పెద్ద రైతులకు ప్రయోజనం

బోట్‌క్లబ్‌(కాకినాడ సిటీ): పంట సాగులో నీటి ఎద్దడిని సూక్ష్మ సేద్యం ద్వారా అరికట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసుకునేలా బిందు, తుంపర సేద్య పరికరాలు (డ్రిప్‌, స్పింక్లర్‌) రైతులకు అందజేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. బహిరంగ విపణిలో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయకుండా.. ఆర్బీకేల ద్వారా నామ మాత్రపు రుసుము చెల్లిస్తే చాలు.. సబ్సీడీపై సరఫరా చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆసక్తి కలిగిన రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆర్బీకేల్లో ప్రారంభమైంది. మైక్రో ఇరిగేషన్‌ అధికారులు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

2023–24 లక్ష్యాలు ఇలా..

జిల్లాలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మెట్ట ప్రాంతంలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బిందు, తుంపర సేద్య పరికరాల అవసరం ఉంది. ఈ ఏడాది 1300 హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం ప్రోత్సహించాలని మైక్రో ఇరిగేషన్‌ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అర్హులైన రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలు పరికరాలు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. పథకం అమలు, దరఖాస్తుల స్వీకరణ, సర్వే, బిందు, తుంపర సేద్య పరికరాల బిగింపు తదితర అంశాలను రైతు భరోసా కేంద్రాల్లోని ఉద్యాన సహాయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగేళ్లుగా 6352 మంది రైతులకు 7697 హెక్టార్లలో రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందజేశారు. గతేడాది సూక్ష్మ సేద్యం ద్వారా 900 హెక్లార్లు సాగు చేయాలని లక్ష్యం నిర్ధేశించుకున్నారు. అంతకు మించి 1052 హెక్టార్లు సాగు చేశారు. రూ.5.32 కోట్ల విలువైన పరికరాలను రైతులకు అందజేశారు. ఈ ఏడాది 1300 హెక్టార్లు లక్ష్యంకాగా ఇప్పటికే 1392 మంది 1366 హెక్టార్లలో సాగుకు ముందుకు వచ్చారు.

ఐదెకరాల్లోపు 90 శాతం రాయితీ

ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలు 90 శాతం రాయితీపై ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఐదెకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు గరిష్టం 12.50 ఎకరాల వరకు రాయితీ పరికరాలు పొందవచ్చు. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 90 శాతం, 5 నుంచి 12.50 ఎకరాల పైన ఉన్న రైతులకు 50 శాతం రాయితీ వర్తింప చేస్తారు. తుంపర సేద్యానికి ఎకరం నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు 55 శాతం, 5 ఎకరాలపైన ఉన్న రైతులకు 45 శాతం రాయితీతో పరికరాలు అందజేస్తారు. రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలి. డాక్యుమెంటేషన్‌ కంపెనీలే చేస్తాయి. రైతు వాటా కింద చెల్లించే నగదు ఫోన్‌పే ద్వారా మైక్రో ఇరిగేషన్‌ సంస్థకు చెల్లించవచ్చు. బిందు సేద్య పరికాలు ఉద్యాన పంటలకు ఇస్తారు.

అపరాలకు స్పీంకర్లు

అపరాలు, గడ్డి పండించేకునే రైతులకు సబ్సీడీపై స్పింక్లర్లు ఇస్తారు. 5 ఎకరాల్లోపు 50 శాతం, ఆపై 45 శాతం సబ్సిడీతో అందజేయనున్నారు.

రైతులు ఏం చేయాలంటే..

బిందు, తుంపర సేద్య పరికరాలు పొందాలనుకున్న రైతులు ఆధార్‌ కార్డు, మీ భూమి వన్‌బీ, బ్యాంకు పాస్‌ బుక్కు జిరాక్స్‌ కాపీలు ఆర్‌బీకేల్లో ఇస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం ఫీల్డ్‌ విజిట్‌ చేసి అర్హత ఉంటే మంజూరు చేస్తారు. రైతులకు విద్యుత్‌ సదుపాయం, బోరు తప్పనిసరిగా ఉండాలి.

డ్రిప్‌ ఉపయోగాలు..

పంటను బట్టి 30–70 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు.

పొలంలో ఉన్న మొక్కలన్నింటికీ సమానంగా నీరు అందుతుంది. పెరుగుదలలో వ్యత్యాసాన్ని నివారించే వీలుంటుంది.

పంట సాగులో వేధించే కలుపు సమస్యను అరికట్టే వెసులుబాటు కలుగుతుంది.

నీటి ద్వారా ఎరువుల సరఫరా చేస్తుండటంతో పెరుగుదలకు అనుగుణంగా పోషకాలు అందుతాయి.

ఏకకాలంలో పంట కోతకు వస్తుంది.

40 శాతం విద్యుత్‌ ఖర్చు ఆదా అవుతుంది. కూలీల ఖర్చులు తగ్గుతాయి.

పంటలకు చీడ పీడలు, పురుగు సమస్య తగ్గుతుంది. ఎత్తుపల్లాలు ఉన్న నేలలో సైతం నీటి సరఫరా సులభతరం అవుతుంది. నాణ్యమైన ఉత్పత్తి రావడంతో పాటు ఎకరానికి 20నుంచి 30 శాతం పంట దిగుబడి పెరుగుతుంది.

జిల్లాలో రిజస్ట్రేషన్‌ (హెక్టార్లలో) ఇలా..

మండలం రైతులు విస్తీర్ణం

గండేపల్లి 374 348.1

జగ్గంపేట 198 195.4

రౌతులపూడి 132 155.35

తుని 150 139.77

పెద్దాపురం 109 166.28

ఏలేశ్వరం 99 82.34

ప్రత్తిపాడు 63 69.21

తొండంగి 74 65.25

శంఖవరం 54 54.67

కోటనందూరు 58 52.93

గొల్లప్రోలు 39 43.95

కొత్తపలి 16 19.12

పిఠాపురం 15 12.23

సామర్లకోట 7 6.68

కిర్లంపూడి 3 4.29

తాళ్లరేవు 1 48

సద్వినియోగం చేసుకోవాలి

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో బిందు, తుంపర పరికరాలతో లాభసాటి వ్యవసాయం చేయవచ్చు. చిన్న, సన్నకారుల రైతులు ఈ పఽథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బిందు, తుంపర సేద్యం చేయాలనుకున్న రైతులు సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో అధికారులు సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ పథకానికి గడువు ఏమీ లేదు.

– జీవీవీవీ ప్రసాదరావు, జిల్లా మైక్రోఇరిగేషన్‌ అధికారి.

Advertisement

తప్పక చదవండి

Advertisement