మూడేళ్లలో మూడుసార్లు.. | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో మూడుసార్లు..

Published Sun, Nov 12 2023 12:36 AM

- - Sakshi

ఎల్లారెడ్డి: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం బీఆర్‌ఎస్‌ ఎన్నికలను ఆయుధంగా ఉపయోగించుకుంది. 2004లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన గులాబీ దళం.. ఆ ఎన్నికలలో జిల్లా పరిధిలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విజయం సాధించింది. ఏనుగు రవీందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 2008లో తమ శాసనసభ్యులతో రాజీనామా చేయించారు. కేసీఆర్‌ పిలుపుమేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికలలో మరోసారి పోటీ చేశారు. అయితే ఓటర్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని తిరస్కరించి, కాంగ్రెస్‌ అభ్యర్థి జనార్దన్‌ గౌడ్‌ను గెలిపించారు. 2009లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఓటర్లు మనసు మార్చుకుని మరోసారి ఉద్యమ పార్టీకే జై కొట్టారు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీందర్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి జనార్దన్‌ గౌడ్‌పై గెలిచారు.

తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ మరోసారి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడంతో 2010లో మళ్లీ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీఆర్‌ఎస్‌నుంచి రవీందర్‌రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్‌నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, టీడీపీనుంచి జాజాల సురేందర్‌ పోటీకి సిద్ధమయ్యారు. అయితే అధికార పక్షానికి చెందిన ముఖ్య నాయకుడు పోటీలో ఉంటున్న నేపఽథ్యంలో ఈవీఎంల ద్వారా పోలింగ్‌ జరిగితే ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందేమోనని అనుమానించిన బీఆర్‌ఎస్‌.. బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేసింది. ఎక్కువ మంది అభ్యర్థులను పోటీలో ఉంచితే ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలను నిర్వహించక తప్పదని భావించి 72 మందితో నామినేషన్లు వేయించింది. టీఆర్‌ఎస్‌ వ్యూహం ఫలించడంతో 75 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జంబో బ్యాలెట్‌ పేపర్‌తో ఉప ఎన్నికలు జరిగాయి. న్యూస్‌ పేపర్‌ పరిమాణంలో ఉన్న బ్యాలెట్‌ పేపర్లు వేయడానికి జంబో బ్యాలెట్‌ బాక్స్‌లను కూడా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేకంగా తయారు చేయించాల్సి వచ్చింది. ఆ ఎన్నికలలోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీందర్‌రెడ్డే గెలుపు తీరాలకు చేరారు. ఇలా మూడేళ్లలో మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరగడం, ఒకసారి జంబో బ్యాలెట్‌తో ఎలక్షన్స్‌ నిర్వహించాల్సి రావడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది.

సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్లకోసారి జరుగుతుంటాయి. కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రం మూడేళ్లలో ముచ్చటగా మూడుసార్లు ఎన్నికల పండుగొచ్చింది. 2008లో ఉప ఎన్నికలు రాగా.. 2009లో సాధారణ ఎన్నికలు వచ్చాయి. 2010లో మరోసారి ఉప ఎన్నిక జరిగింది. 2008 ఉప ఎన్నికలలో ఉద్యమ పార్టీని తిరస్కరించిన ఓటర్లు.. ఆ తర్వాత రెండు ఎన్నికలలో అదే పార్టీని ఆదరించారు.

ఉద్యమ నేపథ్యంలో ఎల్లారెడ్డిలో

రెండుసార్లు బై ఎలక్షన్స్‌

2010లో బరిలో 75 మంది..

జంబో బ్యాలెట్‌తో

పోలింగ్‌

ఒకసారి ఓడి, రెండుసార్లు

గెలిచిన బీఆర్‌ఎస్‌

1/1

Advertisement
Advertisement