బంగారు తునకజేస్త | Sakshi
Sakshi News home page

బంగారు తునకజేస్త

Published Fri, Nov 10 2023 5:18 AM

- - Sakshi

కేసీఆర్‌ పర్యటన ఇలా..

సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డిని మరింత అభివృద్ధి చేసి బంగారు తునకలెక్క జేస్తనని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కామా రెడ్డి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసీఆర్‌ గురువారం నామినేషన్‌ వేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘కామారెడ్డికి హైవే, రైల్వేలైన్‌ ఉన్నయి. ఇక్కడ అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఉంది. అందుకు కావలసిన ప్రణాళిక నా దగ్గర ఉన్నది. చూస్తుండగానే ఊహకందనంత అభివృద్ధి సాధిస్తాం’’ అని సీఎం పేర్కొన్నారు.

కేసీఆర్‌ వెనకాలే..

‘‘కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేయడానికి వస్తుండంటే ఒక్కడే వస్తడా, వెనకాల నీళ్లొస్తయి, నిధులొస్తయి, ఇంకా ఎన్నో వస్తయి. కామారెడ్డి రూపురేఖలే మారిపోతయి’’ అని గులాబీ దళపతి పేర్కొన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను ఏడాదిన్నరలో పూర్తి చేసి సాగునీరందిస్తామన్నారు. కామారెడ్డిలో ఐటీ సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు.

‘గంప’ భవిష్యత్తుకు హామీ..

గంప గోవర్ధన్‌తోపాటు ఉమ్మడి జిల్లా నాయకులు అడగడంతోనే కామారెడ్డినుంచి పోటీ చేస్తున్నానని కేసీఆర్‌ పేర్కొన్నారు. తన పదవిని త్యాగం చేసిన గంప గోవర్ధన్‌ భవిష్యత్తుకు ఏ ఇబ్బందీ ఉండదన్నారు. ఆయనను మరింత ఎత్తుకు పెంచే బాధ్యత తనదన్నారు. అప్పట్లో గంప గోవర్ధన్‌ను గెలిపిస్తే కామారెడ్డిని జిల్లా చేస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నానని, మెడికల్‌ కాలేజీ ఇచ్చానని గుర్తు చేశారు.

ప్రజల్లో చర్చ పెట్టాలె..

దళితులు తరతరాలుగా అణచివేత, దోపిడీకి గురయ్యారని, వారిని ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. వారి ఉన్నతి కోసం తాను దళితబంధు తీసుకువచ్చి అమలు చేశానన్నా రు. దీనిపై ఊరూరా చర్చ జరగాలన్నారు. ‘‘రైతుబంధు, 24 గంటల కరెంటు ఇచ్చి కడుపుల పెట్టుకునే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలా? మూడు గంట ల కరెంటు ఇస్తామని, ధరణిని తీసేస్తామని చెబుతు న్న కాంగ్రెస్‌ కావాలా?’’ అన్న అంశంపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రజల్లో చర్చ పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ రాకముందు వ్యవసాయం ఎట్లుండె? కాలిపోయే మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లతో రైతులు పడ్డ గోసలు మరిచిపోయి వాళ్లకు ఓటేద్దామా’’ అన్న దానిపై చర్చించాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం గులాబీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కేసీఆర్‌ చేసిన ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు. కొందరు మాటిమాటికీ అరుపులు, ఈలలు వేస్తుండడంతో సీఎం వారిని వారించారు. సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేశవరావ్‌, బీబీపాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే సింధే, ఎమ్మెల్సీలు సుభాష్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌, డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జాహ్నవి, నాయకులు కె.తిర్మల్‌రెడ్డి, ఎల్‌.నర్సింగ్‌రావు, తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్‌రావ్‌, అయాచితం శ్రీధర్‌, బొంతు రామ్మోహన్‌, భానుప్రసాద్‌, ఆంజనేయులు, వకీల్‌ రామారావు పాల్గొన్నారు.

‘‘ఈ గడ్డతో నాకు పుట్టుకతోనే బంధమున్నది. బీబీపేట మండలంలోని కోనాపూర్‌(పోసానిపల్లె)లో మా అమ్మ పుట్టింది. ఆర్గొండలో మేనమామలు ఉంటుండె. చిన్నతనంలో వచ్చినపుడు పట్టాల దగ్గర బాదల్‌చంద్‌ ఇంట్లో ఉండెటోళ్లం. గంజి అడ్తిల నిమ్మల జీవారెడ్డి దగ్గరా ఉండెటోళ్లం. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినపుడు కామారెడ్డి కోర్టులో వకీళ్లు మా బావ రామారావు, మిత్రుడు తిర్మల్‌రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ తెలంగాణ కోసం తొలి తీర్మానం చేసి ఉద్యమానికి ఊపునిచ్చింది. జలసాధన ఉద్యమంలో మండలానికొకరు బ్రిగేడియర్‌గా ఉండే.. నేను కామారెడ్డి మండల బ్రిగేడియర్‌గా పనిజేసిన. సభల కోసం గులాబీ కూలీ పనిచేసినపుడు నేను దేశాయి బీడీ కంపెనీల పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డి అగ్రభాగాన నిలిచింది’’

– కామారెడ్డి సభలో సీఎం కేసీఆర్‌

● సీఎం కేసీఆర్‌ గురువారం ఉదయం 11.57 గంటలకు ఎస్పీ కార్యాలయం వద్దనున్న హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

● 11.59 గంటలకు ప్రత్యేక బస్సులో ప్రభుత్వ విప్‌ గంప ఇంటికి బయలుదేరారు.

● మధ్యాహ్నం 12.06 గంటలకు గంప ఇంటికి చేరుకుని ముఖ్య నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.

● 1.59 గంటలకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. 2 గంటలకు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసి దాఖలు చేశారు.

● 2.22 గంటలకు ఆర్డీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి మళ్లీ ప్రభుత్వ విప్‌ ఇంటికి బయలుదేరారు.

● 3.16 గంటలకు డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుని, ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.

● 3.22 గంటలకు కేసీఆర్‌ ప్రసంగాన్ని ప్రారంభించి, 3.59 గంటలకు ముగించారు.

● 04.04 గంటలకు ప్రత్యేక బస్సులో ఎస్పీ కార్యాలయం వద్దనున్న హెలీప్యాడ్‌కు బయలుదేరారు. అక్కడినుంచి హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌ పయనమయ్యారు. – కామారెడ్డి టౌన్‌

ఈ ప్రాంతంతో నాది పేగుబంధం

నా వెనకాలే నీళ్లొస్తయి, నిధులొస్తయి

పరిశ్రమలు, విద్యాసంస్థలూ వస్తయి

చూస్తుండగానే ఎంతో అభివృద్ధి..

కామారెడ్డి సభలో సీఎం కేసీఆర్‌

గులాబీ శ్రేణుల్లో జోష్‌ నింపిన

అధినేత ప్రసంగం

గులాబీ కండువా కప్పుకున్న సుభాష్‌రెడ్డి

బీబీపేట మండలం జనగామకు చెందిన సమాజ సేవకుడు తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి గురువారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్‌ కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

కేసీఆర్‌తో మరింత అభివృద్ధి

కామారెడ్డి క్రైం: సీఎం కేసీఆర్‌తోనే కామారెడ్డి మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ఇక్కడకు వస్తే పెండింగ్‌ పనులు పూర్తికావడమే కాకుండా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని భావించి తానే కామారెడ్డినుంచి పోటీ చేయాలని సీఎంను కోరానన్నారు. ప్రజలు కనీసం లక్ష మెజార్టీని కానుకగా ఇవ్వాలని కోరారు.

సభలో పాల్గొన్న ప్రజలు
1/5

సభలో పాల్గొన్న ప్రజలు

2/5

కేసీఆర్‌కు దట్టి కడుతున్న ముజీబొద్దీన్‌
3/5

కేసీఆర్‌కు దట్టి కడుతున్న ముజీబొద్దీన్‌

కేసీఆర్‌కు బొట్టుపెట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తున్న 
గంప గోవర్ధన్‌ సతీమణి
4/5

కేసీఆర్‌కు బొట్టుపెట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తున్న గంప గోవర్ధన్‌ సతీమణి

సుభాష్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం
5/5

సుభాష్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం

Advertisement
Advertisement