గ్రహణ మొర్రికి ఉచిత చికిత్స | Sakshi
Sakshi News home page

గ్రహణ మొర్రికి ఉచిత చికిత్స

Published Sun, Nov 12 2023 12:36 AM

గ్రహణమొర్రితో బాధపడుతున్న చిన్నారి - Sakshi

ఆర్మూర్‌: గ్రామీణ ప్రజల్లో పేరుకుపోయిన మూఢ నమ్మకాలను తొలగిస్తూ గ్రహణ మొర్రి, గ్రహణ శీలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి దుర్గాప్రసాద్‌, సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో ఉచిత శస్త్ర చికిత్సల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్‌లోని గచ్చిబోలిలో ఉన్న బసవతారకం ఇండో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్వాహకులు ఉచితంగా ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ఆధారంగా జిల్లావ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌ల సహకారంతో 18 ఏళ్లలోపు గ్రహణ మొర్రి, గ్రహణ శీలతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 మంది విద్యార్థులను గుర్తించి వారిని ఉచిత శస్త్ర చికిత్స నిర్దారణ శిబిరానికి తరలించడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. పిల్లలలో సమస్య తీవ్రతను బట్టి గ్రహణశీలతో బాధపడుతున్న వారికి రెండు నుంచి మూడు పర్యాయాలు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కొందరు పిల్లలకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అయినా సమస్య పరిష్కా రం కాని వారిని సైతం ఈ శిబిరానికి తరలించనున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వైద్య నిపుణులు పిల్లలను పరీక్షిస్తారు. అదే విధంగా ఈ శిబిరంలో గ్రహణ మొర్రి, గ్రహణశీలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్న మూఢ నమ్మకాలను సైతం తొలగించడానికి అవగాహన సదస్సును నిర్వహించనున్నారు.

స్పీచ్‌ థెరపీ సేవలు

గ్రహణ మొర్రి, గ్రహణ శీల శస్త్ర చికిత్సల అనంతరం పిల్లలకు వైద్యులు, సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో స్పీచ్‌ థెరపీ సేవలను సైతం నిర్వహించనున్నారు. విద్యార్థులకు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాలలో శిక్షణనిచ్చి భాషణ లోపాలను సరిచేయనున్నారు. సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించే ఈ శస్త్ర చికిత్స నిర్దారణ శిబిరాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

ఐఈఆర్పీలను సంప్రదించాలి

గ్రహణ మొర్రి, గ్రహణ శీల సమస్యలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు వారి మండలంలో ఉన్న భవిత కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఐఈఆర్పీలను సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి. శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.

– శ్రీనివాస్‌ రావు, సహిత విద్యావిభాగం జిల్లా కోఆర్డినేటర్‌, సమగ్ర శిక్ష

40 మంది గ్రహణ మొర్రి,

గ్రహణ శీల బాధితుల గుర్తింపు

బసవతారకం ఇండో క్యాన్సర్‌

ఆస్పత్రి సహకారంతో శస్త్ర చికిత్సలు

సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం

ఆధ్వర్యంలో బాధితుల వివరాల సేకరణ

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement