విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Published Tue, Dec 5 2023 5:08 AM

-

తుపాను షెల్టర్స్‌, హాస్పిటల్స్‌కు అంతరాయం కలగకూడదు

ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి ఆదేశం

ఐదు సర్కిళ్లలో కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు

సాక్షి, విశాఖపట్నం: మిచాంగ్‌ తుపాను ప్రభావం వల్ల కలిగే విద్యుత్‌ ప్రమాదాలు, అంతరాయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఫృథ్వీతేజ్‌ ఇమ్మడి సూచించారు. సంస్థ కార్పొరేట్‌ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సంస్థ డైరెక్టర్లు, ఐదు సర్కిళ్ల అధికారులకు అవసరమైన సూచనలను సీఎండీ చేశారు. ప్రమాదాలు, అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కి తెలియజేయాలన్నారు. తుపాను సహాయక కేంద్రాలకు, హాస్పిటల్స్‌కు తప్పనిసరిగా విద్యుత్‌ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ల ఎస్‌ఈలను ఆదేశించారు. తుపాను ప్రభావానికి తెగిపడే విద్యుత్‌ వైర్లను, విద్యుత్‌ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్లను సరిచేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను అందుబాటులో ఉంచాలని ఎస్‌ఈలను ఆదేశించారు. డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ బి.రమేష్‌ ప్రసాద్‌ రాజమహేంద్రవరం సర్కిల్‌లోనూ, డైరెక్టర్‌ ప్రాజెక్ట్స్‌ ఏవీవీ సూర్యప్రతాప్‌ ఏలూరు సర్కిల్‌లో పునరుద్ధరణ చర్యల ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే విద్యుత్‌ అంతరాయాల ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేసుకునేందుకు ఐదు జిల్లాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు సీఎండీ తెలిపారు. సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912, వాట్సాప్‌ నంబర్‌ 8500001912, కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లకు తెలియజేయాలని సూచించారు.

కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు

టోల్‌ ఫ్రీ నంబర్‌ : 1912

కార్పొరేట్‌ కార్యాలయం : 9440816373

శ్రీకాకుళం : 9490612633

విజయనగరం : 9490610102

విశాఖపట్నం : 7382299975

రాజమహేంద్రవరం : 7382299960

ఏలూరు : 9440902926

Advertisement
Advertisement