సత్యదేవునికి కాసుల వర్షం | Sakshi
Sakshi News home page

సత్యదేవునికి కాసుల వర్షం

Published Thu, Nov 30 2023 2:24 AM

- - Sakshi

అన్నవరం: పవిత్ర కార్తిక మాసం స్థానిక వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి కాసుల వర్షం కురిపిస్తోంది. కార్తిక మాసంలో తొలి విడతగా దేవస్థానంలో హుండీలను బుధవారం తెరిచి లెక్కించగా రూ.1,81,26,154 ఆదాయం వచ్చింది. ఈ ఆదాయంలో ఎక్కువ భాగం కార్తికమాసంలోనిదే అని అధికారులు తెలిపారు. మొత్తం ఆదాయంలో నగదు రూ.1,76,17,654 కాగా, చిల్లర నాణేలు 5,08,500. ఏటా కార్తిక మాసంలో తొలివిడతగా పౌర్ణిమ తరువాత, రెండో విడతగా కార్తికమాసం ముగిశాక రెండు సార్లు హుండీలను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించడం ఆనవాయితీ. హుండీల ఆదాయం లెక్కింపును దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ కె.రామచంద్రమోహన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు పర్యవేక్షించారు.

బంగారు, వెండి ఆభరణాలు

నగదుతో పాటు హుండీల ద్వారా స్వామివారికి 42 గ్రాముల బంగారం, 976 గ్రాముల వెండి, అమెరికా డాలర్లు 701, సింగపూర్‌ డాలర్లు 56, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కువైట్‌ దీనార్లు 20, యూరోలు 15, కెనడా డాలర్లు 20, మలేషియా రిమ్స్‌ ఐదు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహెరిన్‌ దినార్‌ ఒకటి, ఖతార్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కరెన్సీ ఒకటి, ఇండోనేషియా కరెన్సీ ఇదు రూపాయిలు, సౌదీ అరేబియా రియల్స్‌ మూడు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానంలో హుండీలను ఉదయం ఎనిమిది గంటలకు తెరిచి కానుకల లెక్కింపు ప్రారంభించగా మధ్యాహ్నం మూడు గంటలకు లెక్కింపు పూర్తయింది. దేవస్థానం సిబ్బందితో పాటు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

గతేడాది 3.11 కోట్లు

గతేడాది కార్తిక మాసంలో హుండీల ద్వారా రూ.3.11 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కార్తికమాసంలో తొలి విడతగా రూ.1.81 కోట్లు వచ్చింది. రెండో విడతలో మరో రూ.1.31 కోట్లు వస్తే గతేడాది ఆదాయాన్ని అధిగమించినట్టు అవుతుంది.

హుండీల ద్వారా రూ.1.81 కోట్ల ఆదాయం

Advertisement

తప్పక చదవండి

Advertisement