శ్రీపీఠం.. భక్తి కెరటం | Sakshi
Sakshi News home page

శ్రీపీఠం.. భక్తి కెరటం

Published Wed, Nov 15 2023 7:21 AM

- - Sakshi

వైభవంగా మహాశక్తి యాగం ఆరంభం

కుంకుమార్చనల వేదికపై ప్రతిధ్వనించిన లలితా సహస్రనామ స్మరణ

వేలాదిగా తరలివచ్చిన మహిళలు

కాకినాడ రూరల్‌: స్థానిక రమణయ్యపేటలోని శ్రీపీఠంలో భక్తికెరటం ఎగసిపడింది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 30 రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక మహా క్రతువుకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఇష్టకార్య సిధ్ధి పొందాలనే లక్ష్యంతో సంకల్పించిన మహాశక్తి యాగం.. పవిత్ర కార్తిక మాస ఆరంభం రోజైన మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. యజ్ఞయాగాలు, జపతపాలు, ఇతర వైదిక క్రతువులతో ఈ ప్రాంతంలో ఈ మాసమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. సువాసినులు తమ ఐదోతనం చల్లగా ఉండాలని కుంకుమార్చనలతో అమ్మవారిని వేడుకుంటారు. అటువంటిది ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి కొలువై ఉన్న శ్రీపీఠంలో.. నెల రోజుల పాటు జరిగే శతకోటి లలితా కుంకుమార్చన, కోటి దీపోత్సవం వంటి పూజా కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తూండటంతో వేలాదిగా మహిళలు తరలివస్తున్నారు. తొలి రోజు కుంకుమార్చనల్లో ఏకంగా 12 వేల మంది మహిళలు పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి శ్రీపీఠం, గోశాల వద్ద సందడి నెలకొంది. మహిళలు శ్రీపీఠంలో పంపిణీ చేసిన వస్త్రాలు ధరించి భగవంతుడు, అమ్మవార్ల ముందు తామంతా ఒకటే అన్నట్టుగా ఐక్యతను చాటుతూ క్రమశిక్షణతో తరలిచ్చారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. మహాశక్తి యాగం, బగళాముఖి అమ్మవారి విశిష్టత, హోమం, 27 నక్షత్రాలకు శాంతి పూజలు, 27 తిథి దేవతలకు పూజలు, కోటి దీపోత్సవం గురించి వివరించారు. కార్తిక మాసమంతా జరిగే ఈ మహాశక్తి యాగాన్ని ఒకే సంకల్పంగా భావించి మహిళలందరూ పాల్గొనాలని కోరారు. లలితా సహస్ర నామాలను స్వామీజీ స్వయంగా చదివి మహిళలతో కుంకుమార్చన చేయించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి బగళాముఖి హోమం, నక్షత్ర పూజలు దీపోత్సవం జరగనున్నాయని స్వామీజీ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా శ్రీపీఠం వలంటీర్లు సేవలందించారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా ట్రాఫిక్‌ సీఐ చైతన్యకృష్ణ, సర్పవరం సీఐ మురళీకృష్ణ, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు.

వైభవంగా శోభాయాత్ర

బోట్‌క్లబ్‌: మహాశక్తి యాగారంభాన్ని పురస్కరించుకొని కాకినాడ నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక రిజర్వు లైన్‌ అయ్యప్ప స్వామి ఆలయం నుంచి భానుగుడి సెంటర్‌ నుంచి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా జరిగిన ఈ యాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. కుంభకోణం నుంచి తీసుకుచ్చిన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలతో శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యాన ఈ యాత్ర జరిగింది. ఆద్యంతం కేరళ చెండై వాయిద్యాలు, తీన్‌మార్‌ డప్పులు, మహిళల కోలాటాల నడుమ యాత్ర సాగింది. హరహర మహాదేవ నామస్మరణతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా భానుగుడి సెంటర్‌లో భక్తులనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, ప్రపంచ పటంలో కాకినాడను ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుపుతామని అన్నారు. గతంలో ఎక్కడా చేయలేని మహాశక్తి యాగం నిర్వహించి ప్రపంచానికి చూపిస్తానన్నారు. యాగం పూర్ణాహుతి రోజున శ్రీపీఠంలో చరితాత్మక కట్టడాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.

కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు
1/2

కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు

శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు
2/2

శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు

Advertisement
Advertisement