సీఎం సభాస్థలి పరిశీలన | Sakshi
Sakshi News home page

సీఎం సభాస్థలి పరిశీలన

Published Sun, Nov 12 2023 12:36 AM

- - Sakshi

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డిలో ఈనెల 15న నిర్వహించే సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే సురేందర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15న మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని సాయినగర్‌ వెంచర్‌లో బహిరంగ సభ ఉంటుందన్నారు. ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యం, నాగిరెడ్డిపేట జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఫిర్యాదు చేయొచ్చు

కామారెడ్డి క్రైం: కామారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల ఎన్నికల అంశాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఆర్థర్‌ వర్చుయోకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కలెక్టరేట్‌లోని 102 నంబర్‌ గదిలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులను నేరుగా కలిసిగానీ, 63041 08748 నంబర్‌కు ఫోన్‌చేసిగానీ ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు.

పోచారం శ్రీనివాస్‌రెడ్డికి

నిరసన సెగ

రుద్రూర్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని పోతంగల్‌ మండలం హెగ్డోలిలో శనివారం ఎన్నికల ప్రచారం చేస్తున్న బాన్సువాడ నియోజక వర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్ర చార వాహనంపై అభ్యర్థి పోచారం వస్తుండగా కొందరు యువకులు ప్లకార్డులు పట్టు కుని నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీలు సంపూర్ణంగా నెరవేర్చలేదని నిరసన తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రుణ మాఫీ అందరికీ ఇవ్వలేదని, కొత్తరేషన్‌ కార్డ్స్‌ ఇవ్వలేదని నినాదాలు చేస్తూ ప్రచార వా హనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువురి మద్య వాగ్వాదం జరుగుతుండగా ప్రచార వాహనం ముందుకు వెళ్లిపోయింది. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చి అమలు చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

గ్యాస్‌ ధరను పెంచింది బీజేపీనే..

నిజామాబాద్‌నాగారం : కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ. 400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ఒకానొక సమయంలో రూ. 1,200 కూడా దాటిపోయిందని, గ్యాస్‌ ధర పెంచిన పాపం బీజేపీదేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. శనివారం నగరంలోని గోసంగి కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో 4 డయాలాసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉంటే, ప్రస్తుతం 104 సెంటర్లు అందుబాటులోకి తెచ్చామని, కాంగ్రెస్‌ పార్టీ రేటెంతరెడ్డి టికెట్లను అమ్ముకున్నారన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వకపోతే ఓటు అడగనని చెప్పిన సీఎం కేసీఆర్‌ దానిని సవాలుగా తీసుకుని ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇప్పించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీల సీట్లను అమ్ముకుని అగ్రవర్ణాలకు ఇచ్చిందన్నారు. సీట్లు అమ్ముకున్న రేవంత్‌రెడ్డి రేటెంత రెడ్డిగా పేరు మార్చుకున్నారన్నారు. కామారెడ్డి ప్రజలు రాకపోతే ఖాళీ కుర్చీలతోనే రేవంత్‌ మాట్లాడారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మూడోసారి సీఎం అయ్యి చరిత్ర సృష్టిస్తారన్నారు. అలాగే రాష్ట్రంలో దళితులకు మాదిరిగానే గోసంగి కులస్తులకు సైతం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. యువతకు జాబ్‌మేళాలు ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రంలో ఐటీ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి మరోసారి బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవాలని కోరారు.

1/2

2/2

Advertisement
Advertisement