వ్యక్తి ప్రాణం కాపాడిన ట్రాఫిక్‌ సీఐ | Sakshi
Sakshi News home page

వ్యక్తి ప్రాణం కాపాడిన ట్రాఫిక్‌ సీఐ

Published Tue, Dec 5 2023 5:08 AM

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తికి 
కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ రామకృష్ణ  - Sakshi

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ కాపాడారు. ఎస్పీ పి.జగదీష్‌ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రజాభద్రత కోసం ప్రతి రోజు విజువల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించారు. ఆ సమయంలో దోభీఘాటు వైపు వెళ్తున్న ఆయన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై పడుకుని ఉండడం గమనించారు. వెంటనే ఆయన అక్కడకు చేరుకుని ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. స్థానిక సింహాచల్‌నగర్‌కు చెందిన పగడాల నానిగా అతనిని గుర్తించారు. తాను కుటుంబ గొడవలు, సమస్యల కారణంగా మనస్థాపం చెంది, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో రైలు పట్టాలపై పడుకున్నానని నాని సీఐకు తెలిపాడు. అతనికి సీఐ ధైర్యం చెప్పి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి, అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కార్తీక వర్మ మృతదేహం గుర్తింపు

ముమ్మిడివరం: అదృశ్యమైన బీటెక్‌ విద్యార్థి కార్తీక వర్మ(22) మృతదేహాన్ని వృద్ధ గౌతమి గోదావరిలో పోలీసులు గుర్తించారు. ముమ్మిడివరం మండలం చినకొత్తలంకకు చెందిన కార్తీక వర్మ ఆదివారం తెల్లవారు జామున స్నేహితుడి ఇంటి వద్ద మోటారు బైక్‌, కాళ్ల చెప్పులు వదలి అదృశ్యమైన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం సీఐ ఎన్‌.కొండయ్య, ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ కాడినాడ నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. స్పైడర్‌ అనే డాగ్‌ ముందుగా కార్తీక వర్మ చెప్పులను వాసన చూసి అక్కడ నుంచి కర్రివాని రేవు ప్రధాన పంట కాలువపై ఉన్న వంతెన దాటి కొబ్బరి తోటల మీదుగా వృద్ధ గౌతమీ గోదావరి పాయ వరకు వెళ్లి ఆగిపోయింది. ఈ మేరకు పోలీసులు కార్తీక వర్మ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో నాటు పడవలపై గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం కర్రివాని రేవు వద్ద వృద్ధ గౌతమీ గోదావరి పాయలో కార్తీక వర్మ మృతదేహాన్ని గుర్తించారు. ఎస్సై శివప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తీర్థయాత్రకు వచ్చిన ముస్లిం మహిళ అనంత లోకాలకు..

అంబాజీపేట: కార్తిక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతో మహిమ కలిగిన ఏకాదశరుద్రులను దర్శించుకునేందుకు బస్సులో వచ్చిన ఓ మహిళ సోమవారం ఉదయం అదే బస్సు కిందపడి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, మలకపల్లికి చెందిన ముస్లిం మహిళ షేక్‌ ఫాతిమా బీబీ (57) కొవ్వూరు ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరిన ఏకాదశ రుద్రుల దర్శిని, ప్రత్యేక బస్సులో ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు తీర్థయాత్రకు వచ్చారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు శివారు వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు బస్సు దిగిన ఆ మహిళ ప్రమాదవశాత్తూ అదే బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్సై ఎ.చైతన్యకుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement