Sakshi News home page

చంద్రబాబు మోసాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు

Published Wed, Nov 8 2023 11:38 PM

- - Sakshi

రామచంద్రపురం రూరల్‌: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మోసపు నైజాన్ని రాష్ట్ర ప్రజలు ఏనాడో గుర్తించారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలను, పంట రుణాలు రద్దు చేస్తానని రైతులను, ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను ఆయన మోసం చేశారని, దానికి బదులుగానే వారందరూ చంద్రబాబును సీఎం పీఠం నుంచి దించేశారన్నారు. ఆయన పాలనలో చేసిన స్కామ్‌లు ఒక్కొక్కటీ బయటపడుతున్నా, నిస్సిగ్గుగా అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కానీ నిజమైన సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మన ప్రభుత్వంలో మేలు జరిగితేనే.. తిరిగి తనకు ఓటు వేయాలి’ అని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నారన్నారు. రాష్ట్రానికి వైఎస్‌ జగనే ఎందుకు కావాలి అనే అంశంపై గురువారం నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కన్వీనర్లు, గృహసారథులతో ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పండు గోవిందరాజు, వైస్‌ చైర్మన్‌ కాకతీయ రాజు, ఏపీఐడీసీ డైరెక్టర్‌ వాసంశెట్టి శ్యామ్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర ఉత్తమ

ఉర్దూ టీచర్‌గా అలీబేగ్‌

మామిడికుదురు: నగరం గ్రామానికి చెందిన మహమ్మద్‌ అలీబేగ్‌ రాష్ట్ర ఉత్తమ ఉర్దూ టీచర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు బుధవారం రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి సమాచారం వచ్చింది. అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో ఈ నెల 11న నిర్వహించే జాతీయ విద్యా దినోత్సవ సభలో అలీబేగ్‌కు ఈ అవార్డును అందజేస్తారు. ఆయన ప్రస్తుతం కొత్తపేట మండలం కమ్మిరెడ్డి పాలెం ఎంపీపీ స్కూల్‌ టీచర్‌గా పని చేస్తున్నారు. 1994–95లో అలీబేగ్‌ ఉత్తమ విద్యార్థిగా, 2023లో కొత్తపేట నియోజకవర్గ స్థాయి ఉత్తమ టీచర్‌గా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ ఉర్దూ టీచర్‌ అవార్డుకు ఎంపికై న అలీబేగ్‌ను పలువురు అభినందించారు.

వదంతులు నమ్మవద్దు

కొవ్వూరు: రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇచ్చినట్టు సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న వదంతులు నమ్మవద్దని రోడ్డు కం రైలు బ్రిడ్జి (ఆర్‌సీఆర్‌బీ) డీఈఈ బీవీ మధుసూదనరావు వెల్లడించారు. మరమ్మతుల కోసం ఈ నెల పదో తేదీ వరకు అనుమతి తీసుకున్నామని, వాహనాల రావడం మూలంగా బ్రిడ్జిపై తాము చేపట్టే పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. కొందరు ఆకతాయిలు సోషల్‌ మీడియాలో మేసేజ్‌లు ట్రోల్‌ చేస్తున్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి మాత్రమే బ్రిడ్జిపై వాహనాలను అనుమతించనున్నట్లు ఆయన ప్రకటించారు. బ్రిడ్జిపైకి భారీ వాహనాలు రాకుండా ఇరు వైపు గడ్డర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం బ్రిడ్జి రోడ్డు మార్కింగ్‌, ఫుట్‌పాత్‌ల పెయింట్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. జాయింట్ల వద్ద మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

లోక్‌ అదాలత్‌లో కేసుల

సత్వర పరిష్కారం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లోక్‌అదాలత్‌ ద్వారా రాజీపడదగిన కేసులను సత్వరం పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఆమె ఆధ్వర్యంలో అండర్‌ ట్రయిల్‌ రివ్యూ కమిటీ, జాతీయ లోక్‌ అదాలత్‌పై సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ కేసుల దర్యాప్తు, చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. డిసెంబర్‌ 9న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించే దిశగా చూడాలన్నారు.

Advertisement
Advertisement