రబీకి సమృద్ధిగా సాగునీరు | Sakshi
Sakshi News home page

రబీకి సమృద్ధిగా సాగునీరు

Published Wed, Nov 15 2023 7:21 AM

- - Sakshi

సమర్థ నీటి యాజమాన్య ప్రణాళిక అమలు

జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో మంత్రి వేణు

కాకినాడ సిటీ: వచ్చే రబీలో జిల్లాలోని 1.91 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు సమర్థ నీటి యాజమాన్య ప్రణాళికతో సాగునీరు అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ హాలులో జిల్లా సాగునీటి సలహా మండలి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు సంయుక్తంగా కలెక్టర్‌ కృతికా శుక్లా అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రబీలో పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇందుకు అనుగుణంగా ఇరిగేషన్‌, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ఇదీ ఇరిగేషన్‌ శాఖ ప్రణాళిక

జిల్లాలోని వివిధ సాగునీటి వ్యవస్థల కింద రబీ సాగునీటి సరఫరా ప్రణాళికలను ఇరిగేషన్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు తొలుత వివరించారు. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని మొత్తం 8.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీలో 91.35 టీఎంసీల సాగునీరు అవసరం కాగా, 82.49 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెప్పారు. వారాబందీ విధానం, క్రాస్‌బండ్లు, డీజిల్‌ ఇంజిన్లతో నీరు ఎత్తిపోయడం, ముందస్తు వరి నాట్ల ద్వారా మిగిలిన 10 శాతం కొరతను అధిగమించి, మొత్తం ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదిస్తున్నామని అన్నారు. జిల్లాలో తూర్పు డెల్టా పరిధిలోని 1.06 లక్షల ఎకరాలు, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీబీసీ) పరిధిలోని 32,500 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. పీబీసీ పరిధిలో 22,260 ఎకరాల్లో వరి, 10,240 ఎకరాల మెట్ట, శివారు ఆయకట్టులో అపరాల సాగుకు ప్రతిపాదించామన్నారు. ఏలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 11.31 టీఎంసీల నీటి నిల్వలున్నాయని, ఇందులో విశాఖ నగరం, స్టీల్‌ప్లాంట్‌ అవసరాలకు 4.50 టీఎంసీలు, మరో 4.5 టీఎంసీలు డెడ్‌ స్టోరేజీకి కేటాయించామన్నారు. 53 వేల ఎకరాల ఏలేరు ఆయకట్టులో రబీ పంటలకు మరో 2.31 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని ఎస్‌ఈ శ్రీనివాసరావు వివరించారు. ఇందులో 28 వేల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో అపరాల పంటలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించామన్నారు.

● గోదావరి డెల్టాలో రబీ పంటలకు సాగునీటి ఎద్దడి లేకుండా నివారించేందుకు, పోలవరం బ్యారేజీ గేట్లు దింపి, కనీసం 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలంటూ కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేసిన ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

● ఏలేరులో డెడ్‌ స్టోరేజీ స్థాయిని 4.5 టీఎంసీలకు బదులు 2 టీఎంసీలకు తగ్గించి, వీలైనంత మేర మెట్ట, శివారు ఆయకట్టులో అపరాలకు బదులు వరి సాగుకు అవకాశం కల్పించాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, రైతు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలను సవరించాల్సిందిగా ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావును సమావేశం కోరింది.

రైతులకు అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న నీటితో రబీ సాగును సజావుగా, సకాలంలో 2024 మార్చి 31లోగా పూర్తి చేసేందుకు వీలుగా రైతులు వచ్చే నెలాఖరులోగా నాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్‌ ఆలస్యమైన రైతులు పంట కాలం కలిసి వచ్చేందుకు వచ్చే నెల 10 లోగా వెదజల్లే పద్ధతిలో నాట్లు వేసుకోవాలని, దీనిపై రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకే) స్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. జనవరి చివరి వారం నుంచి వారాబందీ విధానం అమలు చేయాలని, ఏ భూములకు ఎప్పుడు నీరిచ్చేది షెడ్యూల్‌ రూపొందించి రైతులందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. రబీ సాగునీటి సరఫరా ప్రారంభానికి ముందే ఆక్వా అవసరాలకు నీటిని నింపుకొనే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ముందస్తు సాగు అవసరం, నీటి సరఫరా నియంత్రణ, షెడ్యూల్‌ తదితర అంశాలపై అన్ని స్థాయిల్లో వ్యవసాయ సలహా మండళ్లు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. నీరు పారని మెట్ట ప్రాంత రైతులు, నాట్లు సకాలంలో వేసుకోలేని వారు అపరాలు సాగు చేసేలా సూచించాలన్నారు.

రూ.1.45 కోట్లతో 25 పనులు

రబీ సాగునీటి విడుదలకు ముందే నీటి పారుదల సమస్యల నివారణకు తూర్పు డెల్టా పరిధిలో రూ.45.97 లక్షలతో 4, కాకినాడ డ్రైనేజీ డివిజన్‌ పరిధిలో రూ.41.12 లక్షలతో 12, ఏలేరు డివిజన్‌ పరిధిలో రూ.48.02 లక్షలతో 9 కలిపి మొత్తం రూ.1.45 కోట్ల డీఎంఎఫ్‌ నిధులతో 25 పనులు మంజూరు చేశామని కలెక్టర్‌ కృతికా శుక్లా వివరించారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేసి, గత సీజన్‌లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్‌ పద్ధతిలో రైతు సంఘాలే నిర్వహించుకునేందుకు మండలి ఆమోదం తెలిపింది. రబీలో సమర్థ సాగునీటి సరఫరాకు 42 ఆయిల్‌ ఇంజిన్లు, 30 క్రాస్‌బండ్లు, 8 షట్టర్లు, స్లూయిస్‌ల ఏర్పాటు, 31 డీసిల్టింగ్‌, వీడ్‌ రిమూవల్‌ పనులు, ఒక ఐడీసీ పని ప్రతిపాదించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజయకుమార్‌, సలహా మండలి అధ్యక్షుడు లంక ప్రసాద్‌, రాష్ట్ర సలహా మండలి సభ్యులు త్రినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement