28 నుంచి సమ్మేటివ్‌–1 | Sakshi
Sakshi News home page

28 నుంచి సమ్మేటివ్‌–1

Published Fri, Nov 24 2023 11:38 PM

పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులు - Sakshi

1 – 10 తరగతులకు

ఎస్‌సీఈఆర్‌టీ ప్రశ్నపత్రాలు

మండల కేంద్రాలకు పరీక్ష

పేపర్ల సరఫరా పూర్తి

రాయవరం: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మదింపు చేసేందుకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 28 నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకూ 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఎస్‌సీఈఆర్‌టీ నుంచి ప్రశ్నపత్రాలు సరఫరా చేశారు. ఈసారి టోఫెల్‌ పరీక్షలకు కూడా ప్రింటెడ్‌ ప్రశ్నపత్రాలు సరఫరా చేయడం గమనార్హం. 1 నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు బైలింగ్విష్‌ విధానంలో, పదో తరగతి వారికి మీడియం వారీగా ప్రశ్నపత్రాలు అందజేస్తారు. ఎస్‌ఏ–1 పరీక్షలకు విద్యా శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాలపై ప్రతి జిల్లాకు సీక్రెట్‌ క్యూఆర్‌ కోడ్‌ కేటాయించారు. పేపర్లను ఎవరైనా లీక్‌ చేసినా, ఏ పాఠశాల నుంచి లీక్‌ అయినా విషయం క్షణాల్లో బయట పడే అవకాశం ఉండేలా చర్యలు చేపట్టారు.

రెండు ఫార్మేటివ్‌ పరీక్షలు పూర్తి

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1, 2 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది పరీక్ష పేపర్ల మూల్యాంకనం, పరీక్ష పేపర్లను విద్యార్థులకు ఇచ్చి, వారి తల్లిదండ్రుల సంతకాలు తీసుకునేందుకు, మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు షెడ్యూల్‌ ఇవ్వడం గమనార్హం. జనవరిలో ఫార్మేటివ్‌–3, మార్చిలో ఫార్మేటివ్‌–4, ఏప్రిల్‌లో 1 నుంచి 9 తరగతులకు ఎస్‌ఏ–2, మార్చిలో పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇదీ పరీక్షల టైం టేబుల్‌

● 1–5 తరగతులకు ఈ నెల 28న తెలుగు, డిసెంబర్‌ 1న ఇంగ్లిష్‌, 2న గణితం, 4న పరిసరాల విజ్ఞానం, 5న ఇంగ్లిష్‌ పార్ట్‌–బి టోఫెల్‌ పరీక్ష.

● 6–10 తరగతులకు ఈ నెల 28న తెలుగు, డిసెంబర్‌ 1న హిందీ, 2న ఇంగ్లిష్‌, 4న గణితం.

● డిసెంబర్‌ 5న 6–7 తరగతులకు జనరల్‌ సైన్స్‌, 8–10 తరగతులకు పీఎస్‌.

● డిసెంబర్‌ 6న 8–10 తరగతులకు బీఎస్‌, 7న సోషల్‌ స్టడీస్‌, 8న ఇంగ్లిష్‌ పార్ట్‌–బి టోఫెల్‌ పరీక్ష.

● 1–5 తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు.

● 6, 8, 10 తరగతులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ.. 7, 9 తరగతులకు మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.

● 1–8 తరగతులకు 80 మార్కులకు, 9, 10 తరగతులకు 100 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు.

తొలిసారి టోఫెల్‌ ప్రింటెడ్‌ పేపర్లు

ఇంగ్లిష్‌లో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించేందుకు ప్రభుత్వం టోఫెల్‌ విద్యను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు టోఫెల్‌ పరీక్షను ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీలు పాఠశాలల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించగా, తొలిసారి ప్రింటెడ్‌ పేపర్లను ఎస్‌సీఈఆర్‌టీ సరఫరా చేసింది. సాధారణ పరీక్షల మాదిరిగానే ఇకపై టోఫెల్‌ పరీక్షను ప్రింటెడ్‌ పేపర్లలో విద్యార్థులు రాయనున్నారు.

2.02 లక్షల మంది విద్యార్థులు

ఈ నెల 28 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1–5 తరగతుల వరకు 42,014 మంది, ప్రైవేట్‌ పాఠశాలల్లో 56,313 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 6–10 తరగతుల వరకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 66,719 మంది, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో 37,480 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా మొత్తం మీద 1,580 ప్రభుత్వ యాజమాన్య, 456 ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో 2,02,532 మంది విద్యార్థులు ఎస్‌ఏ–1 పరీక్షలు రాయనున్నారు.

మండల కేంద్రాలకు పేపర్ల పంపిణీ

జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (డీసీఈబీ) ద్వారానే ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పరీక్ష పేపర్లను డీసీఈబీ ద్వారా మండల విద్యా కేంద్రాలకు చేరవేశారు. వీటికి సంబంధిత ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు కస్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పది పబ్లిక్‌ పరీక్ష పేపర్ల మాదిరిగానే పరీక్షల తేదీల వారీగా ప్రశ్న పత్రాలను ట్రంకు బాక్సుల్లో భద్రపర్చారు.

Advertisement
Advertisement