కామారెడ్డిపైనే ఫోకస్‌ | Sakshi
Sakshi News home page

కామారెడ్డిపైనే ఫోకస్‌

Published Sat, Nov 18 2023 1:38 AM

- - Sakshi

ఆధిపత్యం కోసం..

ప్రచారంలో పైచేయి సాధించడం కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా దోమకొండ పాత తాలూకాపై ఆ పార్టీలు దృష్టి పెట్టాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. భిక్కనూరు, బీబీపేట, దోమకొండ మండలాల్లో పర్యటించనున్నారు. పెద్దమల్లారెడ్డి, కాచాపూ ర్‌, మాందాపూర్‌, జనగామ, బీబీపేటల లో రోడ్‌షోలలో పాల్గొంటారు. అలాగే పీసీసీ చీఫ్‌, కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సైతం శనివారమే పర్యటించనున్నారు. కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి, రాజంపేట, భిక్కనూరు మండల కేంద్రాలలో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొననున్నారు. ఇద్దరు ముఖ్య నేతలు నిర్వహించనున్న రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో ఒకింత టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇరువురు నేతలు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగే అవకాశాలున్నాయి. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు రెండు పార్టీల నేతలు జన సమీకరణపై దృష్టి సారించారు.

సాక్షి, కామారెడ్డి: ప్రధాన పార్టీలు కామారెడ్డి నియోజకవర్గంపైనే ఎక్కువగా ఫోకస్‌ చేశాయి. ముఖ్యనేతలు పోటీ చేస్తుండడంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ పడుతుండంతో ఇరు పార్టీల నేతలూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిద్దరితో తలపడుతున్న బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి రోజూ ఏడెనిమిది గ్రామాలను చుట్టేస్తున్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నరీతిలో పోటీ నడుస్తోంది. దీంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలో నామినేషన్‌ వేసిన రోజు బహి రంగ సభలో ప్రసంగించారు. ఆయన తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతలు చూస్తున్న మంత్రి కేటీఆర్‌ రెండుమూడు పర్యాయాలు నియోజకవర్గంలో పర్యటించారు. రోజూ పార్టీ నేతలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నామినేషన్‌ వేసిన రోజున సభలో ప్రసంగించారు. మరో రోజు నాలుగైదు చోట్ల కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీ య సమ్మేళనంలో ప్రసంగించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఇటీవల నిర్వహించిన బైక్‌ ర్యాలీ, సభలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా హాజరయ్యారు.

పోటాపోటీ ప్రచారాలకు బీఆర్‌ఎస్‌,

కాంగ్రెస్‌ కసరత్తు

నేడు రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ల రోడ్‌షోలు

పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో

స్పీడ్‌ పెంచిన నేతలు

Advertisement
Advertisement