మూడుముక్కలాటకు రహస్య ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

మూడుముక్కలాటకు రహస్య ఏర్పాట్లు

Published Sun, Nov 12 2023 12:36 AM

- - Sakshi

రెండు రోజులు కొనసాగే అవకాశం

ఖలీల్‌వాడి: దీపావళి సందర్భంగా జిల్లాలో పేకాట జోరుగా కొనసాగనున్నది. పేకాట ఆడేవారు రహస్య ప్రాంతాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో వాణిజ్య సముదాయల వద్ద కొనసాగే ఈ పేకాట పోలీసుల దాడులతో రహస్య ప్రాంతాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నగరంతోపాటు ఆర్మూర్‌, బోధన్‌లోని వ్యవసాయక్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఫాంహౌజ్‌లలో పేకాట జోరందుకుంది. కానీ ఈ స్థావరాలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో పోలీసులు బిజీగా ఉండడంతో వారు పేకాట ఆడేందుకు రహస్య ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. అపార్ట్‌మెంట్లు, హోటల్‌, లాడ్జ్‌లు, రాజకీయ నేతల ఇళ్లు, అద్దె భవనాలు, బడా వ్యాపారుల ఇండ్లల్లో పేకాట ఆడేవారికి కేంద్రాలుగా మారాయి.

మహారాష్ట్ర, కర్ణాటకలకు వెళ్తున్న జిల్లావాసులు

జిల్లాలో పేకాట స్థావరాలపై జరుగుతున్న పోలీసుల దాడులతో పేకాట ఆడేవారు జిల్లా సరిహద్దు ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ లాడ్జిలు, గతంలో పేకాట కేంద్రాలు నిర్వహించిన వారిని సంప్రదించి పేకాట ఆడుతున్నారు.

ప్రాంతాన్ని బట్టి పేమెంట్‌

గ్రామీణ ప్రాంతంలో పేకాట ఆడేవారు రూ.500 నుంచి రూ. 5000 వరకు ఆడుతున్నారు. కాకతీయ కాలువ ఉన్న ప్రాంతాల్లో పేకాట ఆడేవారు రూ.1000 లేనిది పేకాట ఆడరు. ఒక రౌండ్‌కు ఇంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పేకాట ఆడే చోట టేబుల్‌కు రూ.5వేలు, మరో టేబుల్‌కు రూ.10 వేలు వరకు చెల్లించి త్రీకార్డ్స్‌, రమ్మీ, కెనస్ట్రా వంటి పేకాట ఆడుతున్నారు. పోలీసులు పేకాటస్థావరాలపై దాడులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement