సీఎంను ఓడించి చరిత్ర సృష్టిస్తారు! : కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

సీఎంను ఓడించి చరిత్ర సృష్టిస్తారు! : కిషన్‌రెడ్డి

Published Sat, Nov 4 2023 1:40 AM

- - Sakshi

సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించి కామారెడ్డి ప్రజలు చరిత్ర సృష్టిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం కామారెడ్డిలో పార్టీ నియోజకవర్గ బూత్‌ విజయ్‌ అభియాన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కిషన్‌రెడ్డికి జాతీయ రహదారిపై పొందుర్తి వద్ద బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారినుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు, నిజాంసాగర్‌ చౌరస్తా, స్టేషన్‌రోడ్డు, ఇందిరాచౌక్‌ మీదుగా రాజారెడ్డి గార్డెన్‌ వరకు సాగింది.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు చైతన్యశీలురని, బీఆర్‌ఎస్‌ నేతలు ఎన్ని కోట్లు కుమ్మరించినా వారిని కొనలేరని పేర్కొన్నారు. కేసీఆర్‌ను గజ్వేల్‌ ప్రజలు రెండుసార్లు గెలిపిస్తే ఆయన వారికి చేసిందేమీ లేదన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ తెలంగాణలో రోడ్ల గురించి గొప్పగా మాట్లాడారని, ఆ జాతీయ రహదారులకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల పేరుతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

నా ఆస్తి కార్యకర్తలే..
తన యావదాస్తి బీజేపీ కార్య కర్తలు, ప్రజలేనని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. బూత్‌ విజయ్‌ అభియాన్‌లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ కార్యకర్తలు నోట్లు, బీరు, బిర్యానీలకు ఆశపడి వచ్చేవారు కాదన్నారు. తమకు ప్రతి గ్రామంలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ సత్తా చూపాలనే శుభం ఫంక్షన్‌ హాల్‌ ముందు నుంచి ర్యాలీ తీశామన్నారు. కామారెడ్డిలో ధర్మానికి, నీతి, నిజాయితీకి పేరైన బీజేపీకి.. అవినీతి, అధర్మం, అక్రమాలకు మారుపేరైన బీఆర్‌ఎస్‌కు మధ్య యుద్ధం జరుగుతోందని, సీఎం కేసీఆర్‌ను ఓడించడం ఖాయమని పేర్కొన్నారు.

వాళ్లొస్తే పెనంమీంచి పొయ్యిలో పడ్డట్లే..
బీఆర్‌ఎస్‌ వాళ్లు బర్రెలు తింటే, కాంగ్రెస్‌ వాళ్లు ఏనుగులు తినే రకమని, వారికి అధికారం అప్పగిస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టేనని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 365 మంది విద్యార్థులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్‌ దని, మలిదశ ఉద్యమంలో 1,200 మందిని పొట్టన పెట్టుకున్నదీ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. గ్యారంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజల్ని వంచించిందన్నారు.

ఇక్కడా అవే గ్యారంటీలతో వస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ డబ్బులిస్తున్నారని, వాళ్లు గెలిచినా గతంలోలాగే బీఆర్‌ఎస్‌ గూటికి చేరతారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టేనన్న విషయాన్ని ప్రజలు మరచిపోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావలసిందేనని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో నీతివంతమైన పాలన సాగుతోందని, రాష్ట్రంలో బీసీ సీఎం నాయకత్వంలో నీతివంతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు.

బీసీలు బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు. 24 గంటలూ అందుబాటులో ఉండే బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డితో మేలు జరుగుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వెంకటరమణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. రాష్ట్రంలో ఏర్పడబో యే బీజేపీ ప్రభుత్వంలో ఆయనను మంత్రిగా నిలబెట్టే బాధ్యత తనదని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులు మురళీధర్‌గౌడ్‌, మహీపాల్‌రెడ్డి, నీలం రాజులు, చీకోటి ప్రవీణ్‌, కుంట లక్ష్మారెడ్డి, విపుల్‌ జైన్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, వెంకట్‌రెడ్డి, నరేందర్‌, తేలు శ్రీనివాస్‌ తదిరతులు పాల్గొన్నారు.

కామారెడ్డికి ఒరిగిందేమీ లేదు..
తెలంగాణ వచ్చిన తర్వాత కామారెడ్డికి జరిగిన మేలు ఏమీ లేకపోగా, రైతులు తయారు చేసే బెల్లం మీద ఆంక్షలు పెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, డబ్బు, అధికార దుర్వినియోగం, మజ్లిస్‌ పార్టీల మీదే నమ్మకం ఉందని విమర్శించారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న ముఖ్యమంత్రి వందలసార్లు మాట తప్పారన్నారు. ఆయన తల నరుక్కోవడం కాదని, బీఆర్‌ఎస్‌ పార్టీ తల నరికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement