బీఆర్‌ఎస్‌ ఎత్తులు | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎత్తులు

Published Sat, Nov 18 2023 1:38 AM

- - Sakshi

‘హస్త’వ్యస్తానికి

విజయమే లక్ష్యంగా సాగుతున్న పార్టీలు.. తమ బలాన్ని పెంచుకోవడంతోపాటు ప్రత్యర్థి బలా న్ని తక్కువ చేయడానికీ ప్రయత్నాలు చేస్తున్నాయి. జోరుగా ప్రచారం చేస్తూనే ఇతర పార్టీలనుంచి వలసలను ప్రోత్సహిస్తున్న అభ్యర్థులు.. ప్రత్యర్థి పార్టీల్లోని ప్రధాన నేతల కండువాలు మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ నేతలపై వల విసురుతూ గులాబీ కండువా కప్పేస్తున్నారు.

షబ్బీర్‌ అలీ సొంత మండలం నుంచే

వలసలు షురూ

గులాబీ కండువా కప్పుకున్న

మాచారెడ్డి మండల అధ్యక్షుడు

ఇప్పటికే పార్టీ మారిన

మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌

మరికొందరిపైనా ఫోకస్‌ చేసిన

అధికార పార్టీ నేతలు

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ నేతలు ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో చురుకై న నేతలతో పాటు, అసంతృప్తితో ఉన్న వాళ్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు మాజీ మంత్రి షబ్బీర్‌అలీ సొంత మండలం మాచారెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు దృష్టి సారించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గణేశ్‌నాయక్‌ను గురువారం రాత్రి మంత్రి కేటీఆర్‌ వద్దకు తీసుకువెళ్లి గులాబీ కండువా కప్పించారు. అదే మండలానికి చెందిన మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొన్నాల లక్ష్మారెడ్డి కండువా మార్చేశారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు తదితరులు లక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లి గులాబీ తీర్థం ఇచ్చారు. మరికొందరు కూడా బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో క్రియాశీల కంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఫోకస్‌ చేసినట్లు సమాచారం. కాగా మాచారెడ్డిలో నాలుగు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు, కామారె డ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి పర్యటనలో చురుకుగా పనిచేసిన మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గణ్‌శ్‌నాయక్‌ అకస్మాత్తుగా పార్టీ మారడంతో కాంగ్రెస్‌ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.

వ్యూహాత్మకంగా అడుగులు..

ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చడం ద్వారా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే వ్యూహంతో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్‌ ఎక్కువగా కాంగ్రెస్‌పై ఫోకస్‌ చేసింది. నియోజకవర్గంలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షబ్బీర్‌ అలీ ఈసారి కామారెడ్డినుంచి పోటీ చేయడం లేదు. ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన కామారెడ్డినుంచి పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నిరాశతో ఉన్నారు. ఇదే అదనుగా బీఆర్‌ఎస్‌ నేతలు వారిని కారెక్కించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నిన్నమొన్నటి దాకా షబ్బీర్‌అలీ వెన్నంటి ఉన్న మాచారెడ్డి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గణేశ్‌నాయక్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పొన్నాల లక్ష్మారెడ్డిలు గులాబీ గూటికి చేరడంతో బీఆర్‌ఎస్‌ నేతలు మరికొందరిపైనా దృష్టి సారించారు.

అలాగే కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి సైతం బలమైన క్యాడర్‌ ఉంది. ఆ పార్టీ శ్రేణులు చాలావరకు బీజేపీ అఽభ్యర్థి కాటిపల్లి వెంకటమరణారెడ్డి వెంటే ఉన్నారు. వాళ్లలో ఇటీవల ఒక కౌన్సిలర్‌ పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు. తర్వాత వెంకటరమణారెడ్డి అనుచరులెవరూ పార్టీని వదిలిపెట్టలేదు. అయితే నియోజకవర్గంలో మరో గ్రూపుగా కొనసాగిన రాష్ట్ర నాయకుడు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గులాబీ కండువా కప్పారు.

అంతా కేటీఆర్‌ కనుసన్నల్లో..

కామారెడ్డి ఎన్నికల ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిత్యం పార్టీ ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడుతూ పరిస్థితి తెలుసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గంలో తటస్తులు, వ్యాపారవేత్తలు, మేధావులతోనూ కేసీఆర్‌ మాట్లాడుతూ వారి మద్దతు కూడగడుతున్నారు. నియోజకవర్గంలో రెండు రోజుల పాటు నాలుగు సమావేశాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ శుక్రవారం పలు మండలాల్లో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. అలాగే ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి మరో రెండు, మూడు పర్యాయాలు నియోజకవర్గంలో కేటీఆర్‌ సుడిగాలి పర్యటనలకు ప్లాన్‌ చేస్తున్నారు.

1/1

Advertisement
Advertisement